బాబుది నిజమా?...నాదెండ్లది వాస్తవమా?-3

ఎన్టీరామారావు తన సలహా మేరకే టీడీపీని స్థాపించారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పుకుంటున్నారు. టీడీపీ తన మానస పుత్రిక అని చెప్పిన మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు తన ఆత్మకథ 'నా జీవిత ప్రస్థానం'లో ఏం రాశారో రెండు భాగాల్లో గుర్తు చేసుకున్నాం. ఆత్మకథ  పేజీల్లో '' ఒక పార్శ్వం మాత్రమే తెలిసిన అమాయక ప్రజలకు రెండో పార్శ్వం కూడా చూపించాలని నేను చేస్తున్న ప్రయత్నమే ఇది. నా ఎడ మోపిన అభాండాలకు సమాధానం ఇవ్వడం కోసమే నేను ఈ గతం రాస్తున్నది. ఆనాడు జరిగిన సమస్త చరిత్రను మీ ముందుంచాలనే ఈనాడు నా ప్రయత్నం. జరిగిన వాస్తవాలను భగవంతుడి సాక్షిగా మీ ముందు పరుస్తున్నాను. నేను మీకు చెప్పిన విషయాలను కాదనగల ధైర్యం ఉన్నవారు ఇదంతా అబద్ధమేనని చెప్పమనండి.'' అని రాశారు. మరో చోట '' పార్టీ స్థాపించింది, కృషి చేసింది నేను. ఎన్‌టి రామారావు కీర్తి ప్రతిష్టలకు కారకుడిని. ప్రజల్లో ఆయనకు అపారంగా ఉన్న అభిమానులతో ప్రాంతీయ పార్టీని గెలిపించుకు తీరాలన్న పట్టుదలతో ఎన్టీ రామారావుకు అప్పనంగా పార్టీ నాయకత్వంలో చోటు కల్పించాను.'' అని రాశారు. 

నాదెండ్ల తన పుస్తకంలో '' ఓ రోజు ఆఫీసులో కూర్చుని పనిచేస్తున్నప్పుడు మిత్రుడు దగ్గుబాటి చెంచు రామయ్య నాకు ఫోన్‌ చేసి మా బావగారు మీతో మాట్లాడతారట అని చెప్పారు. బావగారు ఎవరని అడిగితే ఎన్‌టి రామారావు తనకు బావగారు అవుతారని, ఒకరికొకరం బావమరుదులం అని కూడా చెప్పారు. వారి పిల్లలిద్దరివీ కుండమార్పిడి వివాహాలని చెప్పారు. ఈ సంఘటన 1982లో జరిగింది. వారికి నాతో ఏమిటి పని అని అడగబోయేంతలోనే 'బ్రదర్‌ మీకు చాలా అన్యాయం జరిగింది. కాంగ్రెసు పార్టీ వారు మిమ్ము చాలా అవమానించారు. మీకు అభ్యంతరం లేకపోతే రేపు ఉదయం మీ ఇంటి ప్రాంతంలోనే షూటింగ్‌ జరుగుతుంది.

అక్కడికి వస్తున్నాను. అక్కడి పని అయిపోయాక కర్టెసీ కాల్‌గా మీ వద్దకు వస్తాను' అని అన్నారు ఎన్‌టి రామారావు. నాకేం అభ్యంతరం లేదని చెప్పాను. తెల్లవారి మా ఇంటికి వచ్చి పిచ్చాపాటి మాట్లాడి వెళ్లిపోతున్న సందర్భంలో ఎన్టీ రామారావుతో నేను... ఎవరో అంటుంటే విన్నాను, మీరు రాజకీయాల్లోకి ప్రవేశించాలని అనుకుంటున్నారని, రాజ్యసభ సీటు కోసం కూడా ప్రయత్నిస్తున్నారని కూడా తెలిసింది. మేము ప్రాంతీయ పార్టీ పెట్టబోతున్నాం. మీకు రాజకీయాల్లో చేరాలనే కోరిక ఉంటే మాతో కలిసి రావచ్చును అని చెప్పాను. అబ్బెబ్బే! నా షష్టిపూర్తయ్యే వరకు అలాంటి ఆలోచన మా దగ్గరకు చేరనివ్వం అని చెప్పి వెళ్లిపోయారు.'' అని రాశారు. 

1982 మార్చి 29న (పార్టీ ప్రకటించే రోజు)  ఎన్‌టిఆర్‌ చెన్నయ్‌ నుంచి నేరుగా నాదెండ్ల ఇంటికి వచ్చారు. తాను ఎన్టీఆర్‌ను ఎన్నడూ పార్టీలో చేరాల్సిందిగా బలవంతం చేయలేదని, తనుకు తానై పార్టీలోకి వచ్చారని నాదెండ్ల రాశారు. నాదెండ్ల భాస్కరరావు తన ఆత్మకథలో రాసుకున్నదాన్ని బట్టి తెలుగుదేశం పార్టీ రూపకల్పనలో ఎన్టీఆర్‌ నిర్వహించిన క్రియాశీలక పాత్ర ఏమీ లేదని తెలుస్తోంది. ఇది నిజామా? కాదా? అనేది ఎవరికివారు నిర్ణయించుకోవాలి.  ఆయన ఇంకా తన ఆత్మకథలో ఇలా రాశారు. ''ప్రాంతీయ పార్టీ స్థాపించే విషయంలో ఎన్నో సమావేశాలు నిర్వహించాం. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ దైవజ్ఞుడిని పిలిపించి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మంచి ముహూర్తం కూడా నిర్ణయించాం. వారు మార్చి 29వ తేదీ మధ్యాహ్నం 2-15 గంటలకు ప్రాంతీయ పార్టీ ప్రారంభించడానికి ముహూర్తం సిద్ధం చేశారు. తలుపు తట్టగానే వెల్లువలా ప్రజలు మీ వెంటపడి వచ్చేలా లగ్నం పెట్టాను అని చెప్పారు. ఆనాడు ఉదయం ఓ అడ్‌హక్‌ కమిటీ నా అధ్యక్షతన ఏర్పడింది. ఎన్‌టి రామారావు చెన్నయ్‌ నుంచి ప్లేన్‌లో వచ్చి డైరెక్టుగా మా ఇంట్లో జరుగుతున్న మీటింగ్‌లో పాల్గొన్నారు. మన కుటుంబాల్లో పెద్దవారిని గౌరవించే తీరులో నేను ఎన్‌టి రామారావుని నేను కూర్చునే కుర్చీలో ఆశీనుణ్ని చేసి నేను వారి పక్కనే ఉన్న మరో కుర్చీలో కూర్చున్నాను.

ఇలా నేను ఎన్‌టిఆర్‌ను గౌరవించి కూర్చోబెట్టడాన్ని నారాయణ, గద్దె రత్తయ్య ఎమ్మెల్యేలు అందరూ వ్యతిరేకించారు. నూతన పార్టీ ప్రారంభిస్తున్నామంటే వచ్చాంగానీ సినిమా నటులు పార్టీకి నాయకత్వం వహిస్తే ఇది మనకు లాభించేది కాదని గట్టిగానే వ్యతిరేకించారు. పెద్దవాళ్లతో చర్చించి పార్టీకి ఏం పేరు పెడితే బాగుంటుందోనని కొన్ని పేర్లు సిద్ధం చేసుకున్నాం. ఎన్‌టి రామారావు పెద్దవారనే ఉద్దేశంతో మీరు పెద్దవారు పార్టీకి ఏం పేరు పెడితే బాగుంటుందో సూచించండి అన్నాను. అంతే! దీంట్లో ఏం ఉంది బ్రదర్‌. మనది తెలుగుదేశం కదా. మన పార్టీకి తెలుగుదేశం పార్టీ అనే పేరు పెడదామన్నారు క్యాజువల్‌గా'' అని రాశారు. నాదెండ్ల తన ఆత్మకథలో చంద్రబాబు గురించి ఏం రాశారో కూడా చూద్దాం.

Show comments