కేసీఆర్‌ 'వాస్తు' నమ్మకం ఖర్చు 33 కోట్లు...!

ప్రజాధనం ప్రజా సమస్యల పరిష్కారానికి ఖర్చు చేయాలి. జనాలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలి. వసతులు ఏర్పాటు చేయాలి. వారు సుఖంగా బతకడానికి పాలకులు కృషి చేయాలి. కాని మన పాలకులు ప్రజా ధనాన్ని ప్రజలు సుఖంగా జీవించడానికి ఖర్చు చేయకుండా వారు సుఖపడటానికి, ప్రయోజనాలకు ఖర్చు చేస్తున్నారు. ముఖ్యంగా తమ వ్యక్తిగత నమ్మకాల కోసం కోట్ల రూపాయల ప్రజాధనం తగలేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పటినుంచి 'వాస్తు' పేరుతో ఎన్ని కోట్లు ఖర్చు చేశారో లెక్కలేదు. 

ఎందుకంటే తమ జేబులో డబ్బు కాదు కదా. తాము చెమటోడ్చి సంపాదించింది కాదు కదా. వాస్తు పిచ్చితో చంద్రులు వ్యవహరిస్తున్న తీరు 'సొమ్మొకడిది...సోకొకడిది' అన్నట్లుగా ఉంది. వాస్తు పేరుతో ఉన్న భవనాల్లో మార్పులు చేర్పులు చేస్తుండటమే కాకుండా కొత్త భవనాలు కడుతున్నారు. ఒక్క ముఖ్యమంత్రులేనా...మంత్రులు, ఇంకా ఛోటా మోటా పదవుల్లో ఉన్నవారూ ఇలాగే ఉన్నారు. కేసీఆర్‌ ఆలోచన ఎప్పుడూ 'ఫలాన భవనం కూలగొట్టి ఫలాన చోట కట్టాలి' అనేదే. అందుకోసమే ప్రత్యేకంగా వాస్తు పండితుడిని తన పేషీలో నియమించి నెలకు 75 వేల జీతం ఇస్తున్నారు. 

బహుశా దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వంలోనూ వాస్తు సలహాదారు పోస్టు ఉండకపోవచ్చు. వాస్తు పండితుడు సుధాకర్‌ తేజ సలహాల ప్రకారమే కేసీఆర్‌ నడుచుకుంటారట...! ఆయన సలహా ప్రకారమే కేసీఆర్‌ పాత క్యాంపు ఆఫీసు పక్కనే కొత్త క్యాంపు ఆఫీసు నిర్మిస్తున్నారు. ఇది తుది మెరుగులు దిద్దుకుంటోంది. దసరానాడు ఇందులోకి ప్రవేశించబోతున్నారు. ఎనిమిది ఎకరాల స్థలంలో నిర్మించిన ఈ క్యాంపు ఆఫీసు నిర్మాణ ఖర్చు 33 కోట్లు. కేవలం వాస్తు నమ్మకాల కారణంగా, ఆ నమ్మకాల వల్ల ఏర్పడిన భయం వల్లనే ఈ ఖరీదైన క్యాంపు ఆఫీసు నిర్మించారు. 

పాత క్యాంపు ఆఫీసులో ఉంటే ఆయనకున్న ప్రమాదమేమిటి? పదవి పోతుందనే భయం. కేసీఆర్‌ ప్రస్తుతం బలమైన నాయకుడు. రాష్ట్రంలోనే తిరుగులేని నేత. అధికార పార్టీలో నాయకులు కుక్కిన పేనుల్లా పడుండేవారే. ప్రతిపక్షాలు నిర్వీర్యమైపోయాయి. వచ్చే ఎన్నికల్లో తానే అధికారంలోకి వస్తానని ధీమాగా చెబుతున్నారు. మరింకా భయం ఎందుకు? కొత్త క్యాంపు ఆఫీసు కట్టాల్సిన అవసరమేముంది? ఎందుకంటే...పాత క్యాంపు ఆఫీసు నుంచి పాలన సాగించిన ముగ్గురు ముఖ్యమంత్రులు వైఎస్‌ రాజశేఖర రెడ్డి, రోశయ్య, కిరణ్‌ కుమార్‌ రెడ్డి తీవ్రంగా నష్టపోయారనేది  కేసీఆర్‌ అభిప్రాయం. 

వైఎస్‌ రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు జనం ఆయనకు పాస్‌ మార్కులు మాత్రమే ఇచ్చారు. ఆ తరువాత ఆయన ప్రాణాలే పోయాయి. రోశయ్య అనేక సంక్షోభాల మధ్య చిక్కుకొని కొద్ది కాలంలోనే ముఖ్యమంత్రి పదవి పోగొట్టుకున్నారు. కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రిగా మిగిలిపోవడమే కాకుండా రాజకీయంగా విఫలమై అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ముగ్గురు ముఖ్యమంత్రులకు ఇలా జరగడానికి కారణం క్యాంపు ఆఫీసు వాస్తు సరిగా లేకపోవడమేనని కేసీఆర్‌ అభిప్రాయం. అందులోనే తానూ కొనసాగితే ఏమవుతుందో...! 

కొత్త క్యాంపు ఆఫీసు అత్యాధునికంగా నిర్మించారు. ఇందులో 150కి పైగా రూములున్నాయి. మీటింగ్‌ హాల్‌, మినీ థియేటర్‌, కాన్ఫరెన్స్‌ హాల్‌, అధికారుల ఛాంబర్లు, విజిటర్స్‌ లాంజ్‌లు...ఇలా ఎన్నెన్నో హంగులున్నాయి. అన్ని శాఖల కార్యదర్శులు ఇక్కడి నుంచే పనిచేయాలి. కేసీఆర్‌ తన సొంత ఇంటికో, కొడుకు, కూతురు, మేనల్లుడి ఇంటికో సొంత ఖర్చుతో వాస్తుపరంగా మార్పులు చేర్పులు చేసుకుంటే అభ్యంతరం లేదు. కాని తన స్వార్థం కోసం, తనకు వ్యక్తిగతంగా మేలు జరగాలని, తాను ఓ వందేళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలనుకొని, తాను, తన పార్టీ తప్ప ఎవరూ అధికారంలో ఉండకూడదని...ఇలాంటి ఉద్దేశాలతో ప్రభుత్వ భవనాలకు వాస్తు చీడ పట్టిస్తున్నారు. 

ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. ఆయన వ్యక్తిగత నమ్మకాలను ముఖ్యమంత్రిగా అమలు చేసే అధికారం ఎవరిచ్చారు? ఆయనకు అధికారం ఇచ్చింది రాష్ట్రాన్ని పరిపాలించమనేగాని, ఆయన వ్యక్తిగత 'దురద'ను ప్రజలకు రుద్దడానికి కాదు. బంగారు తెలంగాణ సాధిస్తానని కేసీఆర్‌ ప్రతిజ్ఞ చేశారు. అలాంటి తెలంగాణ ఎప్పుడు సాధిస్తారో చెప్పలేంగాని ముందైతే తనకు ఎలాంటి కష్టాలు రాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వ భవనాలను కూల్చి కట్టే పని పెట్టుకున్నారు. ఆయన జాబితాలో సచివాలయం, అసెంబ్లీ కూడా ఉన్నాయి. కేసీఆర్‌ జీవితాంతం ముఖ్యమంత్రిగా ఉంటారా? ఒకవేళ మరో పార్టీ అధికారంలోకి వస్తే ఆ ముఖ్యమంత్రికి ఉండే నమ్మకాల ప్రకారం ఆయన వేరే భవనాలు కట్టుకుంటారేమో....!

Show comments