'పెళ్ళిచూపులు'కి జాతీయ గౌరవం

విజయ్‌ దేవరకొండ, రీతూ వర్మ జంటగా నటించిన 'పెళ్ళిచూపులు' చిత్రానికి జాతీయ గౌరవం దక్కింది. ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డుకి ఎంపికైంది 'పెళ్ళిచూపులు'. మరోపక్క, ఈ చిత్ర దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌కి ఉత్తమ మాటల రచయిత విభాగంలో జాతీయ పురస్కారం వరించడం గమనార్హం. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. మరో రెండు తెలుగు చిత్రాలూ జాతీయ అవార్డులకు ఎంపికయ్యాయి. 

'దిల్‌' రాజు నిర్మించిన 'శతమానం భవతి' చిత్రానికి ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం కేటగిరీలో అవార్డ్‌కి ఎంపిక కాగా, 'జనతా గ్యారేజ్‌' సినిమాకిగాను ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా రాజు సుందరంను జాతీయ అవార్డ్‌ వరించింది. ఉత్తమ నటుడిగా 'రుస్తుం' చిత్రానికి బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌ ఎంపికయ్యాడు. ఉత్తమ హిందీ చిత్రం కేటగిరీలో 'నీర్జా' సినిమా ఎంపికయ్యింది. 

అన్నట్టు, తాప్సీ నటించిన 'పింక్‌' సినిమాకి జాతీయ అవార్డ్‌ ప్రకటించారు. ఉత్తమ సామాజిక చిత్రం కేటగిరీలో 'పింక్‌' సినిమాని ఎంపిక చేశారు. మలయాళంలో మోహన్‌లాల్‌ నటించిన 'పులిమురుగన్‌' చిత్రానికి ఉత్తమ స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ కేటగిరీలో జాతీయ అవార్డ్‌ లభించింది. స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ పీటర్‌హెయిన్స్‌కి ఈ అవార్డ్‌ దక్కనుంది. తెలుగులో ఈ సినిమా 'మన్యం పులి' పేరుతో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న విషయం విదితమే.

Show comments