కాంగ్రెస్ నిర్ణయంలో తప్పేముంది?

తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ సభ్యుల సీట్ల పెంపు బిల్లు లోక్ సభలో ప్రవేశపెడితే అడ్డుకోవాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.  ప్రత్యేకహోదా, రైల్వే జోన్ సంగతి తేల్చిన తరువాతే సీట్ల పెంపు సంగతి చూడాలన్నది కాంగ్రెస్ డిమాండ్. ఇది వార్త. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రలో అభివృద్ధిని అడ్డుకోవాలని చూసింది, అడ్డుకోవడానికి ఇంకేం లేక, సీట్ల పెంపును అడ్డుకుంటోంది. ఇది వెంకయ్య నాయుడి ప్రతి విమర్శ.

కాంగ్రెస్ నిర్ణయానికి, వెంకయ్య మాటలకు ఏమన్నా పొంతన వుందా? అసలు సీట్ల పెంపును అడ్డుకోవాలంటూ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంలో తప్పేముంది? దాన్ని వెంకయ్య నాయుడు ఎందుకు విమర్శించాలి? ప్రత్యేక హోదా, రైల్వే జోన్ అన్నవి తెలుగు ప్రజల అభివృద్ధికి సంబంధించినవి. కానీ అసెంబ్లీ సీట్ల పెంపు అన్నవి కేవలం  రాజకీయ నిరుద్యోగుల కోసం. హోదా వల్ల రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. సీట్ల పెంపు వల్ల రాష్ట్రం ఖర్చు పెరుగుతుంది.

మరింత మంది ఎమ్మెల్యేలు, మరిన్ని అధికార వాహనాలు, మరింత జీత భత్యాలు, మరిన్ని క్వార్టర్లు. ఇలా ఎక్కడలేని ఖర్చు పెరుగుతుంది. అసలే రాష్ట్ర ఆదాయం సరిగ్గాలేదని ముఖ్యమంత్రి, మంత్రులు పదే పదే వాపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఎ కూడా పక్కన పెట్టారు. మరి అలాంటపుడు మరింత ఖర్చు పెంచే అసెంబ్లీ సీట్ల పెంపు అన్నది అవసరమా?

అలాంటి ఖర్చు వ్యవహారాన్ని అడ్డుకోవడం తప్పా? వెంకయ్య నాయుడు ఏం మాట్లాడుతున్నారు? సీట్ల పెంపును అడ్డుకోవడంతో పాటు, హోదా, రైల్వే జోన్ వ్యవహారాలను తెరపైకి తెస్తోంది కాబట్టి, కాంగ్రెస్ పార్టీని మరోసారి అభివృద్ది నిరోధకం అని ముద్రవేయాలన్నమాట.

నిజానికి కాంగ్రెస్ పార్టీ కాదు డిమాండ్ చేయాల్సింది. తెలుగు ప్రజలు నినదించాలి. ఖర్చు తో కూడిన అసెంబ్లీ సీట్ల పెంపు మాకు అక్కరలేదు. అభివృద్ధికి దోహదం చేసే హోదా కావాలని. కానీ, కులం, పార్టీలు, అభిమానాలు, ఇతరత్రా మత్తులో వున్న జనం అలా అడగరని వెంకయ్యకూ తెలుసు. అందుకే రాజకీయ నాయకులు ఆడింది ఆటగా, పాడింది పాటగా వుంది.

Show comments