పరువు పోగొట్టుకోవడమెలాగంటే.!

రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఐక్యతను చాటాలని కాంగ్రెస్‌ పార్టీ ఉబలాటపడింది. నిజానికి ఏం చేసినా, రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్‌ బలపర్చిన అభ్యర్థి గెలిచే అవకాశం లేదు. కానీ, ఛాన్స్‌ తీసుకుంది. లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ని రంగంలోకి దించింది.

మీరాకుమార్‌ ఎవరో కాదు, బాబూ జగ్జీవన్‌రామ్‌ కుమార్తె కూడా. అలా ఆమెను బరిలోకి దింపడం వెనుక కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద వ్యూహమే వుంది. అయితే, ఇక్కడ కాంగ్రెస్‌ 'మేం పోటీ ఇవ్వగలం..' అనే నమ్మకంతో బరిలోకి దిగకపోవడమే ఆ పార్టీ చేసిన అది పెద్ద తప్పిదం. తత్ఫలితంగా అభాసుపాలయ్యిందెవరు.? మీరాకుమార్‌ మాత్రమే.! 

కాంగ్రెస్‌ పార్టీకి గెలుపోటములు కొత్తేమీ కాదు. కాబట్టి, 'ప్రయత్నించాం.. ఓడిపోతామని తెలుసుగానీ, ఓ ఆలోచనతో నిలబెట్టాం.. కొంతమేర మేం విజయం సాధించినట్లే.. మాదే నైతిక విజయం..' అంటూ కాంగ్రెస్‌ నేతలు చావు కబురు చల్లగా చెబుతున్నారిప్పుడు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ ప్రతిపాదించిన రామ్‌నాథ్‌ కోవింద్‌ 65 శాతంపైగా ఓట్లతో ఘనవిజయం సాధించడంతో బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కన్పిస్తోంది.

కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి గట్టిగానే క్రాస్‌ ఓటింగ్‌ జరిగింది. పశ్చిమబెంగాల్‌లో అధికార తృణమూల్‌ పార్టీకీ షాక్‌ తగిలింది. ఇలా చెప్పుకుంటూ పోతే, కాంగ్రెస్‌ పార్టీ మీరాకుమార్‌ని నిలబెట్టడం ద్వారా కొద్దోగొప్పో బీజేపీకి మేలు చేసినట్లయ్యిందన్నది నిర్వివాదాంశం. బీజేపీని దెబ్బకొడదామనే ఉద్దేశ్యంతో రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి 'సై' అన్న కాంగ్రెస్‌ పార్టీ, తాను అభాసుపాలయ్యిందేగాక, మిత్రపక్షాల్నీ బజారుకీడ్చేసింది.

మొత్తంగా చూస్తే, 'పరువు పోగొట్టుకోవడం ఎలా.?' అన్న ఆలోచనతోనే కాంగ్రెస్‌ రాష్ట్రపతి ఎన్నికల కోసం 'తగుదునమ్మా..' అని తయారైనట్లుంది. ఆ లెక్కన కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించినట్లే.!

Show comments