కాంగ్రెస్ కు కొత్త ఉత్సాహం వచ్చింది!

అటు తిరిగి ఇటు తిరిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాడు నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ. ఈ సిక్సర్ల సిద్ధూ రాజకీయ ప్రస్థానం ఈ మధ్య కాలంలోనే పలు రకాల  మలుపులు తిరిగింది. లోక్ సభ సార్వత్రిక ఎన్నికల నుంచి బీజేపీలో అసంతృప్తుడిగా తయారయ్యాడు ఈ మాజీ క్రికెటర్. అమృత్ సర్ నుంచి తనకు  టికెట్ కేటాయించకపోవడంపై కినుక వహించాడు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి సిద్ధూకి రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చినా ఈయన  శాంతించలేదు. ఎంపీ పదవికి రాజీనామా చేసి బీజేపీ నుంచి బయటకు వచ్చాడు.

బీజేపీ కి రాజీనామా చేసిన తర్వాత సిద్ధూ ఆప్ తో చర్చలు జరిపినట్టుగా వార్తలు వచ్చాయి. ఈయన ఆమ్ ఆద్మీలో చేరడం ఖాయమని అనుకున్నా.. అంతలోనే కొత్త పార్టీని అనౌన్స్ చేశాడు. అయితే ఆ తర్వాత కూడా సిద్ధూ స్థిరంగా ఉండ లేదు. ఎమ్మెల్యే పదవిలో ఉన్న ఈయన భార్య బీజేపీకి రాజీనామా చేసి, కాంగ్రెస్ లో చేరింది. దీంతో సిద్ధూ కూడా కాంగ్రెస్ లో చేరనున్నాడనే వార్తలు వచ్చాయి. చివరకు అవే నిజం అయ్యాయి.

రాహుల్ ఆధ్వర్యంలో సిద్ధూ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాడు. కొన్నాళ్ల కిందట వరకూ కాంగ్రెస్ కు తీవ్ర వ్యతిరేకిగా ఉండిన ఈ మాజీ క్రికెటర్ ఇప్పుడు కాంగ్రెస్ లో చేరడం విశేషమే  అని చెప్పాలి. కాంగ్రెస్ సీఎం అభ్యర్థి అమరీందర్ ను సీఎంగా కానివ్వను అని కూడా రెండు నెలల ముందు చాలెంజ్ చేశాడు సిద్ధూ. అయితే ఇప్పుడు ఈయనను కాంగ్రెస్ పార్టీ అకాళీ నేత , పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ కు పోటీగా నిలబెట్టాలని భావిస్తోందట. బాదల్ కు తగిన అభ్యర్థి సిద్ధూనే అని కాంగ్రెస్ భావిస్తోందట. మొత్తానికి సిద్ధూ చేరితో పంజాబ్ లో కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం వచ్చింది.  

Show comments