ఫర్లేదా.. పార్టీకి నష్టమేమీ లేదా.?

చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమంటే ఇదే మరి. మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి, తెలుగుదేశం పార్టీకి గుడ్‌ బై చెప్పి, వైఎస్సార్సీపీలో చేరనున్నట్లు ప్రకటించాకగానీ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు 'దిద్దుబాటు' చర్యలు షురూ చెయ్యలేకపోయారు.

నిజానికి శిల్పా మోహన్‌రెడ్డి, టీడీపీని వీడటానికి పెద్దగా కారణాలేమీ లేవు. నంద్యాల ఉప ఎన్నిక టిక్కెట్‌ ఆయన అడిగారు.. చంద్రబాబేమీ కాదనేయలేదు. కానీ, నాన్చారంతే. అక్కడే వ్యవహారం తేడా కొట్టేసింది. 

'ఇంకెన్నాళ్ళు నాన్చుతారు.. ఇవ్వననీ చెప్పరు.. చూద్దామంటారు.. రాజకీయాల్లో ఇలాంటి నాన్చుడు వ్యవహారం అస్సలు కుదరదు..' అంటూ శిల్పామోహన్‌రెడ్డి చంద్రబాబు తీరుపై అసహనం వ్యక్తం చేశారు. సోదరుడు శిల్పా చక్రపాణిరెడ్డితో రాజకీయ విభేదాలున్న మాట వాస్తవమేనని చెబుతున్నారాయన.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని రాజకీయ గురువుగా అభివర్ణించారు. టీడీపీలో వున్నా, తన ఇంట్లో అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ వైఎస్‌ ఫొటో వుంటుందని శిల్పా మోహన్‌రెడ్డి 'కొత్త కథ' విన్పించారు. టీడీపీ హయాంలో కర్నూలు జిల్లాలో అభివృద్ధి ఏమీ లేదనీ, నంద్యాలలో అయితే చెప్పుకోడానికి అస్సలేమీ లేదని శిల్పా మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీ మారేటప్పుడు ఈ తరహా విమర్శలు మామూలేననుకోండి.. అది వేరే విషయం. 

మొత్తమ్మీద, కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ తనకు తానుగానే గండి కొట్టుకుందన్నమాట. భూమా నాగిరెడ్డి మరణం తర్వాత ఖాళీ అయిన నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఈ సీటు కోసం టీడీపీలో వుండే శిల్పా మోహన్‌రెడ్డి పెద్ద యుద్ధం చేయాల్సి వచ్చింది.

ఆ యుద్ధంలో గెలుపు దక్కుతుందో లేదో తెలియని డైలమా నడుమ ఆయన టీడీపీని వీడారు. వైఎస్‌ జగన్‌, నంద్యాల టిక్కెట్‌ తనకే కేటాయిస్తారని శిల్పా మోహన్‌రెడ్డి విశ్వసిస్తున్నారు. 

ఒకవేళ, నంద్యాల సీటుని టీడీపీ కోల్పోయిందంటే.. అదే తెలుగుదేశం పార్టీ పతనానికి నాంది పలికినట్లవుతుంది. శిల్పా రాకతో, నంద్యాల ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు ఖాయమన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు వైఎస్సార్సీపీ శ్రేణులు.

ఇది, చంద్రబాబుకి మింగుడు పడని విషయమే. అందుకే, 'ఫర్లేదా.. శిల్పా మోహన్‌రెడ్డి దెబ్బ టీడీపీకి ఏమన్నా నష్టమా.? ఇంకెవరన్నా ఆయన వెంట వైఎస్సార్సీపీలోకి వెళుతున్నారా.?' అనే ఆందోళనతో కర్నూలు జిల్లా నేతలతో ఎప్పటికప్పుడు చంద్రబాబు మంతనాలు జరపాల్పి వస్తోంది.

Show comments