వైఎస్‌ జగన్‌ మీద మూకుమ్మడి దాడి

ఓ ప్రైవేటు బస్సు 11 మందిని బలి తీసుకుంది. మితిమీరిన వేగం ఆ బస్సు ప్రమాదానికి కారణం. అలాంటప్పుడు కేసులు ఎవరి మీద నమోదవ్వాలి.? ట్రావెల్స్‌ యాజమాన్యం మీదనే కదా.! కానీ, ఇక్కడ కేసులు నమోదయ్యింది ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మీద. ఆయన చేసిన నేరం, ప్రమాద ఘటన గురించి తెలుసుకున్నాక బాధిత కుటుంబాల్ని పరామర్శించే క్రమంలో అధికారులతో 'గలాటా'కి తెరలేపడం. 

అక్కడ, ప్రాణాలు కోల్పోయింది పక్షులో, జంతువులో కాదు.. మనుషులు. సోషల్‌ మీడియాలో కుక్కని ఎవడో భవనమ్మీద నుంచి కిందికి విసిరేస్తేనే కేసులు నమోదయ్యాయి. అలాంటిది, 11 మంది ప్రాణాల్ని ఓ ప్రైవేటు బస్సు బలి తీసుకుంటే, ఎంతటి తీవ్రమైన కేసులు నమోదవ్వాలి.? కేసులు నమోదయ్యాయి.. కానీ, బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందా.? ఛాన్సే లేదు. ఉదాహరణ కావాలంటే, పాలెం బస్సు దుర్ఘటననే తీసుకోవచ్చు. 

ప్రైవేటు బస్సులు ప్రయాణీకుల ప్రాణాల్ని బలి తీసుకుంటున్నప్పుడు, ఇలాంటి ఘటనల్లో బాధితులకు న్యాయం జరగనప్పుడు, సహజంగానే ఆవేదన పుట్టుకొస్తుంది. ఈ క్రమంలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఒకింత ఆవేశం ప్రదర్శించి వుండొచ్చుగాక. కానీ, సమస్యను పక్కదారి పట్టించడానికి ప్రతిపక్ష నేత మీద కేసులు పెట్టించడమేంట.? ఇదే మరి, చంద్రబాబు జమానా అంటే.! 

ఆసుపత్రి సిబ్బంది తరఫున కేసులు నమోదయ్యాయి.. కలెక్టర్‌పైన అసహనం వ్యక్తం చేశారని ఆరోపిస్తూ, ఐఏఎస్‌ల సంఘం మండిపడ్తోంది.. అధికార పార్టీ నేతల విమర్శల సంగతి సరే సరి. ఈ గలాటా నడుమ, ప్రమాద సంఘటన తెరమరుగైపోతుండడం బాధాకరం. ప్రైవేటు బస్సుల పుణ్యమా అని ఆర్టీసీకి వందల కోట్ల, వేల కోట్ల నష్టం వస్తోందని ప్రభుత్వమే చెబుతోంది. మరి, అదే ప్రైవేటు బస్సులు ప్రయాణీకుల ప్రాణాల్ని తోడేస్తున్నా, ప్రభుత్వమెందుకు చర్యలు తీసుకోదు.? 

ప్రమాదానికి కారణమైన బస్సు, అధికార పార్టీ నేతలకు చెందిన ట్రావెల్స్‌ సంస్థది కావడంతోనే, వివాదమిలా పక్కదారి పడ్తోంది. ఎనీ డౌట్స్‌.? వైఎస్ జగన్ మీద చేస్తున్న దాడిని పక్కన పెట్టి, ప్రైవేటు ట్రావెల్స్ మీద ఈ తరహా మూకుమ్మడి దాడి చేస్తే, ప్రజల ప్రాణాలకు భద్రత దొరుకుతుంది.. ఆర్టీసీ గాడిన పడ్తుంది.. వింటున్నరా, చంద్రబాబుగారూ.?

Show comments