భవిష్యత్‌ అంతా ఫిరాయింపులదే.!

పాత చట్టాన్ని పటిష్టపర్చాల్సిన పనిలేదు.. కొత్త చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరమే లేదు. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి, 'తొండ ముదిరితే ఊసరవెల్లి..' అన్న చందాన తయారయ్యింది పరిస్థితి. ఒకప్పుడు రాజకీయ వ్యభిచారమన్నారు.. కానీ, పార్టీ ఫిరాయింపులకు పాల్పడటమే ఇప్పుడు సంసారపక్షం. అవును, ఇందులో ఇంకో మాటకు తావులేదు. భవిష్యత్‌ రాజకీయాలు అత్యంత ప్రమాదకరంగా మారబోతున్నాయి.! 

'ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు.. పార్టీ ఫిరాయింపులు తప్పేమీ కాదు.. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం తప్పెలా అవుతుంది.? రెడ్డి కాంగ్రెస్‌ నుంచి గెలిచిన వైఎస్‌, ఆ తర్వాత కాంగ్రెస్‌లో మంత్రి కాలేదా.?' అన్న ప్రశ్న, టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి నుంచి పుట్టుకొచ్చింది. టీడీపీ ఎంపీలంతా, ఈ రోజు పార్టీ ఫిరాయింపుల అంశానికి సంబంధించి వైఎస్‌ జగన్‌ మీద దుమ్మెత్తిపోసేశారు. కానీ, పార్టీ ఫిరాయింపులంటే రాజకీయ వ్యభిచారమేనన్న చంద్రబాబు మాటలపై మీరేమంటారన్న ప్రశ్నకు టీడీపీ నేతలెవరినుంచీ సమాధానం రావడంలేదు.

సరే, జగన్‌ది అరణ్యరోదనే.. అర్థం పర్థం లేని ఆరోపణే.. మరి, పార్టీ ఫిరాయింపులకు సంబంధించి తెలంగాణ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి చేస్తున్న పోరాటాన్ని ఏమంటారో.? ఏపీ టీడీపీ ఎంపీలు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పి తీరాలి. అఫ్‌కోర్స్‌ చెప్పరనుకోండి.. అది వేరే విషయం. చెప్పే ధైర్యం వాళ్ళకు లేనే లేదు. తెలంగాణలో వ్యభిచారం, ఆంధ్రప్రదేశ్‌లో సంసారం.. ఇదీ పార్టీ ఫిరాయింపులపై టీడీపీ అభిప్రాయం. 

పూటకో మాట మార్చేవాడిని ఏమంటారు.? రాష్ట్రానికో రాజకీయం అనేవాడిని ఏమనాలి.? తెలుగుదేశం పార్టీ నేతలనడం సబబేమో.! గతంలో, వైఎస్సార్సీపీ కూడా పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించిన మాట వాస్తవం. అయితే, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలలో కొందరు రాజీనామా చేసినా, వారి రాజీనామాలకు ఆమోదం లభించలేదు. అప్పటి కాంగ్రెస్‌ అవసరాలు అలాంటివి మరి. 

'ఇప్పుడు మాకు కష్టం.. రేప్పొద్దున్న మీకు అదే కష్టం రావొచ్చు..' అంటూ వైఎస్‌ జగన్‌, ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కలిసిన అనంతరం, మీడియాతో మాట్లాడుతూ వివిధ జాతీయ పార్టీలనుద్దేశించి వ్యాఖ్యానించారు. కానీ, బీజేపీ కేంద్రంలో చేస్తున్నదేమిటి.? ఇతర పార్టీలకు చెందిన నేతలకు గాలం వేసేస్తోంది కదా. ఆ లెక్కన, పార్టీ ఫిరాయింపులకు ముందు ముందు చట్టబద్ధత కల్పించే దిశగా మోడీ సర్కార్‌ అడుగులేసేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

కొసమెరుపు: తెలంగాణలో టిఆర్ఎస్ అయినా, ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అయినా, కేంద్రంలో బీజేపీ అయినా, ఎల్లకాలం అధికారంలో వుండిపోవు కదా.. ప్రతిపక్షంలో ఆ పార్టీలు వుండాల్సి వస్తే.. అప్పుడిక, ఈ పార్టీలు పార్టీ ఫిరాయింపుల దెబ్బకి కాలగర్భంలో కలిసిపోవన్న గ్యారంటీ ఏంటట.?

Show comments