కోడెల గారూ.. ఇంతకు మించి సీనేముందిలే!

నీతులు చెప్పమంటే చెబుతాం కానీ.. వాటిని పాటించమంటే ఎలా? నీతులు తప్పడానికి సాకులు మాకు తెలియనవా? అన్నట్టుగా ఉంది ఏపీ ప్రభుత్వ పెద్దల తీరు.  టీవీల్లో కూర్చుని..సమాజం ఏమైపోతోందో.. పరిస్థితులు ఎంత దారుణంగా తయారవుతున్నాయో ఆందోళన వ్యక్తం చేయడంలో ఏపీ స్పీకర్ గారు మాగొప్ప విశ్లేషకులు. ఇటీవలే టీవీలో ప్రసారం అయిన ఇంటర్వ్యూనే అందుకు సాక్షి. ప్రజాస్వామ్య విలువలు పతనం అవుతున్న తీరు గురించి, తనలాంటి వాళ్లు కూడా గెలవడానికి ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుందో కూడా వివరించి…జనాలు ఎంత మనీ మైండెడ్ గా మారిపోయారో ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఇటీవలే ఒక టీవీ ఇంటర్వ్యూలో ఏకరువు పెట్టారు.

అయితే ఇప్పుడు మాత్రం తను అనలేదని సింపుల్ గా తేల్చేసిన కోడెల గారికి వైకాపా ఫిరాయింపుల విషయంలో వచ్చిన ఫిర్యాదులు సాంకేతికంగా చెల్లవని సెలవిచ్చారు! అది కూడా వైకాపా వాళ్లు ఫిర్యాదులు చేసిన కొన్ని నెలలకు ఈ మాత్రం ప్రకటన అయినా చేశారు. అవతల ఫిరాయింపుదారులైన ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో చేరామని ప్రకటించుకుంటున్నారు. తమకు పుట్టినిల్లులోకి వచ్చిన ఫీలింగ్స్ గురించి ఉద్వేగభరింతంగా వివరిస్తున్నారు. తెలుగుదేశం నేతలు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నారు. ఎమ్మెల్యేలను చేర్చుకున్నాం.. చేర్చుకోబోతున్నాం అని కూడా వాళ్లు తేల్చి చెబుతున్నారు. అయితే ఫిర్యాదులు మాత్రం సాంకేతికంగా చెల్లవట!

అయినా సాంకేకతికంగా కరెక్టుగా ఉంటే మాత్రం వేటు వేసేస్తారా? నిజంగానే ప్రస్తుత రాజకీయంలో స్పీకర్ వ్యవస్థ కు అంత సీనుందా? ఇక్కడ కోడెల వారు వ్యక్తిగతంగా ఏదో చేసేస్తారని ఎక్స్ పెక్ట్ చేసిన వారు కూడా ఎవరూ లేరు. ఏపీలో అయినా.. తెలంగాణలో అయినా స్పీకర్ల కు ఇలాంటి ఫిరాయింపుదారులపై వేటు వేసేంత సీనే ఉంటే.. అసలు ఈ ఫిరాయింపులే జరిగేవి కావనేది వాస్తవం. ఫిరాయింపుల విషయంలో ప్రతిపక్ష పార్టీల ఫిర్యాదులు ఆంధ్రలో అయినా.. తెలంగాణలో అయినా సాంకేతికంగా చెల్లవు..  మళ్లీ ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు వచ్చేంత వరకూ కూడా  ఇలాంటి ఫిర్యాదులు చెల్లవంతే. సాంకేతిక కారణాల  వాదనలే.. అనైతిక రాజకీయాలకు శ్రీరామరక్ష!  

 

Show comments