రాజకీయంగా, ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పడుతున్నంత తిప్పలు ఏ రాష్ట్ర సీఎం పడటంలేదనిపిస్తోంది. ఆర్థికం విషయం అలా వుంచితే, రాజకీయంగా చంద్రబాబు తీవ్రంగా సతమతమవుతున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు జగన్‌ను ఆయన ఎంతగా తీసిపారేసినా, పనికిరాని వ్యక్తిగా చూస్తున్నా ఆయన చేస్తున్న చికాకు అంతా ఇంతా కాదు. అందుకే సాక్షి మీడియాను స్వాధీనం చేసుకుంటామని రంకెలు వేస్తున్నారు. మరోపక్క కాపు జాతి పరిరక్షకుడిగా తనను తాను ప్రకటించుకున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తలనొప్పిగా తయారయ్యారు.
ఆంధ్రలోనే బొచ్చెడు సమస్యలుండగా, తెలంగాణ కూడా ఆయనకు సమస్యగానే మారింది. అక్కడ అంపశయ్య మీదున్న పార్టీని బతికించుకోవడం ఆయనకు సవాలుగా మారింది. తను పూర్తిగా ఆంధ్రాకు పరిమితం కావడంతో తెలంగాణకు సమయం కేటాయించడం సాధ్యం కావడంలేదు. దీంతో తెలంగాణ టీడీపీ నాయకులు అసంతృప్తిగా ఉన్నారు. ముఖ్యంగా పదవులు లేకపోవడంతో వారికి మనశ్శాంతి లేకుండాపోయింది. నల్గొండ జిల్లా దళిత నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఆయనకు గవర్నర్ పోస్టు ఇప్పిస్తానని చంద్రబాబు గతంలో వాగ్దానం చేశారు. కాని అది ఇప్పటివరకు వర్కవుట్ కాలేదు.
మోత్కుపల్లి ఇప్పటికి చాలాసార్లు వేడుకున్నారు. ఆ పదవి ఇప్పించలేకపోతే రాజ్యసభ పదవి ఇప్పించమని ఈమధ్య తిరుపతిలో జరిగిన మహానాడులో అభ్యర్థించారు. తెలంగాణకు రాజ్యసభ ఇవ్వడం సాధ్యం కాదని బాబు తేల్చిచెప్పారు. టీడీపీ కోటాలో ఉన్నవే మూడు రాజ్యసభ సీట్లు. ఒకటి బీజేపీకి పోయింది. మిగిలిన రెండు సీట్లూ 'ఆంధ్రా రాజకీయాల' కారణంగా ఆ రాష్ట్రం వారికే ఇచ్చారు. ఇకముందు కేంద్రంలో ఏ పోస్టు వచ్చినా తెలంగాణవారికి ఇప్పిస్తానని బాబు హామీ ఇచ్చారు. కాని అయ్యేలా కనబడటంలేదు. త్వరలో కేంద్ర మంత్రివర్గం ప్రక్షాళన జరగబోతోంది. శాఖల మార్పులతో పాటు కొత్తగా చేర్పులున్నాయి.
ఇందులో భాగంగా టీడీపీకి మరో మంత్రి పదవి దక్కే అవకాశముంది. ఇప్పడున్న రెండు పదవులకు ఇది అదనమన్నమాట. ఈ మూడో పదవి కోసం ఒక పేరు సూచించాలని కేంద్రం చంద్రబాబును కోరింది. కాని ఆయనకు మూడో మంత్రి పదవి తీసుకోవడం ఇష్టం లేదట. కేంద్రంలో మంత్రి పదవి తీసుకుంటే బీజేపీ రాష్ట్రంలోనూ మంత్రి పదవి డిమాండ్ చేసే అవకాశముంది. బాబు కేబినెట్‌లో ఇప్పటికే ఇద్దరు బీజేపీ మంత్రులున్నారు. మూడో మంత్రి పదవికి బదులు గవర్నర్ పోస్టు అడగాలని బాబు అనుకుంటున్నారు.
ఈ అభ్యర్థన చాలా కాలం నుంచి కేంద్రంలో పెండింగులో ఉంది. గవర్నరు పోస్టు సాధించి తెలంగాణ నాయకుడికి ఇస్తే ఆ రాష్ట్ర 'పచ్చ' నాయకులు హ్యాపీగా ఫీలయ్యే అవకాశముంది. ప్రస్తుత పరిస్థితిలో ఒక్క పోస్టు దక్కినా తెలంగాణ టీడీపీ నాయకులు బాబును నెత్తి మీద పెట్టుకుంటారు. అందుకే బాబు గవర్నర్ పోస్టు కోసమే గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మంత్రి పదవి వద్దనడానికి మరో కారణం కూడా ఉందంటున్నారు. మంత్రి పదవి ఇస్తే కేంద్రం నిధుల విషయంలో మొండి చేయి చూపుతుందనే భయం ఉంది.
మంత్రి పదవి తీసుకోకుండా ఉంటే నిధుల కోసం గట్టిగా డిమాండ్ చేయవచ్చని అనుకుంటున్నారట. కేంద్రం మూడో మంత్రి పదవి ఆఫర్ చేయగానే చాలామంది టీడీపీ ఎంపీలు ఆశపడుతున్నారు. ఆల్రెడీ ఉన్న ఇద్దరు మంత్రులు అగ్రవర్ణాలవారు. కాబట్టి ఒకవేళ మూడో మంత్రి పదవి తీసుకుంటే దాన్ని బీసీకో, ఎస్సీకో ఇవ్వాలి.
ప్రస్తుతం బాబు దృష్టిలో ఇద్దరున్నారు. వారు: హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప (బీసీ), చిత్తూరు ఎంపీ శివప్రసాద్ (ఎస్సీ). మరి బాబు గవర్నర్ పోస్టు సాధించి మోత్కుపల్లి నర్సింహులును సంతోషపెడతారా? మంత్రి పదవి తీసుకుంటారా? ఏం జరుగుతుందో చూడాలి. మోత్కుపల్లి ప్రస్తుతం తీవ్ర అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవం. పార్టీ నుంచి వెళ్లిపోతారనే ప్రచారమూ సాగుతోంది. ఒకప్పుడు కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ ఫైర్‌బ్రాండ్‌గా ఉన్న మోత్కుపల్లి ప్రస్తుతం 'మౌనమె నా భాష' అంటున్నారు.