సన్నీలియోన్‌కి కోపమొచ్చేస్తోంది

'పోర్న్‌స్టార్‌ని పోర్న్‌స్టార్‌ అంటే కోపమెందుకు రావాలి.? అవును, నేను పోర్న్‌స్టార్‌నే.. అలాగని ఎవరన్నా అంటే నేనెందుకు ఆగ్రహంతో ఊగిపోతాను.? నా పాత ప్రొఫెషన్‌ని నేనెప్పుడూ మర్చిపోను.. నేను ఒకప్పుడు పోర్న్‌స్టార్‌నని గర్వంగా చెప్పుకుంటాను..' అంటూ ఒకటికి రెండుసార్లు తనే గతంలో తాను పోర్న్‌స్టార్‌నన్న విషయాన్ని గట్టిగా చెప్పేస్తుంటుంది సన్నీలియోన్‌. 

అయితే, ఈ మధ్యకాలంలో సన్నీలియోన్‌లో చాలా మార్పు వచ్చింది. బాలీవుడ్‌ నటిగా స్థిరపడ్డాక, 'పోర్న్‌' అన్న ప్రస్తావన ఆమె ముందు ఎవరు తీసుకొచ్చినా, ఒకింత అసహనానికి గురవుతోంది. ఆ అసహనాన్ని పైకి కనపడనీయకుండా చేసేందుకు నానా తంటాలూ పడ్తోంది సన్నీలియోన్‌. తాజాగా, నెటిజన్లు 'ఎక్కువగా సెర్చ్‌ చేసిన సెలబ్రిటీ' కేటగిరీలో సన్నీలియోన్‌కి ఫస్ట్‌ ప్లేస్‌ దక్కిన విషయం విదితమే. ఈ ఘనత గురించి సన్నీలియోన్‌ ఉబ్బితబ్బిబ్బయిపోతోంది. సరిగ్గా, ఇక్కడే ఆమెకు పెద్ద చిక్కు వచ్చిపడింది. 

'మీరు పోర్న్‌స్టార్‌ కాబట్టే, బహుశా మీరు ఇంటర్నెట్‌లో హాట్‌ సెలబ్రిటీ అయ్యారు.. అదే నెటిజన్లు ఎక్కువగా మిమ్మల్ని సెర్చ్‌ చేయడానికి కారణమేమో..' అని అడిగారు కొందరు. దాంతో, సన్నీలియోన్‌ అవాక్కయ్యింది. కానీ, వెంటనే తేరుకుంది. 'అలా అని ఎందుకు అనుకోవాలి.? బాలీవుడ్‌లో నాకు మంచి ఫాలోయింగ్‌ వుంది.. నటిగా చాలా హిట్‌ సినిమాల్లో నటించాను.. బాలీవుడ్‌లో హాటెస్ట్‌ సెలబ్రిటీని నేను.. అదే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది..' అంటూ వివరణ ఇచ్చుకుంది సన్నీలియోన్‌. 

ప్రస్తుతానికి కోపాన్ని కంట్రోల్‌ చేసుకుంటున్నా, ఆమెను రెచ్చగొట్టడానికి రాఖీ సావంత్‌ లాంటోళ్ళు ఎప్పుడూ రెడీగానే వుంటున్నారు. సో, ఇప్పుడిప్పుడే అసహనం పెంచుకుంటున్న సన్నీలియోన్‌.. లోలోపల పెరుగుతోన్న కోపాన్ని, ఎప్పుడో ఒకప్పుడు బయటపెట్టకుండా అయితే వుండదు. ఆల్రెడీ ఆమె కోపాన్ని కొందరు బాలీవుడ్‌ మీడియా ప్రతినిథులు చవిచూశారన్నది ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ కథనం.. అదీ ఈ మధ్యనేనట.

Show comments