33 నాటౌట్‌.. ఈ విభజన ఎక్కడిదాకా.?

తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రసహనంగా మారింది. ఇది జిల్లాల విభజన.. ఇది కొత్త జిల్లాల ఏర్పాటు.. వెరసి, ఇది గ్రేటర్‌ తెలంగాణ.. పేరేదైతేనేం, అనేక ఆందోళనలు, చిన్నపాటి విధ్వంసాలు, నిరాహార దీక్షలు, రాజీనామాల నడుమ కొత్త జిల్లాల ఏర్పాటు వ్యవహారం మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. 

ముందుగా 23 జిల్లాల లెక్కను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెరపైకి తెచ్చారు. అది కాస్తా 25, 26, 27.. అలా అలా 30కి చేరింది. 30కి ఒకటి అదనంగా కలిపి 31 అన్నారు. అబ్బే, అదేం కాదు 33 అంటున్నారు. ఇక్కడితో ఈ ప్రసహనం పూర్తవలేదు, ఇంకా కథ మిగిలే వుంది.. అంటోంది రాజ్యసభ సభ్యుడు, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత కేకే నేతృత్వంలోని హైపవర్‌ కమిటీ. 33 కన్నా ఎక్కువ అంటే, అది 34 అనుకోవాలా.? 35 అనుకోవాలా.? ఇవన్నీ కాదు, ఓ నలభై వేసుకోవచ్చా.? అన్న చర్చ తెలంగాణ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది. 

ప్రజల డిమాండ్లకు అనుగుణంగా, పరిపాలనా సౌలభ్యం కోసం.. ఇలా ఒక్కో సందర్భంలో తెలంగాణలోని అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఒక్కో మాట చెబుతోంది. అక్టోబర్‌ 7న మొత్తంగా కొత్త జిల్లాల వ్యవహారంపై, అసలు తెలంగాణలో ఎన్ని జిల్లాలు వుండబోతున్నాయన్న విషయమై ఓ క్లారిటీ రానుంది. అదే రోజు కేకే నేతృత్వంలోని హైపవర్‌ కమిటీ నివేదిక ఇస్తుంది. ఆ వెంటనే, క్యాబినెట్‌ సమావేశం, అందులో కొత్త జిల్లాల ఆమోదం.. ఇవన్నీ చకచకా జరిగిపోతాయి. 

30 కాకపోతే, 31, 31 కాకపోతే 33, అదీ కాకపోతే 40.. ఎన్ని జిల్లాలైతేనేం, తెలంగాణ విస్తీర్ణమైతే, ఇప్పుడున్నదానికన్నా ఒక్క అంగుళం కూడా పెరగదు కదా. పరిపాలనా సౌలభ్యం, ప్రజల ఆకాంక్ష అని చెబుతున్నా, ప్రభుత్వం తరఫున తాము ఏదో ఒక పని చేస్తున్నామని చెప్పుకోడానికి ఈ జిల్లాల లొల్లిని తెలంగాణ ప్రభుత్వం తెరపైకి తెచ్చిందన్నది నిర్వివాదాంశం. ఈ సందట్లో అనేక ప్రజా సమస్యలు అటకెక్కిపోయాయి కూడా. ఆ రకంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యూహాలు వర్కవుట్‌ అయ్యాయి. 

కొత్త జిల్లాలతో కొత్త ఉద్యోగాలు వస్తాయన్న చర్చ తెలంగాణ యువతలో జోరుగా సాగుతోంది. అందులో నిజం లేకపోలేదు. కొత్త జిల్లాల్లో, ఖచ్చితంగా జిల్లా కేంద్రాలుంటాయి.. కొత్త కొత్త కార్యాలయాలొస్తాయి, వాటిల్లో సిబ్బంది కావాలి కదా. అయితే, అదేమంత ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రస్తుతానికి ఏదోరకంగా ఏర్పాట్లు చేసేసి, భవిష్యత్తులో పూర్తిస్థాయిలో సిబ్బందిని ఆయా జిల్లాల కోసం కేటాయించే అవకాశం వుంది. మరి, ఈలోగా నిరుద్యోగ యువతలో ఆవేశం కట్టలు తెంచుకుంటేనో.! ఐఏఎస్‌ అధికారులు, జడ్జిలు, న్యాయవాదులు, ఇతర ప్రభుత్వోద్యోగులు.. ఇలా పెద్ద కథే వుంది. కొత్త జిల్లాల ఏర్పాటు పుణ్యమా అని, అసలు పాలనే పడకేస్తేనో.? 

ఏమో, రానున్న రోజుల్లో ఏం జరుగుతుందోగానీ, కొత్త జిల్లాల ఏర్పాటు వ్యవహారం.. అనే పులిమీద ఇప్పుడు కేసీఆర్‌ సవారీ చేస్తున్నారన్నది నిర్వివాదాంశం. తేడా కొడితే, అంతే సంగతులు.

Show comments