'పచ్చ' బొట్టేసినా ప్రయోజనమేముంది?

'పచ్చ బొట్టేసిన పిలగాడా నీతో పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా'... అని పాడుకుంది బాహుబలి సినిమాలో కథానాయిక. వాళ్లిద్దరి మధ్య ఉన్నది ప్రేమ కాబట్టి పచ్చ బొట్టేసిన అబ్బాయితో అన్నీ పంచుకుంటానంది. కాని ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా పేరు పొందిన ఇద్దరు సోదరులు ఎన్నో ఆశలతో చాలాకాలం క్రితం 'పచ్చ బొట్టు' వేసుకున్నారు. కాని ఇప్పటివరకు వారికి ఇసుమంతైనా ప్రయోజనం కలగలేదు. ప్రయోజనం కలగకపోవడం మాట అటుంచితే వారిని టీడీపీ అధినేత కమ్‌ సీఎం చంద్రబాబు నాయుడు పూర్తిగా మర్చిపోయారు.

ఉమ్మడి రాష్ట్రంలో, కాంగ్రెసులో ఓ వెలుగు వెలిగిన ఈ సోదరులు టీడీపీలో నిస్సహాయంగా మిగిలిపోయారు. 'అయిపోయింది... అంతా అయిపోయింది' అని పాత సినిమాల్లో గుమ్మడి మాదిరిగా నిట్టూరుస్తున్న వీరు ఏ దారిలో వెళ్లాలా? అని ఆలోచిస్తున్నారు. ఆ  సోదరులే నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం వివేకానందరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి.

నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆనం కుటుంబం ప్రాముఖ్యం, బలం ఏమిటో తెలిసిందే. టీడీపీలోకి ఫిరాయింపులు జోరుగా కొనసాగుతున్నప్పుడు చంద్రబాబు ఎంతో పైరవీ చేసి, వివేకాకు ఎమ్మెల్సీ పదవి, రామనారాయణకు మంత్రిపదవి ఆశచూపి టీడీపీలోకి రప్పించారు. ఆనం సోదరులు టీడీపీలోకి వస్తే ఆ జిల్లాలో పార్టీ బలోపేతమవుతుందనే ఉద్దేశంతో వారిని తీసుకున్నారు. ప్రతిపక్షంలో కంటే అధికార పార్టీలో ఉండటం మేలని ఎవరైనా అనుకుంటారు. వీరూ అలాగే అనుకున్నారు. పైగా పదవుల ఆశ చూపాక కాదని ఎలా అంటారు. సరే.. పచ్చ కండువాలు కప్పుకున్నారు. బాబు భజన చేశారు. వివేకాకు నోరెక్కువ కదా.

విమర్శలైనా, భజనైనా తారస్థాయిలోనే ఉంటుంది. అలాగే చేశాడు. మరి టీడీపీలోకి వచ్చినప్పుడు వైకాపా అధినేత జగన్‌ను విమర్శించాలి కదా. వివేకా ఆ పని శక్తిమేరకు చేశాడు. ఎంతచేస్తే ఏం ప్రయోజనం ఇప్పటివరకు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. దీంతో మౌనంగా ఉండిపోయారు. మాజీ ఆర్థికమంత్రి అయిన రామనారాయణ రెడ్డికి మంత్రిపదవి ఇవ్వలేదు.

సరే.. సరిపెట్టుకున్నారు. వివేకాకు ఎమ్మెల్సీ పదవి వస్తుందనుకున్నారు. ఒకటిరెండుసార్లు వివేకా బాబు దగ్గరకు వెళ్లి అడిగినప్పుడు 'చూద్దాంలే' అని ఓసారి, 'ఎంతమందికి పదవులు ఇస్తాను' అని ఓసారి అన్నారట...! బాబు తమను నిలువునా ముంచేశారని అన్నదమ్ములు అర్థం చేసుకున్నారు. తాజాగా చంద్రబాబు ఇద్దరికి గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ పదవులు ఖరారు చేశారు. 

వారిలో ఒకరు రామసుబ్బారెడ్డి, మరొకరు నంద్యాలకు చెందిన ఎన్‌ఎండీ ఫరూక్‌. ఆనం సోదరుల కంటే రాజకీయ ప్రయోజనాల రీత్యా వీరిద్దరికీ పదవులు ఇవ్వడం బాబుకు అనివార్యమైంది. 'మేం తప్పు చేశాం' అని సోదరులు సన్నిహితుల వద్ద వాపోతున్నారు. వివేకా కుమారుడు రంగమయూర్‌ రెడ్డికి జిల్లా తెలుగు యువత అధ్యక్ష పదవిని ఆఫర్‌ చేశారు బాబు. కాని పదవి తీసుకోకూడదని ఆనం సోదరులు నిర్ణయించారు. టీడీపీ కార్యక్రమాలకు, సమావేశాలకు వీరు హాజరు కావడంలేదు.

ఈమధ్య నెల్లూరులో పార్టీ కార్యక్రమం జరిగినప్పుడు దానికి హీరో కమ్‌ ఎమ్మెల్యే నందమూరి బాలయ్య ముఖ్య అతిథిగా వచ్చారు. అయినప్పటికీ ఆనం సోదరులు హాజరుకాలేదు. ఇద్దరు రాష్ట్రస్థాయి నాయకులు విస్మరించడం చంద్రబాబు చేసిన పొరపాటని కొందరు టీడీపీ నాయకులూ అంటున్నారట...! ప్రస్తుతం మౌనంగా ఉన్న సోదరులు ఏ పార్టీలోకి వెళతారో తెలియదు. చంద్రబాబు ఇంకేదైనా ఆశ చూపి వీరిని పార్టీలో ఉంచుతారో, పోతే పొమ్ముని ఊరుకుంటారో చూడాలి. 

Show comments