లెక్క అడిగితే.. బ్బెబ్బెబ్బే అంటారేమో!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి వస్తున్న నిధులను చంద్రబాబు సర్కారు సక్రమంగా సద్వినియోగం చేస్తున్నదా? లేదా? ఈ విషయంలో ఎవరి అభిప్రాయాలు వారికి ఉండొచ్చు. కానీ కేంద్రం ఏయే పథకాల కింద ఎంతెంత డబ్బులు మంజూరు చేసిందో.. సరిగ్గా ఆయా మొత్తాలను అదే అవసరాలకు ఖర్చు చేయడం అంటూ మాత్రం జరగడం లేదు.

ఎందుకంటే ఫరెగ్జాంపుల్ పార్లమెంటు సాక్షిగా మంత్రిగారు వెల్లడించిన గణాంక వివరాల ప్రకారం.. అమరావతి రాజధాని నిర్మాణం అనే అవసరానికి గాను.. కేంద్రం ఇప్పటిదాకా 1500కోట్లు ఇచ్చింది. ఇదంతా కోర్ కేపిటల్ నిర్మాణానికే అనేది బహిరంగ రహస్యమే. అయితే.. యావత్ కేపిటల్ పరిధిలో శంకుస్థాపన రాళ్లు తప్ప.. కోర్ కేపిటల్ ఊసు కూడా లేదన్నది స్పష్టం.

మరి కేంద్రం నుంచి వస్తున్న డబ్బులను చంద్రబాబు సర్కారు తమ ఇష్టానుసారంగా ఖర్చు చేసేసుకుంటూ పోతే ఎలాగ?  ఇప్పుడదే జనంలో ఆందోళన రేకెత్తుతోంది. పార్లమెంటులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మంత్రి అర్జున్ మేఘవాల్ సమాధానమిస్తూ.. ఏపీకి ఇప్పటిదాకా కేంద్రం నుంచి ఏయే అవసరాలకు ఎంతెంత నిధులు విడుదల అయ్యాయో స్పష్టంగా చెప్పారు.

ఇచ్చిన ప్రతిరూపాయికి స్పష్టంగా లెక్క చెప్పిన తరువాతే.. మళ్లీ తర్వాతి దశలో నిధులు ఇవ్వడం జరుగుతుందని కూడా తెగేసి చెప్పారు. అంటే.. చంద్రబాబు సర్కారు తీసుకున్న సొమ్ముకు పక్కాగా లెక్కలు చెప్పలేకపోతే.. కేంద్ర నిధుల విడుదలలో మరింత జాప్యం తప్పదని తేలిపోతున్నది.

చంద్రబాబునాయుడు ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చే డబ్బును ఖర్చు చేయడంలో విచ్చలవిడిగా వ్యవహరించిందనే ఆరోపణలు ఉన్నాయి. కేటాయించిన అవసరాలకే ఆ సొమ్ము వెచ్చించారో లేదో ఒక పట్టాన తేలదు. అంతా సజావుగా జరిగినట్లు లెక్క ఇవ్వకుంటే తర్వాతి విడత నిధులు రావు. లెక్కలు చెప్పగలంత పారదర్శకంగా పనులు కూడా జరగలేదనే పలువురు అంటున్నారు.

ఏదో ఒకలా లాబీయింగ్ చేసి ఎంతో కొంత నిధులు తేవడం, ఇక్కడ పనులు జరుగుతున్నట్లుగా హడావిడి చేయడం అనేది అన్ని వేళలా సాధ్యం కాకపోవచ్చు. పైగా కేంద్రం దృఢంగా వ్యవహరిస్తే గనుక.. నిధుల రాక పెండింగ్ లో పడుతుంది. 2019 మార్చిలోగా కోర్ కేపిటల్ పూర్తిచేసి ప్రారంభోత్సవం చేస్తాం.. అంటూ ఎన్నికల ముహూర్తానికి తగ్గట్లుగా ఆడంబరపు ప్రకటనలు చేస్తున్న చంద్రబాబునాయుడు తాము చేసిన ఖర్చు గురించి సజావుగా లెక్కలు చెబితే తప్ప.. పనులు సాగవని తెలుసుకోవాలి.

Show comments