హెరిటేజ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ దేవాన్ష్‌

టీడీపీ అధినేత చంద్రబాబుకి చెందిన హెరిటేజ్‌ పాలు, పాల ఉత్పత్తులపై చాలా విమర్శలున్నాయి. పొరుగు రాష్ట్రం తమిళనాడులోనూ, ఇంకొన్ని రాష్ట్రాల్లోనూ హెరిటేజ్‌ పాలపై 'విషం' విమర్శల గురించి అప్పుడప్పుడూ వింటూనే వున్నాం. తాజాగా తమిళనాడు మంత్రి ఒకరు హెరిటేజ్‌ పేరు ప్రస్తావించలేదుగానీ, ప్రైవేటు డెయిరీలు సరఫరా చేసే పాలు విషంతో సమానమని చేసిన వ్యాఖ్యలు పెను దుమారమే రేపాయి. 

గుమ్మడికాయల దొంగ.. అనగానే, భుజాలు తడుముకున్న చందాన హెరిటేజ్‌ నుంచి, తమిళనాడు మంత్రి వ్యాఖ్యలకు కౌంటర్‌ దూసుకొచ్చింది. ప్రైవేటు డైరీలు ఉత్పత్తి చేస్తున్న పాలపై విమర్శలు ఇప్పుడు కొత్తగా వస్తున్నవేమీ కాదు. ఎప్పటికప్పుడు డెయిరీలపై అధికారులు దాడులు చేయడం, కల్తీ బాగోతాల్ని బయటపెడ్తుండడం తెల్సిన విషయాలే. ఒక్కోసారి ఈ డెయిరీల నుంచి బయటకొచ్చిన పాల ప్యాకెట్లను కల్తీ చేస్తుండడమూ చూస్తూనే వున్నాం. 

దేశంలో పాల కల్తీ అనేది ఓ 'క్యాన్సర్‌ రోగం'లా తయారయ్యింది. సమాజాన్ని పట్టి పీడిస్తోంది ఈ రోగం ఇప్పుడు. హెరిటేజ్‌ పాలు, పాల ఉత్పత్తులకు సంబంధించి గతంలో వచ్చిన ఆరోపణల సంగతేమోగానీ, 'ప్రైవేటు డైరీల'పై చేసిన ఆరోపణలతో, హెరిటేజ్‌ సంస్థ బాధ్యతల్ని చూసుకుంటున్న నారా బ్రాహ్మణి (చంద్రబాబు కోడలు) స్పందించారు. తన కుమారుడు దేవాన్ష్‌, హెరిటేజ్‌ పాలే తాగుతున్నాడని వ్యాఖ్యానించారామె. ఆ పాలు ఎంత శ్రేష్టమైనవో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలని నారా బ్రాహ్మణి చెప్పుకొచ్చారు. 

మొత్తంగా చూస్తే, ఈ ఎపిసోడ్‌లో హెరిటేజ్‌ సంస్థకి దేవాన్ష్‌ని బ్రాండ్‌ అంబాసిడర్‌గా మార్చేశారనే విషయం సుస్పష్టమవుతోంది. దేవాన్ష్‌, హెరిటేజ్‌ పాలు తాగుతున్నాడని చెప్పడం కంటే, తమ సంస్థ ఉత్పత్తులపై ఎవరైనా విచారణ చేయించుకోవచ్చని ఆమె సవాల్‌ విసిరి వుంటే బావుండేది. చిన్న పిల్లాడి పేరు చెబితే, జనం నమ్మేస్తారనే నారావారి ఆలోచన, ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమయ్యింది.

Readmore!

Show comments