అమరావతి.. ఇంకో అద్భుత ఘట్టం.!

ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినంతవరకు మరో చారిత్రక ఘట్టమిది. రాజధానిలో తొలి నిర్మాణం.. పేరు తాత్కాలికం అయినా, ఇదే పరిపాలనా భవనంగా కొన్నాళ్ళపాటు వర్ధిల్లనున్న దరిమిలా, ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకం ఈ చారిత్రక ఘట్టం కోసం ఉద్వేగంగా ఎదురుచూస్తోంది. మధ్యాహ్నం 2.59 నిమిషాలకు అమరావతిలోని వెలగపూడి ప్రాంతంలో నిర్మించిన తాత్కాలిక సచివాలయంలోకి హైద్రాబాద్‌ నుంచి వచ్చిన ఏపీ ఉద్యోగులు 'ప్రవేశించనున్నారు'. 

వాస్తవానికి సచివాలయంలో ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, తాత్కాలిక సచివాలయ భవనంలో ఆల్రెడీ పూజలు చేసేసి, కార్యకలాపాల నిర్వహణను ప్రారంభించేశారు మంచి ముహూర్తం కోసం. మళ్ళీ ఇప్పుడు ముహూర్తమేంటి.? అనడక్కండి.. అదంతే. చంద్రబాబు చేసే పనులన్నీ ఇలానే వుంటాయి. అందుకే, అద్భుత ఘట్టాలే అయినా, అపహాస్యంపాలవుతుంటాయి. 

ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు చేస్తున్న పబ్లిసిటీ స్టంట్ల పుణ్యమా అని, చారిత్రక క్షణాల్ని ఆస్వాదించలేకపోతోంది ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకం. అమరావతికి భూమి పూజ ఓ సారి జరిగింది, శంకుస్థాపన ఇంకోసారి జరిగింది. ఇలా, అన్నిటికీ రెండేసి అంతకన్నా ఎక్కువసార్లు 'వేడుకలు' చేయడం చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక పరిపాటిగా మారిపోయింది. ఆ విషయం పక్కన పెడితే, సచివాలయం నుండి నేటితో కార్యకలాపాలు ప్రారంభమవుతుండడం ఆహ్వానించదగ్గ పరిణామమే. 

ఇంకా పూర్తిస్థాయిలో భవనాలు అందుబాటులోకి రాకపోయినా, దఫ దఫాలుగా ఒక్కో భవనాన్నీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని ప్రభుత్వం చెబుతోంది. జులై చివరి వారం నాటికి, పూర్తిస్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ సచివాలయం.. వెలగపూడి నుంచి విధులు నిర్వహించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు చైనా పర్యటన నుంచి తిరిగొచ్చాక, అమరావతి నుంచి పూర్తిస్థాయిలో కార్యకలాపాలు నిర్వహించనున్నారట. 

ఇదిలా వుంటే, హైద్రాబాద్‌ నుంచి ప్రత్యేక బస్సుల్లో అమరావతిలోని తాత్కాలిక సచివాలయానికి 200 మంది ఉద్యోగులు పయనమయ్యారు. వారికి తోడుగా వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు అమరావతిలో తాత్కాలిక సచివాలయ ప్రారంభోత్సవానికి (రెండో దఫా) వెళుతున్నారు. ఉద్యోగుల రాక నేపథ్యంలో, వారికి ఘనస్వాగతం పలికేందుకు విజయవాడతోపాటు, వెలగపూడిలోనూ ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Show comments