అబ్జర్వేషన్‌: భారత్‌, పాక్‌ యుద్ధం చేసేస్కుంటే సరి.!

పాకిస్తాన్‌తో భారతదేశం యుద్ధం చేయాల్సిందేనన్న అభిప్రాయానికొచ్చేసింది అమెరికా. సరిహద్దుల్లో సీమాంతర ఉగ్రవాదాన్ని భారతదేశం భరించే పరిస్థితుల్లో లేదనీ, స్వీయ రక్షణ కోసం అవసరమైతే యుద్ధం చేయడం తప్పు కానే కాదని, ఈ విషయంలో తాము భారత్‌ తీరుని తప్పుపట్టలేమనీ, పైగా భారతదేశం చేస్తున్న పని సమంజసమేనని సాక్షాత్తూ అమెరికా అభిప్రాయపడింది. ఎవరూ ఊహించని విషయమిది. ఎందుకంటే, అమెరికా - భారతదేశానికన్నా, పాకిస్తాన్‌కే బాగా దగ్గర. స్నేహం పరంగా. 

భారత్‌ వద్ద వున్న అమెరికా ఆయుధాలు చాలా చాలా చాలా తక్కువ. దాదాపు శూన్యమేనని చెప్పొచ్చు. అదే, పాకిస్తాన్‌ వద్ద అయితే ఎఫ్‌-16 యుద్ధ విమానాలు సహా అనేక రకాలైన ఆయుధ సంపత్తి అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నది వుంది. ఇది జగమెరిగిన సత్యం. అమెరికా యుద్ధ పిపాసి. అమెరికా ఆయుధ వ్యాపారి. ఇంతకు మించి, అమెరికా గురించి కొత్తగా చెప్పడానికి ఇంకేముంది.? 

పాకిస్తాన్‌ బలోపేతమయితే, తద్వారా భారతదేశానికి ఆయుధ సంపత్తిని పెంచుకోవాల్సిన అవసరమేర్పడుతుంది. ప్రపంచంలో అతి పెద్ద ఆయుధ వ్యాపారం అమెరికా నుంచే జరుగుతుంది. సో, అమెరికా అవసరం భారత్‌కి తప్పదు. ఇదీ అమెరికా స్కెచ్‌. అటూ ఇటూగా ఆ స్కెచ్‌ వర్కవుట్‌ అయ్యింది కూడా. ఇక్కడే, వ్యవహారం చెడింది. పాకిస్తాన్‌, అమెరికాని లైట్‌ తీసుకోవడం మొదలెట్టింది. రష్యాకి దగ్గరవ్వాలనుకుంటోంది, చైనా రూపంలో ఎలాగూ పాకిస్తాన్‌కి బలం వుంది. అదీ కథ. 

నిజానికి, సర్జికల్‌ స్ట్రైక్స్‌ విషయంలో ప్రపంచమంతా భారత్‌ వెనకాలే నిలబడింది. దానికి కారణం, భరించీ.. భరించీ.. భరించీ.. చివరకు భారతదేశం ఘాటైన సమాధానం పాకిస్తాన్‌కి చెప్పడమే. ఆ భరించడంలోనే, వివిధ దేశాల మద్దలు కూడా భారత్‌కి లభించింది. ఈ విషయం అమెరికాకి కూడా తెలుసు. మామూలుగా అయితే, ప్రపంచ శ్రేయస్సు దృష్ట్యా భారత్‌ - పాక్‌ మధ్య యుద్ధాన్ని అమెరికా కోరుకోకూడదు. కానీ, స్వీయ రక్షణ కోసం.. అంటూ యుద్ధం చేయక తప్పదనే సంకేతాల్ని అమెరికా పంపుతోందంటే, అమెరికా ఆలోచనల వెనుక పెద్ద మతలబే వుందన్న విషయం సుస్పష్టం. 

అమెరికా రెచ్చగొట్టిందని, భారత్‌ రెచ్చిపోయే పరిస్థితి లేదు. పాకిస్తాన్‌ కన్నా ముందే అణ్వాయుధాల్ని భారత్‌ సొంతం చేసుకుంది. పైగా, ఏ క్షణాన అయినా పాకిస్తాన్‌ని నేలమట్టం చేసే సైనిక సంపత్తి భారతదేశానికి వుంది. అయినా, భారత్‌ది శాంతి మంత్రమే. ఈ ఎపిసోడ్‌లో అమెరికా బుద్ధి బయటపడిపోయిందంతే. అమెరికా వెన్నుదన్నుగా నిలిచింది కదా అని, రష్యాని భారత్‌ దూరం చేసుకునే అవకాశమే లేదు. రష్యాతో యధాతథంగా స్నేహం కొనసాగుతుంది భారత్‌కి. మధ్యలో అమెరికానే వెర్రి వెంగళప్పలా తయారైపోయింది. ఇన్నేళ్ళ చరిత్రలో ఎన్నడూ చూడని దయనీయమైన, కుట్రపూరితమైన కోణాలు ఒకేసారి అమెరికాలో ఇప్పుడు కన్పిస్తోంది.

Show comments