రాజకీయాల్లో దేవుళ్లా?

మీది తెనాలే..మాది తెనాలే అన్నట్లు వుంది తెలుగుదేశం, వైకాపా జనాల పరస్పర విమర్శల వ్యవహారం.  వైకాపా జనాలు అంతా రాక్షసులు అంటూ తెలుగుదేశం ‘లౌడ్ మైక్’ అనదగ్గ వర్ల రామయ్య ఓ పేద్ద నామకరణాల జాబితానే బయటకు తీసారు. జగన్, విజయసాయి రెడ్డి నుంచి బొత్స సత్తి బాబు దాకా అందరికీ తలో రాక్షసుడి పేరు తగిలించారు. రోజాకు తాటకి పేరు తగిలించారు. బొత్సను బకాసురుడు అన్నారు.

మరోపక్క వైకాపా అఫీషియల్ మైక్ లాంటి అంబటి రాంబాబు కూడా తానేం తక్కువ తినలేదన్నట్లుగా చంద్రబాబుపై చెలరేగారు. చంద్రబాబుది రాక్షస మనస్తత్వం అని, హత్యారాజకీయాలు చేస్తారని, పిల్లనిచ్చిన మామమే వెన్నుపోటు పొడిచారని విమర్శలు చేసారు.

కానీ ఇక్కడ అంబటి రాంబాబు అయినా, వర్ల రామయ్య అయినా తెలుసుకోవాల్సింది ఒకటే. జనాలు ఎవరూ రాజకీయ నాయకులను దేవుళ్లు అనుకోవడం లేదు. వాళ్లది వేరే ప్రత్యేకమైన జాతి అని జనాలు ఎప్పుడో ఫిక్సయిపోయారు. అందుకే తమకు వేయాలనిపిస్తే ఓటేస్తున్నారు. లేదంటే సైలెంట్ గా వుండి తమ పని తాను చేసుకుంటూ, ప్రభుత్వానికి కట్టాల్సినవి కట్టేస్తూ నిర్లిప్తతగా, నిస్తేజంగా బతికేస్తున్నారు. జనం అలా వుండబట్టే, ఈ ప్రత్యేకమన కేటగిరీ ఇలా చెలరేగిపోతూ, మైకులు కనిపిస్తే ఊగిపోతూ, తమ చిత్తానికి తాము ఎదుటివారిపై ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నారు. అచ్చేసి వదలడానికి ఎవరి పత్రికలు వారికి వున్నాయి కదా? అదీ ధైర్యం. అదీ భరోసా.

Show comments