పవన్... తీరు ఆయనకూ నచ్చలేదు..!

నిన్నటి ప్రెస్ మీట్ లో జనసేన అధిపతి పవన్ కల్యాణ్ ఏ వర్గాలను ఏ మేరకు ఆకట్టుకున్నాడో క్రమంగా స్పష్టత వస్తోంది. పవన్ పోరాడతాడు, పొడిచేస్తాడు అని ఎక్స్ పెక్ట్ చేసిన వారికి మరోసారి జనసేనాధిపతి తీరు విస్తుపోయేలా చేసింది. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నాను అని.. అక్టోబర్ లో ప్రత్యక్ష ఎన్నికల వైపు వస్తానని పవన్ చెప్పుకొచ్చాడు. మరి పవన్ కల్యాణ్ ఇన్నాళ్లూ చేసినవి ప్రత్యక్ష రాజకీయాలు కాదా! అనే విషయం ఇప్పుడిప్పుడే జనాలకూ బోధపడుతోంది. 

మరి పవన్ నుంచి ప్రతిపక్ష పాత్రను ఎక్స్ పెక్ట్ చేస్తున్న వాళ్లు విస్తుపోగా, తాజాగా ఈ జాబితాలో ముద్రగడ పద్మనాభం కూడా చేరారు. పవన్ కల్యాణ్ స్వకులస్తులే అయిన ముద్రగడ.. పవన్ కు హితవచనాలతో కూడిన బహిరంగ లేఖ రాశారు. కాపు రిజర్వేషన్ల ఉద్యమం విషయంలో ప్రభుత్వ తీరును వెనకేసుకు వచ్చిన పవన్ కల్యాణ్ కు ఒకింత ఘాటు లేఖనే రాశారు ముద్రగడ. కాపు రిజర్వేషన్ల ఉద్యమంపై పోరాటం సరికాదు, వీలైనప్పుడు ప్రభుత్వమే ఆ పని చేస్తుందని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చాడు. ఈ మాటలు సరికాదు అని ముద్రగడ స్పష్టం చేశాడు. 

కాపుల రిజర్వేషన్లు అనేవి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఎన్నికల హామీ.. అని ముద్రగడ పవన్ కల్యాణ్ కు నొక్కి చెప్పాడు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచిపోయినా వాటి అమలు గురించి చూపిన శ్రద్ధ ఏమిటో కాపులు చూస్తున్నారు అని ముద్రగడ పేర్కొన్నారు. రోజుకో అబద్ధం చెప్పి చంద్రబాబు నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నాడని.. బాబుకు సిగ్గులేకపోయినా తమకు సిగ్గు ఉందని, బాబు చెప్పే అబద్ధాలను తాము ఇక వినలేం అని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. 

కోట్ల విజయ భాస్కర రెడ్డి కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో ఇస్తే దాన్ని కోర్టు కొట్టి వేసిందని తనకు చంద్రబాబు చెప్పాడని పవన్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే అది అబద్ధం అని పవన్ తెలుసుకోవాలని పవన్ కల్యాణ్ కు ముద్రగడ తెలియజెప్పారు. ఏతావాతా.. ప్రభుత్వాన్ని వెనకేసుకు వస్తూ, మరో తెలుగుదేశం నేత వలే మాట్లాడుతున్న పవన్ కల్యాణ్ కు ముద్రగడ నుంచి కూడా సపోర్ట్ లభించలేదు. దీన్ని బట్టి.. జనసేన అధినేత తను తీసుకున్న స్టాండ్ గురించి సమీక్షించుకోవచ్చు.

Show comments