రుణమాఫీ పై అసంతృప్తి.. బాబు లెక్కలే ఇలా ఉంటే!

ఎన్నికల ముందు ఇచ్చిన సంపూర్ణ రుణమాఫీ అమలు పూర్తిగా ప్రహసనంగా మారిందని.. చేసి చూపిస్తా, అని ఎన్నికల ముందు ప్రగల్బాలు పలికిన బాబు ఈ హామీ అమలు విషయంలో అట్టర్ ప్లాఫ్ అయ్యాడన్న రైతుల మాటలను.. బాబును నమ్మి బ్యాంకుల్లో రెన్యువల్స్ సరిగా చేసుకోని రైతుల ఈతి బాధలను వివరిస్తే.. అదంతా కుట్రపూరితం అన్నారు. మరి ఇప్పుడు ఏం అయ్యింది.. రుణమాఫీ విషయంలో రైతుల్లో తీవ్రమైన అసంతృప్తి ఉందని స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే సెలవిచ్చారు!

జనాల్లో తన పాలన గురించి ఉన్న సంతృప్త స్థాయి గురించి తాము చేపట్టిన సర్వేలో రుణమాఫీ అంశంపై కేవలం 29 శాతం మాత్రమే సంతృప్తిగా ఉన్నట్టుగా తేలిందని బాబు పేర్కొన్నాడు. తెలుగుదేశం అనుకూల మీడియా కూడా ఇదే విషయం చెప్పింది. మరి వేల కోట్ల రుణమాఫీ చేశాను.. అని బాబుగారు చెప్పుకొనని రోజు ఉండదు! అది ఆయన సమర్థత అని తెలుగుదేశం వాళ్లు డబ్బా కొట్టని రోజంటూ ఉండదు!

ఒకవైపు ఇలా చెప్పుకొంటూనే.. 29 శాతం మంది మాత్రమే రుణమాఫీపై సంతోషంతో ఉన్నారని బాబు సర్వేలో తేలిందంటున్నారు. మరి దీని భావమేమి? వందకు 29 శాతం అంటే పాస్ మార్కులకు కూడా చాలా దూరంగా నిలిచిపోయినట్టే! అంతా సూపరో సూపరని చెప్పుకోవడానికి చేసిన సర్వేలోనే 29 శాతం మంది మాత్రమే సంతృప్తి పడుతున్నారని అంటున్నారంటే.. రుణమాఫీ అసలు ఫలాలు ఎంతమందికి అందాయో, ఆ పథకం అమలు గురించి ప్రజల దృక్పథం ఎలా ఉందో సులభంగా అర్థం చేసుకోవచ్చు.

సగం సగం మాఫీతో.. ప్రతియేటా  బాబు కలిగిస్తున్న లబ్ధికి, రైతులు కడుతున్న వడ్డీకి సరిపోతోంది. రుణమూ తీరడం లేదు, మాఫీను జరగడం లేదు. ఇక పంట ఇన్సూరెన్స్ ల, ఇన్ పుట్ సబ్సీడీ ల గురించి మాట్లాడే నాథుడే లేకుండా పోయాడు. వ్యవసాయధారులు అనేది అత్యంత విస్తృతమైన వర్గం. మరి ఇలాంటి వారి మధ్య కనీసం తమకు పాసు మార్కులు కూడా పడలేదని  స్వయంగా చంద్రబాబు ఒప్పుకొంటున్నారంటే.. అసలు కథ ఎలా ఉందో అర్థం చేసుకోవడం కష్టం కాదు. 

Show comments