ఆపరేషన్‌ 'కాషాయ' తెలంగాణ.!

కాషాయ పార్టీ.. అదేనండీ, భారతీయ జనతా పార్టీ 2019 ఎన్నికల్లో తెలంగాణలో పాగా వెయ్యాలనుకుంటోంది. 'పాగా' అంటే, అధికార పీఠం దక్కించుకోవడమట. బీజేపీ నేతలు చాలా గట్టిగా ఈ మాట చెబుతున్నారు. ఎంత గట్టిగా అంటే, 'ఎట్టి పరిస్తితుల్లోనూ ఈ సారి తెలంగాణలో మేమే అధికారంలోకి వస్తాం.. అదీ ఒంటరిగా పోటీ చేయడం ద్వారానే..' అనేంతలా.! 

నిజమేనా.? తెలంగాణలో బీజేపీకి అంత అనుకూల పరిస్థితులు వున్నాయా.? అంటే, 'ప్చ్‌.. లేవు' అనే చెప్పాలి. కానీ, 'ఏమో గుర్రం ఎగరావచ్చు..' అన్నట్టుగా బీజేపీ వ్యూహాలు కన్పిస్తున్నాయి. ఒకప్పుడు తెలంగాణలో అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీ చేసే పరిస్థితి లేదు, తెలంగాణ రాష్ట్ర సమితికి. కానీ, 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తెలంగాణలో అధికార పీఠమెక్కింది కదా.? ఇదే, బీజేపీకి తెలంగాణపై ఆశలు కలిగేలా చేస్తోంది. 

కేసీఆర్‌ లెక్కల ప్రకారం, ప్రస్తుతం వున్న ఐదు సీట్లు కూడా 2019 ఎన్నికల్లో బీజేపీ నిలబెట్టుకోలేదట. అయితే, కేసీఆర్‌ లెక్కల్ని బీజేపీ లైట్‌ తీసుకుంటోంది. అమిత్‌ షా అంటే, రాజకీయ వ్యూహాలకు పెట్టింది పేరు. 2014 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా నరేంద్రమోడీ మేనియా కన్పించిందంటే, అందులో ఎంతో కొంత భాగం అమిత్‌ షాకి కూడా దక్కుతుంది. ఆయన అంత తేలిగ్గా, తెలంగాణపై కన్నేయలేదు. అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారాయన. 

దళితులతో కలిసి భోజనం చేయడం వెనుక అమిత్‌ షా రాజకీయ వ్యూహం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. సహజంగానే, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నుంచి అమిత్‌ షాకి వ్యతిరేకంగా 'రియాక్షన్‌' చాలా తీవ్రంగా వచ్చింది. దానికి కౌంటర్‌గా, 'దళితుల్ని మోసం చేసిందే మీరు.. ఏమయ్యింది, తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి దళితుడేనన్న మీ హామీ.?' అంటూ బీజేపీ ప్రశ్నిస్తోందిప్పుడు. ఈ ప్రశ్నకు టీఆర్‌ఎస్‌ వద్ద సమాధానమే లేదాయె. 

లక్ష కోట్లు ఎక్కడిచ్చారు.? అని కేసీఆర్‌ గంటన్నర మీడియా సమావేశంలో అమిత్‌ షాని ఉద్దేశించి 'కడిగి పారేశారు'. అయితే, 'మళ్ళీ చెబుతున్నా, లక్ష కోట్లు.. ఆ పైనే ఇచ్చాం..' అని అమిత్‌ షా రిటార్ట్‌ ఇచ్చారు. ఇదంతా చూస్తోంటే, అంత ఆషామాషీగా అమిత్‌ షా తెలంగాణ గడ్డ మీద కాలు మోపలేదనే విషయం అర్థమవుతోంది. కేసీఆర్‌ దిగొచ్చేలా చేయడంలో అమిత్‌ షా వ్యూహాలు వర్కవుట్‌ అయ్యాయి. కానీ, తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం (అధికారం దక్కించుకోవడం) సాధ్యమేనా.? ఏమో, గుర్రం ఎగరావచ్చు.. అంటే ఏం చెప్పగలం.?

Show comments