ఆ రకంగా చంద్రబాబుపై నమ్మకం పోయింది!

సాధారణంగా కార్పొరేట్ రంగంలో ఉద్యోగులకు పర్సనాలిటీ డెవలప్ మెంట్ క్లాసులు తీసుకునేప్పుడు ఒక నీతిని చెబుతూ ఉంటారు. ‘‘మీ మీ కంపెనీల్లో పెద్ద తలకాయలుగా గుర్తింపు ఉన్నవారు... ఒక్కొక్కరుగా కంపెనీని వదలి వెళుతున్నారనుకోండి.. మీ కంపెనీ ప్రమాద పరిస్థితిలో ఉన్నదనడానికి అది సంకేతం. మీరు కూడా జాగ్రత్త పడితే మంచిది’’ అనేది ఆ సిద్ధాంతం.

ఆ సిద్ధాంతాన్ని బట్టి చూస్తే.. ఏపీలో చంద్రబాబునాయుడు ప్రభుత్వ పనితీరు ఈసురోమని అంటున్నట్లే లెక్క. ప్రభుత్వంతో ఒప్పందాలనుంచి తప్పుకుని.. ఎంతో రెప్యుటేషన్ గుర్తింపు ఉన్న పెద్దలు కూడా పక్కకు మరలడం ఇలాంటి సందేహాలకు తావిస్తోంది.

దేశంలోనే మెట్రో రైల్ వ్యవస్థకు పితామహుడిగా శ్రీధరన్ గురించి అందరికీ తెలుసు. తన ఇంటిపేరునే మెట్రోగా మార్చుకుని ‘మెట్రో శ్రీధరన్’ గానే ఆయన అందరికీ పరిచితుడు. చంద్రబాబు కూడా ఆయనను గతంలో పలుమారు పలు విధాలుగా కీర్తించారు. విజయవాడ మెట్రో ఏర్పాటు బాద్యతను కూడా ఆయన చేతుల్లోనే పెట్టారు చంద్రబాబునాయుడు. ఆయన ఆధ్వర్యంలోని ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ (డీఎంఆర్ సీ) ను విజయవాడ మెట్రో మార్గానికి ప్రధాన సలహాదారు బాధ్యతల్లోకి తీసుకున్నారు.

అయితే ఈ బాధ్యతలనుంచి తప్పుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సగం మంది స్టాఫ్ ను వెనక్కు పిలిపించిన డీఎంఆర్‌సీ విజయవాడలోని కార్యాలయాన్ని కూడా మూసివేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. శ్రీధరన్ ను సలహాదారు బాధ్యతల్లోకి తీసుకున్న తరువాత.. ఇంకా టెండర్ల ప్రక్రియ ముగియకుండానే.. చంద్రబాబు సర్కారు లైట్ మెట్రో రైలు వ్యవస్థ గురించిన ఆలోచన చేసింది. దీనికి ఓకే చెప్పేసి జర్మనీ కి చెందిన ఓ సంస్థకు ప్రాజెక్టు నివేదిక పనులను అప్పగించడం జరిగింది. ఇదంతా గమనించిన శ్రీధరన్ తాను పక్కకు తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

నిజానికి మరికొన్ని సంగతులు కూడా వినిపిస్తున్నాయి. మెట్రో శ్రీధరన్ అంటే .. దేశంలోనే ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆయన విజయవాడకు వచ్చిన రెండు సందర్భాల్లో చంద్రబాబునాయుడును కలవడానికి ప్రయత్నిస్తే కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని.. అది కూడా ఆయన మనస్తాపానికి ఒక కారణం అని చెబుతున్నారు. అయితే గడియకో రకంగా ఆలోచనలు మార్చుకునే చంద్రబాబు ప్రభుత్వ వైఖరి నచ్చకనే, ఆయన మీద నమ్మకం పోయినందునే శ్రీధరన్ ఈ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లుగా పలువు పేర్కొంటున్నారు.

Show comments