మాజీ హీరోయిన్ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం!

ఒకే ఒరలో రెండు కత్తులు ఒదగవు.. అలాగే ఒకే పార్టీలో ఇద్దరు హీరోయిన్లు పొసగడం కూడా సాధ్యం అయ్యే పని కాదు. ప్రాంతీయ పార్టీల్లో హీరోయిన్ల ను చూసినా, జాతీయ పార్టీల్లో ఏదైనా ఒక రాష్ట్రంలో చోటు చేసుకునే హీరోయిన్ల రాజకీయాలను గమనించినా ఇదే విషయం స్పష్టం అవుతుంది. స్త్రీకి స్త్రీయే శత్రువు.. అనే మాటను ప్రాక్టికల్ గా నిరూపిస్తుంటారు ఈ మహిళామణులు.

ఇప్పుడు తమిళనాడు కాంగ్రెస్ లో ఇద్దరు హీరోయిన్ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది. వాళ్లిద్దరూ ఒక దశలో తమిళ తెరపై  క్వీన్స్ గా చలమాణీ అయిన వాళ్లే. ఇప్పుడు ఒకే రాజకీయ పార్టీలో వాళ్లు తలపడుతున్నారు! ఖుష్బూ, నగ్మా.. ఆ తారామణులు. 

కొన్నాళ్ల నుంచి కాంగ్రెస్ లో కొనసాగుతోంది ఖుష్బూ, చాలా యేళ్ల నుంచి కాంగ్రెస్ లో ఉన్న నగ్మాను ఇటీవల తమిళనాడుకు పంపించింది ఆ పార్టీ అధిష్టానం! ఇంకేముంది.. వీళ్లిద్దరూ ఉప్పునిప్పులా మారిపోయారు. ఒకరి రాజకీయ ఉన్నతికి మరొకరు అడ్డు అవుతారనే భయమో.. లేక ఇంకేమైనా ఈర్షాసూయలు ఉన్నాయేమో కానీ.. వీరి మధ్య పరోక్ష మాటల యుద్ధం సాగుతోంది.

నగ్మా తీరును చూస్తూ ఉంటే.. ఖుష్బూను పార్టీ నుంచి బయటకు పంపించేంత వరకూ నిద్రపోయేలా లేదు! ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ ఇద్దరు హీరోయిన్లకూ ముస్లిం మూలాలున్నాయి. అయితే హిందువులుగా కొనసాగుతున్నారు. ఖుష్భూ పుట్టింది ముస్లిం కుటుంబంలో.. హిందూ వ్యక్తిని పెళ్లి చేసుకుని ఆమె నుదుట సింధూరాన్ని పెట్టుకుంటుంది. ఇక నగ్మా మూలాల్లో కొంత ముస్లిం జీన్స్ ఉంది.

ఇటీవల తలెత్తిన ‘ట్రిపుల్ తలాక్’ అంశం గురించి ఈ హీరోయిన్లు ఇద్దరూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రత్యేకించి ఖుష్బూ వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని నగ్మా ఖండించింది. ఖుష్బూ .. ట్రిపుల్ తలాక్ ను సమర్థించలేదు. అయితే పార్టీ అజెండా ప్రకారం అది తప్పు అన్నట్టుగా నగ్మా మాట్లాడుతోంది. ఖుష్భూ పార్టీ అజెండాకు అనుగుణంగా నడుచుకోవాలన్నట్టుగా దెప్పిపొడచడమే కాదు.. “ఇస్లాం గురించి నాకే ఎక్కువ తెలుసు’’ అన్నట్టుగా మాట్లాడటంతో పాటు, ఖుష్బూ కట్టూ బొట్టు గురించి కూడా ఎద్దేవా చేస్తున్నట్టుగా నగ్మా మాట్లాడింది. 

అయితే  ఆమె వివాదాస్పద వ్యాఖ్యల పట్ల ఖుష్బూ అసహనంతోనే ఉన్నా.. పైకైతే ఏమీ స్పందించలేదు. ప్రస్తుతానికి ఆమె సైలెంట్ గా ఉంది. మొత్తానికి ఈ మాజీ హీరోయిన్లు ఒకే పార్టీలో సాగుతూ చేసుకున్న యుద్ధం ఆసక్తికరంగా ఉంది. ముందు ముందు వీరు ఎలా తలపడతారో!

Show comments