మహిళామణుల ఎంట్రీ, రసవత్తర పోరు!

బలమైన రాజకీయ నేపథ్యం, ఆకర్షణ గల ఇద్దరు యువతులు ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో హల్‌చల్‌ సష్టిస్తున్నారు. ఒకరు సోనియాగాంధీ కుమార్తె ప్రియాంకాగాంధీ కాగా మరొకరు ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ సతీమణి డింపుల్‌యాదవ్‌. ఈ ఇద్దరూ జనంలోకి ప్రవేశిస్తే యువతరం పెద్ద ఎత్తున ఆకర్షణకు గురి అవుతున్నారు. నిజానికి ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌- సమాజ్‌వాదీ పార్టీ మధ్య ఒప్పందం కుదిరి ఒక బలమైన కూటమిగా రంగంలోకి దిగడానికి ఈ ఇద్దరు అధినేత్రులే కీలకపాత్ర పోషించారని చెప్పకతప్పదు. అసలు ప్రియాంకాగాంధీకి, డింపుల్‌యాదవ్‌కూ మధ్య సన్నిహిత స్నేహం ఉన్నదని, వారిద్దరూ రాజకీయాల్లో అనుకుంటే చక్రం తిప్పగలరని ఇంతవరకూ ఎవరూ ఊహించలేదు. వారిద్దరూ దేశ భావి రాజకీయాలను కూడా శాసించే దశకు చేరుకుంటారని ఇటీవల జరిగిన పరిణామాలు నిరూపిస్తున్నాయి. 

నిజానికి యూపీలో కాంగ్రెస్‌ అడిగినన్ని సీట్లు ఇవ్వడానికి సమాజ్‌వాదీ పార్టీ ఒప్పుకోలేదు. అఖిలేశ్‌యాదవ్‌, రాహుల్‌గాంధీల మధ్య సంభాషణలు కొలిక్కిరాలేదు. చర్చలను రాహుల్‌ టీమ్‌ అస్తవ్యస్తం చేసింది. చివరకు చేతులు కూడా ఎత్తివేసింది. సమాజ్‌వాదీ పార్టీ తమ జాబితాను ప్రకటించేందుకు కూడా సిద్ధమైంది. బీజేపీ నేతలు ఇక విజయం తమదేనని ఉత్సాహం ప్రకటించారు. సరిగ్గా అదే సమయంలో ప్రియాంకాగాంధీ రంగప్రవేశం చేశారు. ప్రియాంకాగాంధీ తరఫున ఒక దూత వెళ్లి అఖిలేశ్‌యాదవ్‌ సతీమణి డింపుల్‌ను కలిశారు. ఇద్దరూ మొబైల్‌లో వాట్సాప్‌ మెసేజ్‌లు పంపుకున్నారు. తర్వాత మాట్లాడుకున్నారు. అంతే డింపుల్‌ ఏమి చెప్పిందో కాని అఖిలేశ్‌యాదవ్‌ తగ్గారు. కాంగ్రెస్‌, సమాజ్‌ వాదీ పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది.

నిజానికి అఖిలేశ్‌ యాదవ్‌తో ప్రియాంకాగాంధీకి పెద్దగా పరిచయాలు లేవు. వారిద్దరూ ఎక్కడా కలుసుకున్న దాఖలాలు లేవు. కాని డింపుల్‌యాదవ్‌తో ప్రియాంకాగాంధీ సంబంధాలు అతడి వైఖరిని మార్చేశాయి. కాంగ్రెస్‌కు చెందిన హేమాహేమీ నేతలు చెప్పిన వాటిని పట్టించుకోని అఖిలేశ్‌ ఒక్క ప్రియాంక మాటలకే విలువ ఇచ్చారు. డింపుల్‌యాదవ్‌ ద్వారా ఆమె చాచిన స్నేహహస్తాన్ని అందుకున్నారు. దీనితో కాంగ్రెస్‌ రాజకీయ జీవితంలో ఒక సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది.

ప్రియాంకా గాంధీకున్న రాజకీయ చాతుర్యం, దౌత్యనీతి, ఆకర్షణ రాహుల్‌గాంధీకి లేవు. ఇప్పటివరకూ ఆయన అమేథీలో తన గెలుపునకు కూడా ప్రియాంకపై ఆధారపడ్డారు. ఇప్పుడు తన భవిష్యత్‌లో కీలకమైన ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల విషయంలో కూడా రాహుల్‌గాంధీ తన చెల్లెలు ప్రియాంకాగాంధీపై ఆధారపడవలిసి వచ్చింది. ప్రియాంక కనీసం తెరముందుకు కూడా రాకుండా తెర వెనుకనుంచి జరిపిన యంత్రాంగం ద్వారా తాను రాహుల్‌గాంధీ కంటే బలమైన నాయకురాలినని నిరూపించారు. ఇది కాంగ్రెస్‌ నాయకుల్లో ఉత్సాహాన్ని రేపింది. ప్రియాంకాగాంధీ జోక్యం వల్ల ఎస్‌పితో ఒప్పందం కుదిరిందని సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్‌పటేల్‌ సైతం ట్వీట్‌లో అంగీకరించారు. రాహుల్‌ పేరును కూడా ఆయన ప్రస్తావించలేదు. దీనితో రాహుల్‌ సత్తా ఏమిటో ఆయన పరోక్షంగా పార్టీ నేతలకు తెలిపారు.

అయితే అంత మాత్రాన ప్రియాంక తన సోదరుడిని అధిగమించి పార్టీ పగ్గాలు చేపడతారని భావించడానికి వీలులేదు. తన సోదరుడికి అవసరమైనప్పుడు సహాయపడేందుకు ఆమె ఎప్పుడూ ముందుంటారన్న విషయం స్పష్టమవుతోంది. పార్టీలో మరో అధికార కేంద్రం కూడా ఆమె ఏర్పర్చుకోవడానికి సిద్దంగాలేరు. అయితే పార్టీని కాపాడేందుకు ఆమె రంగంలోకి దిగడానికి సిద్దంగా ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న యూపీ ఎన్నికల్లోనే కాదు, 2019లో జరిగే ఎన్నికల్లో కూడా ప్రియాంక కీలకపాత్ర పోషించే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు కోరుకుంటే భవిష్యత్తులో ఆమె పార్టీ క్రియాశీలక పాత్ర పోషించేందుకు రంగం సిద్దమైంది.

గత ఎన్నికల వరకు ప్రియాంక కేవలం తన తల్లి, తన సోదరుడి నియోజకవర్గాల్తెన రాయబరేలీ, అమేథీల్లో మాత్రమే ప్రచారం నిర్వహించేవారు. ఈసారి ఆమె మొదటి దశ ఎన్నికలనుంచే ప్రచారంలో పాల్గొననున్నారు. పశ్చిమ యూపీలో ఆమె ప్రచారం చేయడానికి సిద్దపడ్డారు. ఆమె, డింపుల్‌యాదవ్‌ కలిసి పలు ర్యాలీల్లో పాల్గొననున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. యూపీ ఎన్నికల్లో మొదటిసారి యువశక్తి, ఆకర్షణ కీలక పాత్ర పోషించనున్నాయి. ఒకవైపు ప్రియాంక, డింపుల్‌, మరోవైపు అఖిలేష్‌, రాహుల్‌ కూడా కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ నలుగురు కలిసి ఎస్‌పి, కాంగ్రెస్‌ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపగలరడంలో సందేహం లేదు. 

ఉత్తరప్రదేశ్‌లో అందరికంటే ఎక్కువ జనాదరణ, జనాకర్షణ గల నేతల్లో ప్రియాంకాగాంధీని పరిగణించడం ఇప్పటినుంచే ప్రారంభమ్తెంది. ఆమెను జాతీయ రాజకీయాల్లోకి తీసుకురావాలని పార్టీ పగ్గాలు అప్పగించాలని డిమాండ్లు మొదలయ్యాయి. చాలాచోట్ల ఈమేరకు కాంగ్రెస్‌ కార్యకర్తలు పోస్టర్లు కూడా అంటిస్తున్నారు. యూపీ ఎన్నికల్లో ఆమె జాతీయ స్థాయిలో రంగ ప్రవేశానికి భూమిక కల్పిస్తాయని కూడా ప్రచారం జరుగుతోంది. యూపీలో ఎస్‌పి- కాంగ్రెస్‌ కూటమి అధికారంలోకి వచ్చినా, కాంగ్రెస్‌కు ఇచ్చిన 105సీట్లలో అధిక సీట్లు గెలుచుకున్నా ఆ ఘనత ప్రియాంకకు దక్కుతుందనడంలో సందేహం లేదు. మొదట్లో ఎస్‌పి కాంగ్రెస్‌కు కేవలం 90సీట్లే ఇస్తానని చెప్పింది. ప్రియాంక జోక్యం వల్ల మరో 15సీట్లు అధికంగా ఇచ్చేందుకు ఆ పార్టీ సిద్దపడింది. 

మరోవైపు అఖిలేశ్‌ సతీమణి డింపుల్‌యాదవ్‌ ఇప్పటికే పార్టీ తరఫున జనాకర్షణగా నిలిచారు. ఆమె విద్యాధికురాలు. ఇంగ్లీషు, హిందీ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. డింపుల్‌ రాజపుత్ర కుటుంబానికి చెందినవారు.పూనేలో జన్నించిన డింపుల్‌ సైనికకల్నల్‌ ఆర్‌సి రావత్‌ కూతురు. వారి కుటుంబం ఉత్తరాఖండ్‌కు చెందింది. పూనే, డెహ్రాడూన్‌, అండమాన్‌ లక్నోలోని ఆర్మీపబ్లిక్‌ స్కూల్‌లో ఆమె చదివారు. యూపీలో యాదవేతరులు కూడా ఆమెను గౌరవించడానికి ఆమె కుటుంబ నేపథ్యం దోహదపడింది. 2013లో భారత వ్యాపార మండలి సమావేశాల్లో పార్లమెంట్‌ సభ్యులనుద్దేశించి ఆమె చేసిన ప్రసంగంతో ఆమె ప్రతిభ బయటపడింది. 

ఆమె ఎక్కడకు వెళ్లినా జనం, ముఖ్యంగా యువత ఆమెను చూసేందుకు విపరీతంగా వస్తున్నారు.. పార్టీ ర్యాలీల్లో ఆమె భర్త ప్రక్కన లేదా వెనుక నిలుచుంటున్నారు. ఎన్నికల ప్రణాళిక విడుదల చేసేముందు కూడా ఆమె భర్త ప్రక్కనే ఉన్నారు. ఆమె రాజకీయాలను వేగంగా ఆకళింపు చేసుకుంటారని, భర్తకు సరైన సలహాలు ఇస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఎప్పుడూ నవ్వుతూ, ఆప్యాయంగా మాట్లాడడం ఆమె ప్రత్యేకత. కన్నోజ్‌ నుంచి ఎంపీగా ఎన్నిక్తెన డింపుల్‌ పార్టీలో ప్రతి ఒక్కరితో సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకున్నారు. పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. ఆమె ప్రగతిశీల భావాలు గల యువతి అని యువత సులభంగా ఆమె భావాలకు ఆకర్షితులవుతారని పరిశీలకులు భావిస్తున్నారు. ఎస్‌పిలో కుటుంబాల్లోంచి రాజకీయాల్లోకి ప్రవేశించిన మొదటి మహిళ డింపుల్‌. ఏమ్తెనా ప్రియాంక, డింపుల్‌ జోడీ మోడీని గట్టిగా ఢీకొంటుందనడంలో సందేహంలేదు. 

Show comments