అసలు ముద్రగడకి ఏం కావాలి.?

మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్ర చేస్తానంటున్నారు. ప్రభుత్వమేమో ఆ పాదయాత్రను చెయ్యనిచ్చేది లేదంటోంది. పోలీసుల్ని అడ్డంపెట్టి, ముద్రగడ పద్మనాభం ఇంటి నుంచి బయటకు రాకుండా చంద్రబాబు సర్కార్‌ 'పక్కా వ్యూహ రచన' చేసింది. ప్రస్తుతానికి ముద్రగడ అనధికారికంగా హౌస్‌ అరెస్ట్‌లో వున్నారు. ఇంట్లోంచి ఆయన బయటకు వస్తే ఊరుకోవడంలేదు పోలీసులు. 'వ్యక్తిగత అవసరాల నిమిత్తం ఆయన ఎక్కడికైనా వెళ్ళొచ్చు..' అంటూ పోలీసులు పైకి చెబుతున్నా, ముద్రగడ ఇంట్లోంచి బయటకు వస్తే చాలు 'పాదయాత్రకు అనుమతి లేదు..' అని తెగేసి చెబుతున్నారు. 

'నా జాతి రోడ్డు మీద వుంటే, నేను ఇంట్లో కూర్చోవాలా.?' అని ప్రశ్నించి, ముద్రగడ ఇంట్లోకి వెళ్ళిపోతున్నారు. 'పాదయాత్రకు అనుమతి లేదు.. అనుమతి కోసం ముద్రగడ ప్రయత్నించలేదు.. అనుమతి కోరితే మాత్రం ఆలోచిస్తాం..' అంటోంది చంద్రబాబు సర్కార్‌. 'అనుమతి తీసుకునే మీరు అన్నీ చేస్తున్నారా.?' అని ప్రభుత్వాని ముద్రగడ ఎదురు ప్రశ్నిస్తున్నారు తప్ప, 'పోనీ అనుమతి తీసేసుకుందాం..' అన్న ఆలోచన చేయడంలేదాయె.! 

పోలీసు వ్యవస్థ, ప్రభుత్వం ఒప్పుకోనప్పుడు న్యాయస్థానాలు వున్నాయి. న్యాయస్థానాన్ని ఆశ్రయించి ముద్రగడ తన పాదయాత్రకు అనుమతి పొందొచ్చు. కానీ, ముద్రగడ మాత్రం ఆ పని చెయ్యరాయె. ఇంట్లో కూర్చుంటారు, వీలు చూసుకుని బయటకొస్తారు, పోలీసులు ఆయన్ని అడ్డుకుంటారు, చేసేది లేక ముద్రగడ వెనక్కి వెళ్ళిపోతారు. గత కొద్దిరోజులుగా ఇదే తంతు కొనసాగుతోంది ముద్రగడ స్వగ్రామం కిర్లంపూడిలో. 'నా పాదయాత్ర ఆగదుగాక ఆగదు..' అంటూ ముద్రగడ మీసం మెలేసి, తొడగొట్టినంత పన్జేస్తున్నారు. ఆగడానికి, అసలు ప్రారంభమైతే కదా.? 

పాదయాత్ర చేయడమే ముద్రగడ లక్ష్యమైతే, పైన చెప్పుకున్నట్టు చాలా మార్గాలున్నాయి. కానీ, ఆయన ఉద్దేశ్యం వేరు. అదే సమయంలో, ముద్రగడకు సంబంధించి ప్రభుత్వం వ్యవహార శైలి కూడా అనుమానాస్పదంగానే కన్పిస్తోంది. ఈ మొత్తం వ్యవహారం చూస్తోంటే, కాపు సామాజిక వర్గాన్ని కన్‌ఫ్యూజన్‌లోకి నెట్టేయడానికి చంద్రబాబే, ముద్రగడతో కలసి స్కెచ్‌ వేశారా.? అన్న అనుమానాలూ కలగకమానదు. ఏమో, ఏం జరుగుతోందో ముద్రగడకి, చంద్రబాబుకే తెలియాలి.

Show comments