శాతకర్ణి పొలిటికల్‌ హంగామా.!

అంతా అనుకున్నదే అయ్యింది. రాజకీయ నాయకులెలాగైనా రాజకీయాలే మాట్లాడతారు. ఏ వేదిక మాట్లాడుతున్నామనే విషయాన్ని అస్సలేమాత్రం పట్టించుకోరు. సినీ ప్రముఖులు కూడా రాజకీయాలే మాట్లాడితే ఎలా.? ఇది సినిమా ఫంక్షనా.? లేదంటే, పొలిటికల్‌ మీటింగా.? అని అందరికీ అనుమానాలొచ్చాయి. 

బాలకృష్ణ తాజా చిత్రం 'గౌతమి పుత్ర శాతకర్ణి' ఆడియో విడుదల వేడుకలో ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. రాజకీయాల గురించి దాదాపుగా అందరూ మాట్లాడేశారు. అందరి ఉద్దేశ్యం ఒకటే. కేంద్రంలో మోడీ సర్కార్‌ని పొగడాలి.. ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు సర్కార్‌పై ప్రశంసలు గుప్పించాలి. ఇది తప్ప, ఈవెంట్‌కి రావడానికి ఇంకో కారణం వారెవరికీ కన్పించలేదేమో.! జరిగింది 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమా ఆడియో విడుదల వేడుక కావడంతో, ఆ సినిమా గురించి రెండు ముక్కలు, రాజకీయాల గురించి మరో నాలుగు ముక్కలు మాట్లాడేశారు. 

కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వేడుకకు హాజరయ్యారు. అఫ్‌కోర్స్‌, బాలకృష్ణ సినిమా ఫంక్షన్లకు చంద్రబాబు హాజరవడం వింతేమీ కాదనుకోండి.. అది వేరే విషయం. అయినా, ఈసారి మాత్రం సినిమా ఫంక్షన్‌కి సూపర్‌ పొలిటికల్‌ టచ్‌ అద్దేశారందరూ కలిసి. ఆఖరికి, ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కూడా, చంద్రబాబుని రాజకీయంగా కీర్తించడానికే ఈ ఆడియో విడుదల వేడుకను వేదికగా మార్చేసుకోవడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. 

'గౌతమి పుత్ర శాతకర్ణి' దర్శకుడు క్రిష్‌, బాలకృష్ణతో గతంలో 'సింహ', 'లెజెండ్‌' చిత్రాల్ని రూపొందించిన దర్శకుడు బోయపాటి శ్రీను.. ఇలా ఒకరేమిటి.? వచ్చినోళ్ళు వచ్చినట్లే చంద్రబాబుని పొగిడేస్తోంటే, అంతా విస్తుపోవాల్సి వచ్చింది. నిజానికి, 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమా ఆడియో విడుదల వేడుక పూర్తిగా టీడీపీ కనుసన్నల్లోనే జరిగింది. బాలకృష్ణ అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో, చిత్తూరు జిల్లాకి చెందిన ఆ పార్టీ నేతలు పూర్తిస్థాయిలో ఈ ఫంక్షన్‌ ఏర్పాట్లు చూసుకున్నారు. 

అద్గదీ అసలు విషయం. పేరుకి సినిమా వేడుకే అయినా, మొత్తంగా రాజకీయమే కన్పించింది 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమా ఆడియో విడుదల వేడుకలో. 'ఈ రోజే ఈ సినిమా ఆడియో విడుదల వేడుక.. ఈ రోజే పోలవరం ప్రాజెక్టుకి నిధులొచ్చాయి..' అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడం గమనార్హం. నిర్మాత, దర్శకుడు, సంగీత దర్శకుడు, ఇతర నటీనటులు.. వీళ్ళ గురించి తక్కువగా, చంద్రబాబు, వెంకయ్య భజన ఎక్కువగా జరిగింది 'గౌతమి పుత్ర శాతకర్ణి' ఆడియో విడుదల వేడుకలో. మొత్తమ్మీద, సినిమా ఫంక్షన్‌ని పొలిటికల్‌గా ఫంక్షన్‌గా మార్చేసి సరికొత్త ట్రెండ్‌కి బాలయ్య శ్రీకారం చుట్టాడన్నమాట. 

Show comments