నెంబర్‌ త్రీ.. సుబ్బరాజుతో 'సిట్‌'టింగ్‌.!

సుబ్బరాజొచ్చినాడు.. 'సిట్‌' సభ్యుల ముందు విచారణకు కూర్చున్నాడు.. శ్యామ్‌ కె నాయుడు తరహాలో ఐదారు గంటలకే విచారణ ముగుస్తుందా.? పూరిజగన్నాథ్‌ తరహాలో 11గంటల పాటు విచారణ జరుగుతుందా.? ఏమో మరి, ప్రస్తుతానికైతే సస్పెన్సే. టాలీవుడ్‌లో డ్రగ్స్‌ కలకలానికి సంబంధించి సినీ నటుడు సుబ్బరాజు, ఈ రోజు ఉదయం 'సిట్‌' యెదుట విచారణకు హాజరయ్యాడు. ఉదయం 9.30నిమిషాల సమయంలోనే సుబ్బరాజు, ఇంటి నుంచి బయల్దేరాడు. 10 గంటల లోపే సిట్‌ కార్యాలయానికి సుబ్బరాజు చేరుకోవడం గమనార్హం. 

'నేనసలు ఇంగ్లీషు మందులే తీసుకోను.. ఏ చిన్న అనారోగ్యం సంభవించినా సంప్రదాయ పద్ధతుల్నే పాటిస్తాను.. అలాంటిది నేను డ్రగ్స్‌ తీసుకోవడమేంటి.?' అంటూ తనపై వచ్చిన డ్రగ్స్‌ ఆరోపణలపై ఇప్పటికే మీడియా ముఖంగా స్పందించాడు సుబ్బరాజు. 'నేనే కాదు, ఆరోపణలు ఎదుర్కొంటున్నవారెవరికీ డ్రగ్స్‌తో సంబంధాల్లేవు.. ఎవరూ డ్రగ్స్‌ వాడరు..' అంటూ సుబ్బరాజు చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పాడు. 

మరి, మీడియా ముందు ప్రదర్శించిన ఇదే కాన్ఫిడెన్స్‌ని సుబ్బరాజు, 'సిట్‌' విచారణ సందర్భంగానూ ప్రదర్శిస్తాడా.? 'సిట్‌' అధికారుల నుంచి వచ్చే ప్రశ్నలకు సుబ్బరాజు ఎలాంటి సమాధానాలిస్తాడు.? ఏమో, వేచి చూడాల్సిందే. 

అన్నట్టు, పూరిజగన్నాథ్‌కి అత్యంత సన్నిహితులైనవారిలో సుబ్బరాజు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. శ్యామ్‌ కె నాయుడు కూడా అంతే. పూరిజగన్నాథ్‌కి అత్యంత సన్నిహితుడు. మొదటి రోజు పూరిజగన్నాథ్‌, ఆ తర్వాత శ్యామ్‌ కె నాయుడు, ఇప్పుడు ఈ రోజు సుబ్బరాజు, ఆ తర్వాత రవితేజ, ఛార్మిల పేర్లున్నాయి. పూరి నుంచి వెంట్రుకలు, గోళ్ళు, రక్త, మూత్ర నమూనాలు సేకరించిన 'సిట్‌' బృందం, శ్యామ్‌ కె నాయుడు నుంచీ ఇదే తరహాలో నమూనాల్ని సేకరించింది. సుబ్బరాజు నుంచి కూడా నమూనాలు సేకరించనుంది 'సిట్‌' బృందం.

Show comments