మోడీజీ.. ఆ చావులకి రేటింగ్‌ మీరిస్తారా.?

'అర్థరాత్రి నాకు మెలకువొచ్చింది.. నేనేదో నిర్ణయం తీసేసుకున్నాను.. ఆ నిర్ణయం మీకు నచ్చిందా.? లేదా.? ఆ నిర్ణయంతో మీరు చచ్చారా.? అయితే, ఆ చావులకి రేటింగులు కూడా మీరే ఇచ్చుకోండి.. మా నిర్ణయాలకీ పనిలో పనిగా రేటింగులు ఇస్తే మేం సంతోషిస్తాం..' అన్నట్టుంది ప్రధాని నరేంద్రమోడీ తీరు. 

పెద్ద నోట్ల రద్దు విషయంలో నరేంద్రమోడీ తొందరపాటు చర్య గురించి ఇప్పుడు దేశమంతా భగ్గుమంటోంది. నిజానికి ఇలాంటి నిర్ణయాలు అకస్మాత్తుగానే తీసుకోవాలి. కానీ, ఆ నిర్ణయాన్ని అమలు పర్చేముందు అత్యంత పకడ్బందీగా వ్యవహరించాలి. పర్యవసనాల్ని ఆలోచించడం పాలకుడి బాధ్యత. కానీ, ఆ బాధ్యతను ప్రధాని నరేంద్రమోడీ విస్మరించారు. ఫలితం, నోట్ల కోసం దేశంలో ప్రజలు ఏటీఎం సెంటర్ల వద్ద, బ్యాంకుల వద్దా ముష్టియుద్ధాలకు దిగాల్సి వస్తోంది. చిల్లరకోసమైతే రోడ్డెక్కి కుమ్ములాడుకోవాల్సి వస్తోంది. 

పరిస్థితి తీవ్రతను పధ్నాలుగు రోజుల తర్వాత ప్రధాని నరేంద్రమోడీ గుర్తించినట్టున్నారు. ట్విట్టర్‌ ద్వారా, ప్రజల్ని అభిప్రాయం కోరుతున్నారాయన. పెద్ద నోట్ల రద్దుపై రేటింగ్‌ ఇవ్వాలంటూ సోషల్‌ మీడియా ద్వారా నరేంద్రమోడీ కోరడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. రోజులు గడుస్తున్నా పరిస్థితుల్లో మార్పు రావడంలేదనీ, సరైన ప్రణాళిక లేకుండా దేశ ప్రజల్ని దొంగల్లా చూస్తున్నారనీ ప్రజానీకం తిరగబడ్తున్న దరిమిలా, మోడీ రేటింగ్‌ చర్య ఆశ్చర్య కలిగించకుండా వుంటుందా.? 

రేటింగ్‌ ఎవరివ్వాలి.? క్యూ లైన్లలో నిల్చోలేక ప్రాణాలు కోల్పోయిన అభాగ్యులా.? వారి కుటుంబ సభ్యులా.? ఇంకెన్నాళ్ళు ఈ క్యూలైన్లలో మగ్గిపోవాలో తెలియక విలవిల్లాడుతున్న సామాన్యులా.? వీళ్ళెవరూ కాదు, టెక్నికల్‌ బ్రెయిన్‌తో తప్పుని ఒప్పుగా మార్చేసుకునే సోకాల్డ్‌ టెక్నికల్‌ మైండెడ్‌ నల్లకుబేరులా.? మిస్టర్‌ మోడీజీ ఆన్సర్‌ టు ది క్వశ్చన్‌. 

పెద్ద నోట్ల రద్దు పర్యవసానమేంటో బహిరంగంగా కన్పిస్తూనే వుంది. ఏ బ్యాంకు వద్దకు వెళ్ళినా, అక్కడి ప్రజలే చెబుతున్నారు పరిస్థితుల తీవ్రత ఏంటో. పెద్ద నోట్ల రద్దుకు ముఖ్య కారణం తీవ్రవాదమన్నారు.. ఇప్పుడు ఆ తీవ్రవాదుల వద్ద కూడా పెద్ద నోట్లు కనిపిస్తున్నాయి. మరి, మోడీ సర్కార్‌ సాధించినదేంటి.? నల్ల కుబేరులు సేఫ్‌గానే వున్నారు.. మరి నరేంద్రమోడీ పెద్దనోట్లను రద్దు చేసి ఏం ఉద్ధరించారు.? మధ్యలో నలిగిపోయింది సామాన్యుడే.. చచ్చిపోతున్నదీ సామాన్యుడే.. సామాన్యుడిని హరించేడయమేనేమో నరేంద్రమోడీ 'నమో' కాన్సెప్ట్‌.!

Show comments