పవన్ ఇవన్నీ మీ పైనే

పవన్ తిరుపతి సభలో మాట్లాడుతూ ఓ ముచ్చట చెప్పారు. తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తే తనను పొగిడిన మీడియానే, విమర్శిస్తే తనకు కులాన్ని అంటగట్టిందని అన్నారు. అంటే మన మీడియా ఎలా వ్యవహారిస్తుందో పవన్ కు ఇప్పటికే బాగా అర్థమైపోయిందన్న మాట. తెలుగుదేశం పక్కన వుంటే మీడియా దృష్టి పవన్ పై ఒకలా వుంటుంది. అదే తెలుగుదేశానికి ఎదురుగా నిల్చుంటే మరొకలా వుంటుంది. పవన్ ను చిన్న మాట అంటే కామెంట్ లతో విరుచుకు పడిపోయే అభిమాన గణం, ఈ రోజు ఓ దినపత్రికలో వచ్చిన వ్యాసంలోని ఈ వాక్యాలను చదివితే ఎలా ఫీల్ అవుతారో మరి?

ఆ వ్యాసంలోని హైలైట్స్ ఇవే.

*తన మాటలను తన అభిమానులు తప్ప సామాన్య ప్రజలెవరూ తన ప్రకటనలను నమ్మడం లేదని పవన్ కు కొంచెం ఆలస్యంగా అర్థమైనట్లుంది.

*గతంలో  పవన్‌  ప్రత్యేక హోదా విషయంలో ఒక ప్రకటన చేయడంతోనే సరిపెట్టుకుని తన ‘సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌’ చిత్ర నిర్మాణ కార్యకలాపాలలో మునిగిపోయారు.

*జనసేనకూ, దాని అధ్యక్షునిగా పవన్‌ కళ్యాణ్‌కూ కేంద్రం మెడలువంచి హోదా సాధించగలిగే సత్తా అసలు ఏమేరకు ఉందనేది ఈ సందర్భంగా మనందరం ఆలోచించాల్సిన విషయం.

*పవన్‌ కళ్యాణ్‌ అంత శక్తిమంతుడనిగానీ, ఆయన అంత తేలిగ్గా కేంద్రాన్ని నిలదీయగలరనిగానీ ఎవరైనా భావిస్తే అది పొరపాటే అవుతుంది. 

*జనసేన పార్టీ 2014 డిసెంబర్‌ 11వ తేదీన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాలలో ఒక రాజకీయ పార్టీగా నమోదు అయింది. ఇక ఆ తరువాత గత రెండేళ్లుగా జనసేన పార్టీ కార్యకలాపాలేమిటో ఎవరికీ తెలియదు. అధ్యక్షుడు, కార్యకర్తలు తప్పితే, మధ్యలో ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకత్వం కూడా ఆ పార్టీకి లేదు.

*పార్టీ అధ్యక్షుడు పవన్ తన సమయాన్ని రాజకీయాలకు వెచ్చించే పూర్తికాలపు అధ్యక్షుడూ కాదు. ఆయన తీరిక చేసుకుని ఆర్నెల్లకోసారి మీడియా ముందుకొచ్చినా గొప్పే. పార్టీ ఆవిర్భవించి రెండేళ్ళు కావస్తున్నా ఇంకా సభ్యత్వ చేర్పింపు, సంస్థాగత ఎన్నికలు కూడా పూర్తి చేయని ఇలాంటి పార్టీలకు ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన తాత్కాలిక గుర్తింపు రద్దు కాదనే గ్యారెంటీ కూడా ఏమీ లేదు.

*జనసామాన్యంలో ఎవరికీ పవన్ సామర్థ్యంపై ఎలాంటి భ్రమలూ లేవు. దానికితోడు ఏ ప్రజా ప్రతినిధీ ఆయనకు మద్దతు ప్రకటించలేదు.

*హోదా కోసం పవన్‌ చేపట్టబోయే ఉద్యమం ఎలా ఉండబోతుందన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

*మన సమస్యలను కేంద్ర పాలకుల దృష్టికి తీసుకెళ్ళడమే తన ఉద్యమ లక్ష్యమంటున్న పవన్‌ మరో పక్క మన రాష్ట్రంలో ఉద్యమాలు నిర్వహించడం ఏ మేరకు ప్రయోజనకరమో ఆలోచించాలి. ఆయన ఢిల్లీని వేదికగా చేసుకుని ఈ పోరాటం సాగిస్తే బాగుంటుంది. కానీ ఆయన రాష్ట్ర ప్రజల దృష్టిలో తన ఇమేజ్‌ని పెంచుకొనేందుకు జనాన్ని సమీకరించే పని పెట్టుకున్నట్లుంది.

ఇవీ ఆ ఆ వ్యాసంలోని కొన్ని పాయింట్లు.  పవన్ కు ఇది కాస్త శాంపిల్ మాత్రమే అనుకోవాలి. తెలుగుదేశం పార్టీతో చేయి కలిపేపని పక్కన పెట్టి, చేయి చేసుకునేందుకు రెడీ అయితే ఇంకా గట్టిగానే వుంటుందేమో?

Show comments