‘రెండువేలతో బయటపడితే సాలప్పా..’

నిజానికి ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉపఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించడం అనేది అరుదుగా జరిగే సంగతి. పైగా సిటింగ్ ఎమ్మెల్యే హఠాన్మరణం వలన జరిగే ఉప ఎన్నిక అయితే.. ఎటూ సానుభూతితో విజయాలు సంప్రాప్తిస్తుంటాయి గనుక.. ఎవ్వరికీ దానిమీద పెద్దగా దృష్టి ఉండదు. అయితే నంద్యాల ఉప ఎన్నిక మాత్రం.. మొత్తం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనాలు సృష్టిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో.. తెలుగుదేశంకు గడ్డు పరిస్థితి తప్పడం లేదు. సాధారణంగా భూమా నాగిరెడ్డి వంటి సీనియర్ నాయకుడు మరణించిన తర్వాత.. సానుభూతి ఓట్లు గొప్ప మెజారిటీనే కట్టబెడతాయనే నమ్మకం ఉంటుంది. 

కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ‘రెండువేల మెజారిటీ అయినా సాలప్పా.. గండం గడిచి పిండం బయటపడితే సాలు.. అంతే’ అంటూ తెదేపాకు చెందిన మంత్రి స్థాయి నాయకులే వ్యాఖ్యానిస్తూ ఉండడం విశేషం. ఈ స్థానాన్ని ఏకగ్రీవంగా గెలుచుకోవచ్చునని భావించిన తెలుగుదేశం పార్టీ సింపతీ డ్రామా ఆడింది. అయితే వారి వ్యూహాన్ని పట్టించుకోని వైఎస్సార్ కాంగ్రెస్ శిల్పా మోహన్ రెడ్డిని రంగంలోకి దింపడం వారికి మింగుడు పడలేదు. చంద్రబాబునాయుడు ఇక్కడ పెట్టిన సభలో 50 వేల మెజారిటీ లక్ష్యంగా పనిచేయాలంటూ కార్యకర్తలకు చెప్పారు.

ఆ తర్వాత మంత్రులందరూ కూడా.. నంద్యాలలో తాము సునాయాసంగా 50 వేల మెజారిటీ సాధించేయబోతున్నాం అంటూ ప్రగల్భాలు పలికారు. కానీ వాస్తవంలో.. ఆ పరిస్థితి లేదని తెలుస్తోంది. అదే తెలుగుదేశానికి చెందిన కొందరు సీనియర్ నాయకులు, నంద్యాలలో ఎన్నికల ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్న మంత్రిస్థాయి వారు కూడా తమ ప్రైవేటు సంభాషణల్లో భిన్నంగా మాట్లాడుతున్నారు. ‘‘ఎలాగో ఒకలాగా.. గెలుస్తామప్పా.. కాపోతే.. మెజారిటీ పెద్దగా రాదు.. రెండు వేల మెజారిటీ వొస్తే జాస్తి’’ అని వారంటున్నట్లుగా అమరావతిలో పుకార్లు వినిపిస్తున్నాయి. వైకాపా అధ్యక్షుడు జగన్ ఎన్నికల ప్రచార పర్వం ముగిసే వరకు నంద్యాలలోనే దగ్గరుండి ప్రచార బాధ్యతను భుజాన మోయడానికి సిద్ధపడ్డారు. 

తెలుగుదేశం నుంచి అంత కమిటెడ్ గా, చావో రేవో తేల్చుకోవాలన్నట్లుగా బాధ్యత తీసుకుని ఇక్కడ ప్రచారానికి పూనుకుంటున్న సీనియర్లు ఎవరూలేరు. అనుకున్నంతగా సానుభూతి పవనాలు కూడా లేవని.. విజయం దక్కితే చాలన్నట్లుగా పరిస్థితి ఉన్నదని నాయకులు తమలో తాము చర్చించుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్ని గిమ్మిక్కులు చేసినా... తెదేపా నేతలు బయటకు చెబుతున్న స్థాయిలో 50 వేల మెజారిటీ అనేది కలలో మాట అని సర్వత్రా వినిపిస్తోంది. 

Show comments