ఏపీ బీజేపీలో అసలేం జరుగుతోంది?

అనునిత్యం.. టీవీ చానళ్లలో కూర్చుని భారతీయ జనతా పార్టీ తరపున, తెలుగుదేశం పార్టీ తరపున గట్టిగా వాదించే వ్యక్తి వెల్లంపల్లి శ్రీనివాస్. మాజీ ఎమ్మెల్యే అయినందున..  బీజేపీ తరపున, మిత్రపక్షం అయినందున తెలుగుదేశం తరపున ఈయన వాదించేవాడు. ఈ విధంగా వీరకాషాయవాదిగా కనిపించిన ఈయన బీజేపీకి రాజీనామా చేస్తున్నారు.

ఎన్నికల ముందు.. బీజేపీలో చేరి ఉండవచ్చు గాక, దశాబ్దాలుగా ఆ పార్టీలో ఉండకపోవచ్చు గాక.. బలోపేతం కావాల్సిన దశలో బీజేపీకి ఈ రాజీనామాల ఝలకులేంటో అర్థం కావడంలా. వెల్లంపల్లి రాజీనామా వెనుక రీజనేంటి.. అని ఆరా తీస్తే, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని సమర్థించడానికి చేతగాక, ఇలాగే ముందుకు వెళితే ఎలాంటి ప్రయోజనం ఉండదు అని తెలిసి ఈయన బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

కేంద్రంలో అధికారంలో ఉంది, రాష్ట్రంలో అధికార భాగస్వామిగా ఉంది.. ఇలాంటి నేపథ్యంలో వీలైనంతమంది వచ్చి బీజేపీలో చేరాల్సింది. కానీ.. ఎన్నికల ముందు వచ్చి చేరిన వాళ్లు వీడివెళ్లిపోతున్నారు. కేవలం వెల్లంపల్లి కథే కాదు.. గుంటూరు జిల్లాకు చెందిన రాష్ట్ర మాజీ మంత్రి ఒకరు, ఎన్నికల ముందు బీజేపీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి ఒకరు.. వీళ్లు కూడా కమలం పార్టీలో ఎక్కువ రోజులు ఉండే అవకాశాలు లేవని త్వరలోనే వీళ్లు కూడా రాజీనామా చేయనున్నారనే మాట వినిపిస్తోంది!

అలాగే పవన్ కల్యాణ్ రాజకీయాల్లో క్రియాశీలం కాగానే.. కొన్ని కీలకమైన వికెట్లు పడతాయని, బీజేపీకి రాజీనామా చేసి వాళ్లు ‘జనసేన’ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందనే మాటా వినిపిస్తోంది. ఇదీ.. ఏపీలో కమలం పార్టీ పరిస్థితి. ఇక పార్టీలో కులాల వారీగా చీలికలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. బలపడాల్సిన దశలో బాగా బలహీన పడుతోంది కమలం. వికసించాల్సిన స్థితిలో వాడిపోతోంది. దీనికంతటికీ కారణం.. కొంతమంది ముఖ్యనేతలు పార్టీని తెలుగుదేశానికి తొత్తుగా మార్చడమే అని వేరే చెప్పనక్కర్లేదు!   

Show comments