సుప్రీం చీవాట్లు.. అద్వానీ విరుపులు.!

సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది.. దేశంలో రెండు వర్గాల ప్రజలున్నారు.. వారిలో ఒకరి దగ్గర కోట్లు మురిగిపోతున్నాయి.. ఇంకొకరికి చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా పోయింది. ఏమిటీ వైపరీత్యం.? అంటూ, సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. 'అబ్బే, అంతా సజావుగానే సాగుతోంది.. అక్రమార్కుల చేతుల్లోకి వెళుతున్న ధనాన్ని తీసుకొస్తున్నాం..' అంటూ కేంద్రం, అడ్వకేట్‌ జనరల్‌ ద్వారా సుప్రీంకోర్టుకి సమాధానం చెప్పే ప్రయత్నం చేసింది. 

సిగ్గు సిగ్గు.. సర్వోన్నత న్యాయస్థానం ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేశాక, ఇంకా కేంద్రం వివరణ ఇచ్చుకోవడమేంటి.? దేశ ప్రజానీకానికి బహిరంగ క్షమాపణ చెప్పాల్సింది పోయి.! పెద్ద పాత నోట్ల రద్దు తర్వాత, ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశ ప్రజలకు నరకం చూపెట్టడం మొదలెట్టారు. దేశ ప్రజానీకం నరకంలో నెల రోజులుగా మగ్గుతున్నారు. తీరిగ్గా ఈ రోజు కేంద్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి శక్తికాంత్‌దాస్‌ మీడియా ముందుకొచ్చి, 'ఇప్పటిదాకా 2 వేల రూపాయల నోట్ల ముద్రణపై ఫోకస్‌ పెట్టాం.. ఇక నుంచి 500 రూపాయల నోటుపై దష్టిపెడతాం..' అలంటూ చావు కబురు చల్లగా చెప్పారు. 

దాదాపు 14 లక్షల కోట్ల రూపాయల విలువైన పాత నోట్లు ఇప్పటిదాకా బ్యాంకుల్లో జమ అయ్యాయట.. కేంద్రం 5 లక్షల కోట్ల రూపాయల విలువైన నోట్లను విడుదల చేసిందట. దానికీ, దీనికీ ఏమన్నా పొంతన వుందా.? అందులో 2 వేల రూపాయల నోట్లే ఎక్కువ. అవి ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయిప్పుడు. సామాన్యుడు, దాన్ని పట్టుకుని చిల్లరకోసం తిరిగీ తిరిగీ అందులో కొంత మొత్తం చిల్లర మార్చేందుకే వెచ్చించాల్సిన దుస్థితి ఏర్పడింది. మరోపక్క, నల్ల దొంగలు మాత్రం పెద్దమొత్తంలో కొత్త 2 వేల రూపాయల నోట్ల కట్టల్ని వెనకేసుకున్నారు. దొరికినోళ్ళు తక్కువే.. దాక్కున్నోళ్ళే ఎక్కువ. అదంతా ఎప్పటికి బయటకొచ్చేను.? అసలు వచ్చేనా.? లేదా.? ఇది నోట్ల పరిస్థితి.. ప్రజల దుస్థితి. అందుకే సుప్రీం ఇంతలా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది పూర్తిగా పరిపాలనా వైఫల్యమే. 

ఇక, రాజకీయం విషయానికొద్దాం. అసలు చట్ట సభల్ని నిర్వహించడమే చేతకావడంలేదు నరేంద్రమోడీ సర్కార్‌కి. ఈ దఫా పార్లమెంటు సమావేశాల్లో ప్రధాని మోడీ పూర్తిగా తప్పించుకు తిరిగారు. ఇందులో ఇంకో మాటకు తావులేదు. పెద్ద పాత నోట్ల రద్దు ఎంత పాపమో ఆయనకు తెలిసినట్టుంది, సమాధానం చెప్పలేక పార్లమెంటుకి మొహం చాటేశారాయన. ఒక్క రోజంటే ఒక్క రోజు కూడా పార్లమెంటు శీతాకాల సమావేశాలు సజావుగా సాగలేదు. షేమ్‌ ఆన్‌ యూ.. అంటూ జనం నరేంద్రమోడీపై విరుచుకుపడ్తున్నారు. రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ అగ్రనేత అద్వానీ, 'ఇంకా ఎందుకు పార్లమెంటు సభ్యత్వం, రాజీనామా చేయడం ఉత్తమం..' అంటూ పార్లమెంటు సమావేశాల నిర్వహణపై అసహనం వ్యక్తం చేశారు. 

మొన్నటికి మొన్న రాష్ట్రపతి, పార్లమెంటు సమావేశాల తీరుని తప్పుపట్టారు. చట్టసభలున్నది చర్చించడానికి తప్ప, రచ్చ చేయడానికి కాదన్నారాయన. బుద్ధి రావొద్దూ.! తొలిసారి పార్లమెంటుకి ఎన్నికైన ప్రధాని, పార్లమెంటు పరువు తీయడానికి, తద్వారా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడానికే కంకణం కట్టుకున్నారేమోనన్న విమర్శలకు ఏం సమాధానం చెబుతారు.? 

ఇటు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకి సమాధానం చెప్పలేక, అటు ప్రజాస్వామ్యానికి మూలస్తంభంగా వర్దిల్లుతోన్న పార్లమెంటుకి సమాధానం చెప్పలేక.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఏం చేయదలచుకున్నట్లు.? అసలాయనకు ప్రజాస్వామ్యంపై ఏం విశ్వాసం వున్నట్టు.?

Show comments