పవన్‌కళ్యాణ్‌కి ఎంత కష్టమొచ్చింది.!

కోటిన్నర ఖర్చు చేసి.. ఎంతో ముచ్చటపడి కొనుక్కున్న మెర్సిడెస్‌ బెంజ్‌ కారుని సినీ నటుడు పవన్‌కళ్యాణ్‌ అమ్మేశాడు. ఇదిప్పటి మాట కాదు. అయితే, ఆ కారుని ఆయన ఎందుకు అమ్మేశాడు.? అన్నదే ప్రశ్న. 'ఆర్థిక కారణాలతో..' అనే ప్రచారం ఇప్పటిదాకా జరుగుతూ వచ్చింది. ఆ ప్రచారాన్ని పవన్‌కళ్యాణ్‌ తాజాగా ధృవీకరించారు. 'ఇన్‌స్టాల్‌మెంట్‌ కట్టలేక అమ్మేశాను..' అంటూ పవన్‌కళ్యాణ్‌ వ్యాఖ్యానించడంతో అంతా విస్తుపోవాల్సి వచ్చింది. 

పవన్‌కళ్యాణ్‌ 'సై' అనాలేగానీ, పదిహేను నుంచి 20 కోట్ల దాకా రెమ్యునరేషన్‌ చెల్లించే నిర్మాతలున్నారు. చెయ్యాలనుకుంటే పవన్‌కళ్యాణ్‌ ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసెయ్యొచ్చు. అలాంటి పవన్‌కళ్యాణ్‌, 'కోటిన్నర ఖర్చు చేసి కొనుక్కున్న' మెర్సిడెస్‌ బెంజ్‌ కారుని.. అదీ ముచ్చటపడి కొనుక్కున్న కారుని, ఇన్‌స్టాల్‌మెంట్‌ చెల్లించలేక అమ్మేయడమేంటట.? 

ఇక, ఇదే కారు పవన్‌ అమ్మేస్తే, దాన్ని ఏపీ మంత్రి నారాయణ తనయుడు నిశిత్‌ కొనుగోలు చేశాడన్న ప్రచారం జరుగుతుండగా, దానిపై పవన్‌ స్పందించాడు. 'అది నా కారు కాదు. నేను అమ్మేసింది కాస్త పాత మోడల్‌. ఇప్పుడు ప్రమాదం జరిగింది అడ్వాన్స్‌డ్‌ వెహికిల్‌..' అంటూ పవన్‌ క్లారిటీ ఇచ్చేశాడు. 

ఇంకోపక్క, కేంద్ర మంత్రి అశోక్‌ గజపతిరాజు తనకు పవన్‌కళ్యాణ్‌ ఎవరో తెలియదని చేసిన వ్యాఖ్యలపైనా పవన్‌ స్పందించాడు. ఆపుకోలేనంత నవ్వు వచ్చేసింది, ఈ అంశంపై స్పందించేటప్పుడు పవన్‌కళ్యాణ్‌కి. 'నేనెవరో ఆయనకు తెలియకపోవచ్చు, నాకు మాత్రం ఆయన బాగా తెలుసు..' అంటూ నవ్వేశారు పవన్‌కళ్యాణ్‌. ధర్నా చౌక్‌ తరలింపు సబబు కాదనీ, శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యం కల్పించిందనీ, ఆ హక్కుని కాలరాయడం పాలకులకు తగదని తెలంగాణ సర్కార్‌కి 'ఉచిత సలహా' ఇచ్చారాయన. ఉత్తరాది - దక్షిణాది విభేదాల్ని తాను తెరపైకి తీసుకురావడంలేదనీ, ఉత్తరాదితోపాటు దక్షిణాదికీ సమాన అవకాశాలు రావాలన్నదే తన డిమాండ్‌ అనీ పవన్‌కళ్యాణ్‌ చెప్పుకొచ్చారు. 

మొత్తమ్మీద, పవన్‌కళ్యాణ్‌ తన ఆర్థిక ఇబ్బందుల గురించి బయటపెట్టడానికి ఏదో ఒక సందర్భం వెతుక్కుంటుండడం విశేషమే మరి. ఆ మధ్య ఓ బహిరంగ సభలోనే, 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ సినిమా బాగా ఆడలేదు.. ఈసారి సినిమా బాగా చూడండి.. అప్పుడు నాకు డబ్బులొస్తాయ్‌..' అంటూ వ్యాఖ్యానించిన విషయం విదితమే. పార్టీని బలోపేతం చేయడం, ఎన్నికల్లో పోటీ చేయడం గురించి మాట్లాడేటప్పుడు పవన్‌, 'డబ్బుల ప్రస్తావన' తీసుకు రావడం మామూలే. ఈసారి కారు అమ్మేయడానికి ఇన్‌స్టాల్‌మెంట్‌ కట్టలేనంత దీనస్థితిని బయటపెట్టడమేంటట.? అభిమానులేమో పవన్‌ని ఎక్కడో ఊహించుకుంటారు.. ఆయనేమో గ్రౌంట్‌ టు ఎర్త్‌.. అంతకన్నా కిందకి.. అన్నట్లుగా ప్రొజెక్ట్‌ చేసుకునేందుకు తంటాలు పడ్తుంటారు. అయ్యోపాపం.. పవన్‌కళ్యాణ్‌.!

Show comments