తెలుగుదేశం అధినేత చంద్రబాబు వియ్యంకుడు, నందమూరి నటసింహం … బాలకృష్ణ సతీసమేతంగా నిర్వహించిన ప్రత్యేక పూజలకు సంబంధించిన ఫొటోలు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో హల్ చల్ చేస్తున్నాయి. బాలయ్య “కాలసర్ప దోష నివారణ’’ పూజలు చేశాడు అని తెలుస్తోంది. ఉన్నట్టుండి ఈ పూజలు ఎందుకు చేశారు? అంటే… టక్కున వినిపించే మాట పదవీయోగం కోసం అని.
ఈ కాల సర్ప దోష నివారణ పూజను పదవీ యోగం కోసమే చేస్తారని.. శాస్త్రం ఎరిగిన వారు చెబుతున్నారు. మరి బాలయ్య టార్గెట్ లోని ఆ పదవి ఏది? అంటే.. అయిన వాళ్లు బహుశా మంత్రి పదవి అయ్యుండొచ్చు అంటుంటే.. కాని వాళ్లు మాత్రం కచ్చితంగా ముఖ్యమంత్రి పదవే అని అంటున్నారు!
తనకు మంత్రి పదవి మీద ఉన్న ఆసక్తిని ఇప్పటికే చాటుకుంది నందమూరి నటసింహం. అసెంబ్లీ సమావేశాల సమయంలోనే తన పార్టీ ఎమ్మెల్యేల దగ్గర తన ఆసక్తిని బాలకృష్ణ బయటపెట్టేసుకున్నాడు. పర్యాటక శాఖ అయితే బావుంటుందనేది కూడా బాలయ్య అభిప్రాయమే అని తెలుస్తోంది.
అయితే ఇప్పటి వరకూ ఆ కోరిక తీరలేదు. బాలయ్య కోరికను ఎవరూ పెద్దగా పట్టించుకునే వాళ్లు కూడా లేరు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూడా.. లోకేష్ బాబు మంత్రి వర్గంలోకి రావాలంటారు, ఆయనను ప్రసన్నం చేసుకునే యత్నం చేస్తారు కానీ.. బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేసే ఎమ్మెల్యే ఎవరూ లేకుండా పోయారు. ఇక అభిమాన సంఘాలైనా ఎక్కడైనా అలజడి రేపుతాయా? అంటే అదీ లేకుండా పోయింది! జూనియర్ ఎన్టీఆర్ పై దుమ్మెత్తిపోయడానికి రెడీగా ఉండే బాలయ్య అభిమాన సంఘాలు.. నటసింహానికి మంత్రి పదవి దక్కకపోవడంపై మాత్రం మారు మాట్లాడటం లేదు.
ఈ నేపథ్యంలో బాలయ్య సతీసమేతంగా పూజలు చేసి.. దోష నివారణ చేసి.. పదవీయోగం కోసం ఎదురుచూస్తున్నట్టుగా ఉన్నాడు. బాలయ్య ఇంత పెద్ద పూజలు చేసినా.. అక్కడ లోకేష్ దంపతులు కానీ, వియ్యంకులు చంద్రబాబు దంపతులు కానీ కనపడకపోవడంతో.. ఇది పూర్తిగా ఆయన వ్యక్తిగత యోగం గురించి చేపట్టిన యాగం అనుకోవాల్సి వస్తోంది.
ఒకవైపు లోకేష్ ను మంత్రి వర్గంలోకి తీసుకోవడం గురించి తర్జనభర్జనలు కొనసాగుతున్న తరుణంలో.. బాలయ్య ఇలాంటి యజ్ఞాలూ యాగాలు చేస్తే బాబు సహించగలరా అని?