లోకేషూ.. షోకేసూ.. పబ్లిసిటీ సూపర్‌ బాసూ.!

'వారంలో ఓ రోజు ఖచ్చితంగా అమరావతిలోని తాత్కాలిక సచివాలయంలో మంత్రులంతా ప్రజలకు అందుబాటులో వుండాలి..' 

- ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశమిది. 

గురువారం 'గ్రీవెన్స్‌ డే'గా పేర్కొంటూ, ఈ మధ్యనే చంద్రబాబు పార్టీ ముఖ్య నేతల సమావేశంలో మంత్రులకు దిశా నిర్దేశం చేశారు. ఆ లెక్కన, గురువారం మంత్రులంతా సచివాలయంలో ప్రజలకు అందుబాటులో వుండాలి. ప్రజల నుంచి వచ్చే సమస్యల్ని పరిష్కరించేందుకు మంత్రులు, అధికారులు ఆ రోజు పూర్తిస్థాయిలో యాక్టివ్‌గా వుండాలన్నది చంద్రబాబు ఉవాచ. కానీ, చంద్రబాబు ఆదేశాల్ని పట్టించుకునేదెవరు.? అందుకే, గురువారం గ్రీవెన్స్‌ డే సందర్భంగా ఒకే ఒక్క మంత్రి తప్ప, ఇంకెవరూ సచివాలయంలో ప్రజలకు అందుబాటులో లేరట. ఈ విషయాన్ని స్వయంగా టీడీపీ అధికార మీడియా సంస్థ ఒకటి ధృవీకరించింది. 

ఇంతకీ, గ్రీవెన్స్‌ డే సందర్భంగా అందుబాటులో వున్న ఆ ఒక్క మంత్రిగారూ ఎవరట.? ఇంకెవరు, ముఖ్యమంత్రి చంద్రబాబు పుత్రరత్నం నారా లోకేష్‌. అద్గదీ అసలు విషయం. నారా లోకేష్‌ 'షో' కోసం, ఇంత హంగామా జరిగిందన్నమాట. అరరె, కొత్త మంత్రి అయినా, అనుభవం లేకపోయినా ఎంతగా చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నారో కదా.. అన్న భావన వచ్చేలా, టీడీపీ అధికారిక మీడియా సంస్థ అద్భుతమైన కథనాన్ని వండి వడ్డించేసింది. ఇంతకీ, చినబాబు గ్రీవెన్స్‌ డే సందర్భంగా పరిష్కరించిన సమస్యలు ఏంటట.? అది కూడా చెప్పేస్తే, కాస్తంత బాగుండేది. మిగతా విషయాలెలా వున్నా, లోకేషూ.. షోకేసూ.. అదిరింది బాసూ.!

Show comments