నంద్యాల దెబ్బ తప్పేలా లేదబ్బా.!

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి నంద్యాల ఉప ఎన్నిక దెబ్బ గట్టిగానే తగిలేలా వుంది. నంద్యాల ఓటర్లను బెదిరించేలా మొన్నీమధ్యనే చంద్రబాబు, అక్కడ చేసిన 'ప్రసంగం' తర్వాత ఈక్వేషన్స్‌ మరింత దారుణంగా దెబ్బతిన్నాయని ఆఫ్‌ ది రికార్డ్‌గా టీడీపీ నేతలే చెబుతుండడం గమనార్హం.

2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి భూమా నాగిరెడ్డి, నంద్యాల ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే, ఆ తర్వాత మంత్రి పదవి కోసం భూమా, వైఎస్సార్సీపీకి గుడ్‌ బై చెప్పి, తెలుగుదేశం పార్టీలో చేరడం.. మంత్రి పదవి కోసం ఎదురుచూసీచూసీ ఆ ఒత్తిడితో హఠాన్మరణం చెందడం తెల్సిన విషయాలే. 

నియోజకవర్గంలో అనుచరుల నుంచి భూమా నాగిరెడ్డి ఏ స్థాయి ఒత్తిడిని ఎదుర్కొన్నారో, ఆ అనుచరుల్ని కదిలిస్తే తెలుస్తుంది. భూమా నాగిరెడ్డి మరణం తర్వాత, ఇక తప్పదనుకున్న చంద్రబాబు, భూమా కుమార్తె అఖిల ప్రియకు మంత్రి పదవి ఇచ్చి, ఎలాగైతేనేం కొంత తలనొప్పిని తగ్గించుకున్నారు. చిత్రంగా ఇక్కడే చంద్రబాబుకి అసలు తలనొప్పి షురూ అయ్యింది. నంద్యాల ఉప ఎన్నికల్లో టిక్కెట్‌ ఆశించి భంగపడ్డ శిల్పా మోహన్‌రెడ్డి, టీడీపీకి గుడ్‌ బై చెప్పి, వైఎస్సార్సీపీలోకి జంప్‌ చేసేశారు. 

ఓ వైపు శరవేగంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఇంకోపక్క అంతే వేగంగా నియోజకవర్గంలో పడిపోతున్న పార్టీ ఇమేజ్‌.. వెరసి, చంద్రబాబుకి కంటి మీద కునుకు లేకుండా పోతోందిప్పుడు. నంద్యాల ఉప ఎన్నికల్లో ఓడిపోతే, రాజకీయంగా అది చంద్రబాబుకి కోలుకోలేని దెబ్బ అవుతుందన్నది నిర్వివాదాంశం. రాత్రికి రాత్రి నంద్యాలకు వరాల జల్లు అయితే చంద్రబాబు ప్రకటించేశారుగానీ, ఏం చేసినా.. టీడీపీ ఇమేజ్‌ అక్కడేమాత్రం పెరగని పరిస్థితి. 

పైగా, మంత్రి అఖిలప్రియకు వ్యతిరేకంగా టీడీపీలో ఇంకో వర్గం నంద్యాల ఉప ఎన్నికల్లో ఎదురుతిరిగేందుకు సమాయత్తమవుతోంది. తండ్రి మరణానంతరం మంత్రి పదవి మోజులో, చంద్రబాబు మీద మాటపడకుండా అఖిల ప్రియ వ్యవహరించిన తీరు, భూమా వర్గంలోనే అసహనాన్ని రేకెత్తించింది. ఇలా ఏదీ, నంద్యాలలో టీడీపీకి కలిసొచ్చేలా కన్పించడంలేదు. ఇప్పుడే పరిస్థితి ఇలా వుంటే, నంద్యాల ఉప ఎన్నిక తేదీ ఖరారైతే, అప్పటికి టీడీపీ పరిస్థితి ఏంటట.? ఉప ఎన్నికల తర్వాత చంద్రబాబు పరిస్థితి ఏంటట.?

Show comments