చంద్రబాబు నియంతృత్వం కోరుతున్నారా?

ప్రజాస్వామ్యంలో పాలకపక్షం. ప్రతిపక్షం రెండూ ఉంటాయి. పక్షి రెండు రెక్కలతో ఎగిరినట్లుగానే పాలకపక్షం, ప్రతిపక్షం అనే రెక్కలతోనే ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుంది. సామాన్యులకు, చదువురానివారికి కూడా తెలిసిన ఈ విషయం తలపండిన రాజకీయ నాయకులకు, అధికారం అనుభవిస్తున్నవారికి తెలియదా? తెలియకుండా ఎలా ఉంటుంది? కాని వారు కొత్త రకమైన ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నారు. నిజానికి వారు కోరుకునేది ప్రజాస్వామ్యం కాదు. నియంతృత్వం కావాలనుకుంటున్నారు.

నియంతలా ఉండాలని కోరుకుంటున్న నాయకుల్లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంటారనిపిస్తోంది. అవును...ఆయనకు ప్రజాస్వామ్యమంటే వెగటు పుడుతోంది. ప్రతిపక్షాలంటే అసహ్యం కలుగుతోంది. ప్రశ్నించేవారి పీక నొక్కాలనిపిస్తోంది.

తనను ఎవరూ వేలెత్తి చూపించకుండా హిట్లర్‌ మాదిరిగానో, ముసోలినిలాగానో పరిపాలన చేయాలనుకుంటున్నారు. ఆయన అవశేష ఆంధ్రలో అధికారానికి వచ్చినప్పటినుంచి ఒక్కటే కోరుకుంటున్నారు. రాష్ట్రంలో ఏ ప్రతిపక్షం ఉండకూడదని. అసలు  ప్రతిపక్షం అనేది అవసరమా? అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఆయన ఓ కొత్త సిద్ధాంతం కూడా కనిపెట్టారు. ఏమని?

ప్రతిపక్షాలనేవి అభివృద్ధికి ఆటంకమట...! తన సర్కారు చేస్తున్న అభివృద్ధి పనులకు ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయట...! అసూయ పడుతున్నాయట...! ప్రతిపక్షాల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, అవి ఉంటే అభివృద్ధి జరగదని చాలాసార్లు అన్నారు. తాజాగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'ఏపీలో ప్రతిపక్షం ఎక్కడ ఉంది?' అని ప్రశ్నించి, 'నాకు ప్రతిపక్షమే లేదు' అని జవాబు చెప్పుకున్నారు.

వైఎస్సార్‌సీపీ, కాంగ్రెసు, కమ్యూనిస్టు పార్టీలు మొదలైనవన్నీ ప్రతిపక్షాలు కావా? బాబు దృష్టిలో ఈ పార్టీలన్నీ అరాచకవాద గ్రూపులు. మరి అసెంబ్లీలో ఉన్నదేమిటి? అసెంబ్లీ సమావేశాల్లో జరుగుతున్న కొట్లాటల సంగతేమిటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు అంతా నేనే అని చెప్పినట్లుగా 'నేనే అధికార పక్షం, నేనే ప్రతిపక్షం. నా తప్పును ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ మెరుగైన పాలన అందిస్తున్నా' అన్నారు. అంటే ప్రతిపక్షాలు తనను విమర్శించనక్కర్లేదని, తనకు అన్ని విషయాలు తెలుసునని చంద్రబాబు అభిప్రాయం.

రాష్ట్రంలో ప్రతిపక్షమే లేదంటున్న బాబు పొద్దున లేస్తే వైకాపా మీద విరుచుకుపడటమెందుకు? నవనిర్మాణ దీక్ష పేరుతో కాంగ్రెసును ఆడిపోసుకోవడమెందుకు? రాహుల్‌ గాంధీ సభకు వెళ్లినవారు రాష్ట్రానికి వ్యతిరేకులని శాపనార్థాలు పెట్టడమెందుకు? గొప్ప పరిపాలకుడినని ప్రచారం చేసుకుంటున్న బాబు ఏం మాట్లాడుతన్నారో అర్థం కావడంలేదు. ఎందుకు కుతకుత ఉడికిపోతున్నారో తెలియడంలేదు.

ఆయన ఏనాడూ ప్రశాంతంగా ఉన్న దాఖలాలు గత మూడేళ్లలో కనబడలేదు. ఉమ్మడి ఏపీలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వంపై విమర్శలు చేయలేదా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయలేదా? అవన్నీ బాబుకు గుర్తు రావడంలేదు.

కొత్తగా మట్లాడుతున్నారు. నార్మల్‌గా కనబడటంలేదు. ఏపీలో ప్రతిపక్షం ఎక్కడుందని ప్రశ్నిస్తున్న బాబు ప్రతిపక్షమైన వైఎస్సార్‌ కాంగ్రెసు నుంచే కదా ఇరవైఒక్కమంది ఎమ్మెల్యేలను గుంజుకున్నారు. అలాంటప్పుడు ప్రతిపక్షం ఎక్కుడుంది? అని ఎలా ప్రశ్నిస్తున్నారు?

వాస్తవాల్లో జీవించకుండా ఊహల్లో బతకడం బాబుకు బాగా అలవాటైంది. ఆయన పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా మాట్లాడకుండా అబ్‌నార్మల్‌గా మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ వైఖరి చూసి టీడీపీ నాయకులు చాటుగానైనా నవ్వుకోకుండా ఉండరు. రాజధాని నిర్మాణం విషయంలోనూ అరచేతిలో స్వర్గాలు చూపించి 'ఎంతో అనుకుంటే ఇంతేనా' అనిపించేలా చేశారు.

చంద్రబాబు రానురాను సహనం కోల్పోతున్నారు. అహంకారం ఎక్కువైంది. తనంతటివాడు దేశంలో లేడని భావిస్తున్నారు. బాబు తాను మారకపోతే ప్రజలే మారుస్తారు.  ఇది ప్రజాస్వామ్య దేశమని, ఇక్కడ ప్రతిపక్షాలు ఉంటాయని గుర్తు చేస్తారు.

Show comments