నంద్యాల్లో టీడీపీ ప్రచారం.. ఒక్కోరి లెక్క ఒక్కోటి..!

ఎవరికివారే.. అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు తెలుగుదేశం నేతలు. భూమానాగిరెడ్డి మరణంతో అనివార్యం అయిన ఈ ఉపఎన్నికపై తెలుగుదేశం పార్టీ ఎంత శ్రద్ధ పెట్టిందో వేరే చెప్పనక్కర్లేదు. పార్టీఓడితే.. ఒకరకంగా కాదు, అన్ని రకాలుగానూ దెబ్బే.. అనే విశ్లేషణల మధ్య తెలుగుదేశం నేతల ప్రచారం సాగుతోంది. నంద్యాల్లో టీడీపీ ఓడితే.. చంద్రబాబుపై వచ్చే విమర్శలు అన్నీఇన్నీ కావు. బాబు మూడేళ్లపాలన మీద రెఫరండంలాంటిది ఈ ఉపఎన్నిక. మరి ఇందులో గనుక టీడీపీ ఓడితే అంతే సంగతులు.

టీడీపీ ఓడితే.. బాబు పాలనకు జనామోదం లేదనేది తేటతెల్లం అవుతుంది. మూడేళ్ల నుంచి బాబు అనుసరించిన ప్రతి విధానాన్ని ప్రజలు తిరస్కరించినట్టు అవుతుంది. అమరావతి అయితేనేం.. డెవలప్‌మెంటు ఊసు అయితేనేం.. ప్రజలు దేన్నీ విశ్వసించడం లేదని స్పష్టం అవుతుంది. ప్రత్యేకించి బాబు మార్కు మాయను ప్రజలు అస్సలు నమ్మడం లేదని స్పష్టం అవుతుంది. బాబును నమ్మకపోవడమే కాదు.. ప్రభుత్వ వ్యతిరేకత కూడా బలంగా ఉందని స్పష్టం అవుతుంది. అలాగే.. ఫిరాయింపు రాజకీయాలకు కూడా ఇది చెంపపెట్టు అని స్పష్టత వస్తుంది.

ఫిరాయించిన వారిని ప్రజలు ఛీ కొడుతున్నారని స్పష్టం అవుతుంది. ఆఖరికి వాళ్లు మరణించినా కూడా ప్రజలు వారి వారసులపై జాలిచూపడం లేదనే క్లారిటీ వస్తుంది. దీంతో మిగతా ఫిరాయింపుదారులకు కూడా గుండెల్లో రైళ్లు పరిగెట్టడం మొదలవుతుంది. తెలుగుదేశం పార్టీపై వస్తున్న అవినీతి అక్రమాల ఆరోపణలను కూడా ప్రజలు విశ్వసిస్తున్నట్టే అనే స్పష్టత వస్తుంది.

ఇన్ని రకాలుగా అధికార పార్టీని హడలు కొడుతోంది కాబట్టే.. నంద్యాల ఉపఎన్నికపై బాబు ఈ స్థాయిలో దృష్టి సారించాడు. ఇంతమంది నేతలను రంగంలోకి దించి విజయం కోసం అన్నియత్నాలూ చేస్తున్నాడు. ఇదంతా బాబుగారి లెక్క!

ఇక నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న నేతల విషయానికి వస్తే వారి లెక్కలు వారికున్నాయి. తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేస్తున్న లోకల్‌ లీడర్ల సంగతి గురించిన ప్రచారం అయితే మరీ ఆసక్తికరమైనది. ఎవరికి వాళ్లు తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు కానీ.. లోపల్లోపల మాత్రం వారి వారి సమీకరణాలు వారికున్నాయని నంద్యాల్లో ప్రచారం జరుగుతోంది.

ముందు ఎస్పీవై రెడ్డి విషయానికి వస్తే.. ఈయన పార్టీ అభ్యర్థి గెలుపు వెనుక వేరే ఆలోచనను పెట్టుకున్నారు. నంద్యాల్లో పార్టీ గెలిస్తే.. వచ్చే ఎన్నికల్లో ఎంపీ సీటును గట్టిగా డిమాండ్‌ చేయవచ్చు. నంద్యాల్లో గెలిపించాం కదా.. తెలుగుదేశం కోసమే పనిచేశాం కదా.. అని ఎస్పీవై రెడ్డి భావిస్తున్నట్టు సమాచారం. టీడీపీ తరపున వచ్చేసారి తన అల్లుడిని ఎంపీగా పోటీ చేయించాలని ఎస్పీవై రెడ్డి ఆశిస్తున్నాడు. అందుకోసమే నంద్యాల్లో ప్రచారం చేస్తున్నట్టుగా కనిపించడానికి ఆయన తాపత్రయ పడుతున్నాడు. అందుకే ఎస్పీవై ప్రచారం చేస్తున్నాడు. భూమా వారసులను గెలిపించాలని కాదు.

ఇక ఫరూక్‌ .. ఈసారి గనుక బ్రహ్మానందరెడ్డి ఓడిపోతే.. వచ్చేసారి తప్పనిసరిగా నంద్యాల ఎమ్మెల్యే టికెట్‌ తనదే అనేది ఫరూక్‌ సమీకరణం. అయితే ఈయనకు చంద్రబాబు నాయుడు పదవీ రుచి చూపించాడు. ఎమ్మెల్సీ పదవిని ఇచ్చేసి.. పార్టీ గెలిస్తే మండలి చైర్మన్‌ పదవి.. అనే ఎరవేశాడు. దీంతో ఫరూక్‌ ఇప్పుడు పార్టీ కోసమే పని చేస్తున్నాడు. అయితే.. చాలాకాలం నుంచి నంద్యాల్లో ఫరూక్‌ ఎలాంటి పదవీలేకుండా గడిపేశాడు. దీంతో.. ఈయనకు తన వర్గాన్ని గట్టిగా ప్రభావితం చేసే శక్తి లేకుండా పోయింది.

ఇక టీడీపీ తరపున ప్రచారం చేస్తున్న లోకల్‌ లీడర్లలో కొంతమంది.. భూమా వారసులు ఓడితే చూడాలనే ఆశతోనే ఉన్నారని తెలుస్తోంది. ఇప్పుడు గనుక భూమా వారసులు గెలిస్తే.. తమ భవిష్యత్తుకు ప్రమాదం అనేది వీరిలెక్క. ఒకచేతిలో మంత్రిపదవి, మరోచేతిలో నంద్యాల ఎమ్మెల్యే పదవి.. వీటిని ఆధారంగా చేసుకుని వారు రెచ్చిపోతారు. నంద్యాల్లో మరొకరిని లేవనివ్వరు... అందులోనూ వాళ్లు యూత్‌.

ఒక్కసారి కుదురుకున్నారంటే.. మరో రెండు మూడు దశాబ్దాల పాటు హవా ఉంటుంది. అందుకే ఇప్పుడే తొక్కాలని వీళ్లు భావిస్తున్నట్టు సమాచారం., ఇప్పుడే అణగదొక్కేస్తే ఇక మళ్లీ లేవలేరు. అయితే పైకిమాత్రం అంతా సానుకూలంగానే ప్రచారం చేస్తున్నా.. లోపల మాత్రం వీరి వ్యూహాలను వీరు అమల్లో పెడుతున్నట్టు సమాచారం.

Show comments