ల‌గ‌డ‌పాటి దివాళా

ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్.. రాజ‌కీయనాయ‌కుడిగానే కాకుండా వ్యాపార‌స్తుడిగా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఈయ‌న సుప‌రిచితుడు. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ఉత్సాహం ప్ర‌ద‌ర్శించి అంద‌రి నోళ్ల‌లో నానిన ల‌గ‌డ‌పాటి ఇప్పుడు మ‌రోసారి వార్త‌ల్లోకి వ‌చ్చారు. తీవ్ర న‌ష్టాల‌తో రాజ‌గోపాల్ వ్యాపార‌ సామ్రాజ్యం కుదేల‌యిపోయింది. 

ల‌గ‌డ‌పాటి కుటుంబానికి చెందిన నిర్మాణ సంస్థ ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్‌ దివాళా బాట ప‌ట్టింది. ఇన్‌సాల్వెన్సీ, దివాళా చ‌ట్టం ప్ర‌కారం ల్యాంకో ఖాతాల‌ను ప‌రిష్క‌రించాల‌ని రుణ‌దాత ఐడీబీఐ బ్యాంకును ఆర్బీఐ ఆదేశించింది. ఫ‌లితంగా బాంబే స్టాక్ ఎక్సేంజిలో ల్యాంకో షేర్లు భారీగా ప‌త‌న‌మ‌య్యాయి.

ప్ర‌ధానంగా ప‌వ‌ర్ ప్రాజెక్టుల నిర్మాణ రంగంలో ఉన్న ల్యాంకో దేశ‌వ్యాప్తంగా బ్యాంకులు, ఇత‌ర రుణ సంస్థ‌ల‌ ద్వారా రూ.43,500 కోట్లు అప్పు తీసుకుంది. అయినా సంస్థ న‌ష్టాల ఊబిలో నుంచి బ‌య‌ట‌ప‌డ‌లేదు. దీంతో అప్పులు తీర్చుకునేందుకు అనేక ప‌వ‌ర్ ప్లాంట్‌ల‌ను అమ్ముకుంటూ వ‌స్తోంది.

ఇందులో భాగంగా1200 మెగావాట్ల ఉడిపి ప్రాజెక్టును అదానీ గ్రూప్ అధినేత గౌతం అదానీకి, 70 మెగావాట్ల బుదిల్ హైడ్రోప‌వ‌ర్ ప్లాంట్‌ను హైద‌రాబాద్‌కు చెందిన గ్రీన్‌కో ఎన‌ర్జీస్‌కు, మ‌రో కొన్నింటిని ఇత‌ర సంస్థ‌ల‌కు విక్ర‌యించింది. జీతాలు చెల్లించ‌లేక మూడొంతుల ఉద్యోగుల‌ను తొల‌గించింది. అయినా ప‌రిస్థితి మెరుగుప‌డ‌క‌పోవ‌డంతో చివ‌రికి దివాళాకు ద‌ర‌ఖాస్తు చేసుకుంది.

తొలిసారి ఎంపీగా గెలిచిన‌ప్ప‌టికీ యూపీఏ పాల‌న‌లో ల‌గ‌డ‌పాటి అమిత రాజ‌కీయ ల‌బ్ధిపొందాడు. 2010-11లో ప‌లు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప‌వ‌ర్ ప్రాజెక్టుల నిర్మాణ కాంట్రాక్టులు ద‌క్కించుకున్నాడు. కానీ ప‌వ‌ర్ సెక్టార్‌లో పెరిగిన కాంపిటీష‌న్ త‌గ్గ‌ట్టు వ్యూహాలు ర‌చించ‌డంలో విఫ‌ల‌మై చివ‌రికి దివాళా బాట ప‌ట్టాడు. 

దేశంలోనే తొలిసారి ఇండిపెండెంట్ గ్యాస్ ప‌వ‌ర్ ప్లాంట్‌ను విజ‌య‌వాడ ద‌గ్గ‌ర‌ కొండ‌ప‌ల్లిలో నెల‌కొల్పిన‌ ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్ అంతే వేగంగా ప‌త‌న‌మైంది.

ల‌గ‌డిపాటి సోద‌రుడు మ‌ధుసూద‌న్‌రావు ల్యాంకోకు ఎగ్జిక్యూటివ్‌ చైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. భారీగా పెరిగిన ఇంధ‌న ధ‌ర‌లు, నిర్వ‌హ‌ణ లోపాల వ‌ల్లే దివాళా తీశామ‌ని ఆయ‌న చెప్తున్నారు. గ‌తేడాది రూ.2 వేల కోట్ల న‌ష్టాన్ని కంపెనీ ప్ర‌క‌టించింది.

Show comments