ఆంధ్రప్రదేశ్‌లో ఆపరేషన్ ఆకర్ష విషయంలో నారా లోకేష్ చూపిస్తున్న శ్రద్ధ అంతా ఇంతా కాదు. పార్టీ మారే నేతలు తొలుత నారా లోకేష్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆ తర్వాతే చంద్రబాబుతో సమావేశానికి ఛాన్స్ దొరుకుతోంది. టీడీపీలో చేరిపోయాక కూడా పార్టీ మారిన నేతలు, లోకేష్ ద్వారానే చంద్రబాబు వద్దకు వెళ్ళాల్సి వస్తోంది. తప్పదు మరి, నారా లోకేష్ అంటే యువరాజు. పైగా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కదా.!
అందరికీ తెల్సిన విషయమే ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీ వలసల్ని మేగ్జిమమ్ ప్రోత్సహిస్తోంది. కాదు కాదు, ప్రలోభాలు పెట్టి.. బెదిరింపులకు గురిచేసి.. ఎలాగైతేనేం, ప్రతిపక్షం నుంచి ఎమ్మెల్యేలను లాగేసుకుంటోంది. ఏడాదిన్నర వరకు చంద్రబాబు పప్పులుడకలేదు ఈ విషయంలో. ఆ తర్వాతే అసలు కథ మొదలయ్యింది. ఈ ఏడాది ప్రారంభం నుంచే తెలుగుదేశం పార్టీ నుంచి వలసలు అధికారికంగా జోరందుకున్నాయి.
అంతకు ముందు.. అంటే ఎన్నికలు పూర్తయినవెంటనే వైఎస్సార్సీపీకి చెందిన ఎస్పీవై రెడ్డి, టీడీపీ వైపుకి వచ్చేశారు. ఆ తర్వాత మరో ఎంపీ బుట్టా రేణుక కూడా టీడీపీ వైపు వెళ్ళారుగానీ, వెంటనే మనసు మార్చుకున్నారు. అరకు ఎంపీ కొత్తపల్లి గీత మాత్రం, వైఎస్సార్సీపీకి దూరమయ్యారు.. టీడీపీతో టచ్‌లో వున్నారు. ఎంపీలు తప్పితే, ఎమ్మెల్యేలు రాకపోవడం చంద్రబాబుకి అస్సలేమాత్రం నచ్చలేదు. అంతే, ఆపరేషన్ ఆకర్ష షురూ చేశారు. అదిప్పుడు నిర్విఘ్నంగా కొనసాగుతోంది.
ఇక, ఆపరేషన్ ఆకర్ష క్రెడిట్ అంతా నారా లోకేష్ ఖాతాలో వేసేసి, అదేదో లోకేష్ బలం.. అన్నట్లుగా చంద్రబాబు ప్రొజెక్ట్ చేస్తున్నారు. తప్పదు, ప్రలోభాలకు లొంగిపోయి, బెదిరింపులకు తలొగ్గి టీడీపీలో చేరుతున్న నేతలు తమ సీనియారిటీని పక్కన పెట్టి మరీ లోకేష్‌కి సలాం కొట్టవలసి వస్తోంది. ఇంకోపక్క, లోకేష్.. ఆపరేషన్ ఆకర్ష విషయంలోనే కాకుండా, ప్రభుత్వ వ్యవహారాల్లోనూ గట్టిగానే తలదూర్చేస్తుండడం సీనియర్లకు కొత్త తలనొప్పులు తీసుకొస్తోంది. ఇది వాళ్ళూ వీళ్ళూ చెప్పిన మాట కాదు, టీడీపీలోనే అంతర్గతంగా ఈ వ్యవహారంపై గట్టి చర్చే జరుగుతోంది.
ఇప్పటికే పార్టీ మారిన నేతల్లో కొందరు అసంతృప్తితో రగిలిపోతున్నారనీ, వారి అసంతృప్తిని 'కవర్' చేయడానికి, మిగతా నేతల్ని మీడియా ముందుకి తీసుకొచ్చి, జగన్‌పై ఘాటైన విమర్శలు చేయిస్తున్నారనీ, ఇంకోపక్క అసంతృప్తితో రగిలిపోతున్న నేతలకు బెదిరింపులు, బుజ్జగింపులు లోకేష్ ద్వారా జరుగుతున్నాయనీ తెలుస్తోంది.
కాగా, 'పార్టీ కోసం నేనింత కష్టపడుతున్నా.. మంత్రులుగా మీరేం చేస్తున్నారు.?' అంటూ లోకేష్ ఇటీవల ఒకరిద్దరు సీనియర్ నేతలకు క్లాస్ తీసుకోవడంతో అది కాస్తా చంద్రబాబు దృష్టికి వెళ్ళిందట. 'చినబాబుతో టచ్‌లో వుండండి.. పార్టీ కోసం కష్టపడాలి కదా..' అని చంద్రబాబూ క్లాస్ తీసుకునే సరికి, ఆ మంత్రులు షాక్‌కి గురయ్యారట. వీరిలో రాయలసీమకు చెందిన ఓ సీనియర్ మంత్రి, అలాగే ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన మరో మంత్రి వున్నారని సమాచారమ్.
'ఎన్నికల్లో గెలవలేకపోయారు.. అయినా మంత్రి పదవులు ఇచ్చాం.. పార్టీపై శ్రద్ధ పెట్టకపోతే కష్టం..' అని ఓ సీనియర్ మంత్రికి చంద్రబాబు పీకిన క్లాస్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ప్రజా బలం ఎలగూ తనకు లేదని తెలిసి, ఆ సీనియర్ నేత మిన్నకుంటున్నారట. అంతకు మించి ఆయన చేయగలిగేదేమీ లేదు. కానీ, చినబాబు 'జోక్యం' ముదిరి పాకాన పడితే, అదే తెలుగుదేశం పార్టీకి శాపవముతుందని ఆ సీనియర్ నేత సన్నిహితుల వద్ద వాపోతున్నారట.