సింధూ.. షి జస్ట్ కిల్డ్, అంతే..!

గెలవడం అంటే ఇంత సులభమా.. నిన్నటి వరకూ ఎవరెవరో గెలుస్తుంటే చూశాం.. ఈ గంట మాత్రం సింధూ మ్యాజిక్ చూశాం. అవతల ఉన్నది అనామక ప్రత్యర్థి ఏమీ కాదు.. కానీ సింధూ ఆ జపనీయురాలిని ఆటాడేసుకుంది! ఈ మ్యాచ్ లో తొలి పాయింట్ సాధించింది ఈ తెలుగమ్మాయే.. అలా దూసుకుపోతూ తొలి సెట్ ను సొంతం చేసుకుంది. ఇక రెండో సెట్ లో తొలి పదిపాయింట్ల వరకూ సమంగా వెళ్లారు. 

ఆ తర్వాత సింధూ 11 పాయింట్ల విన్నింగ్ స్ట్రీక్ .. నిజంగా న భూతో అని చెప్పాలి. ప్రత్యర్థికి షాక్ లు ఇస్తున్నట్టుగా సర్వ్ చేసింది. నజోమి ఒకుహర… ఏమీ అల్లాటప్పా షట్లర్ కాదు.. ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ విజేత ఈ సంవత్సరానికామె. ఆసియా ఛాంపియన్. కానీ సెమిస్ లో సింధూ ధాటికి తట్టుకోలేకపోయింది. విన్నింగ్ స్ట్రీక్ లో సింధూ బాక్సర్ పంచ్ లు ఇస్తున్నట్టుగా రాకెట్ తో విరుచుకుపడుతుంటే.. ఆ ఛాంపియన్ అనామకురాలైంది. 

ఈ స్ట్రిక్ లో సింధూ షో చూస్తే బ్యాడ్మింటన్ లో ఉండే మజా ఏమిటో అర్థం అవుతుంది. సింధూ.. షి జస్ట్ కిల్డ్ అంతే… మరేం మాటల్లేవ్.

ఈ సారి ఒలింపిక్స్ విషయంలో సింధూ అండర్ డాగ్ గానే బరిలో దిగింది. అందుకు ప్రధాన కారణం.. సైనా పోటీలో ఉండటం. క్రితం సారి కాంస్య పతకాన్ని సాధించిన సైనా ఈ సారి ఏదో ఒక పతకాన్ని తెస్తుందని భావించిన అంతా బ్యాడ్మింటన్ లో ఆమె గురించే ఆలోచించారు. సైనా నెహ్వాల్ ఓడిపోగానే చాలా మంది నిశ్చేష్టులయ్యారు. ఇంతలోనే సింధూ చిచ్చరపిడుగులా దూసుకొచ్చింది.

సింధూ ఇప్పటికే చాలా రికార్డులు బద్దలు కొట్టేసినట్టే.. ఒలింపిక్స్ ఫిమేల్ సింగిల్స్ లో ఫైనల్ కు చేరిన తొలి భారతీయరాలు.. తదితరాలనమాట. ఇక ఫైనల్ లో సింధూ స్పెయిన్ కు చెందిన కరొలినా మరోన్ ను ఎదుర్కొన బోతోంది. శుక్రవారం రాత్రి ఏడున్నరకు ఈ మ్యాచ్ జరగనుంది. సెమిస్ లో కరొలినా చైనీ షట్లర్ మీద విజయం సాధించింది. ఆ మ్యాచ్ లో ఆమె ఆట తీరు తో పోలిస్తే సింధూ నే ఊపు మీద కనిపిస్తోంది. స్వర్ణం ఖాయమనే ఉత్సాహాన్ని ఇస్తోంది. ఇక ఆల్ ద బెస్ట్ సింధూ..గుడ్ లక్.

-జీవన్ 

Show comments