బ్లాక్ మనీ అంటే టాలీవుడ్డేనా.?

ఏదన్నా కొత్త సినిమా, అది కూడా పెద్ద సినిమా విడుదలవుతోందంటే చాలు, ఆదాయపు పన్ను శాఖ అధికారుల ఆకస్మిక దాడులు షురూ అవుతాయి. ఎందుకిలా.? ఇది ఎప్పటికీ ఎవరికీ అర్థం కాని మిలియన్‌ డాలర్ల ప్రశ్న. 

50 కోట్ల బడ్జెట్‌తో సినిమా రూపొందించాం.. 70 కోట్ల బడ్జెట్‌తో సినిమా చేశాం.. అని నిర్మాతలు ప్రకటించడం, 100 కోట్ల బిజినెస్‌ అయ్యింది.. అనే ప్రచారం.. వెరసి, పెద్ద సినిమాలు సహజంగానే ఆదాయపు పన్ను శాఖను 'దాడుల కోసం' ఆహ్వానించేస్తుంటాయి. దాంతో, ఆటోమేటిక్‌గా ఆదాయపు పన్ను శాఖ ఆయా సినీ నిర్మాతలు, నటీనటులపై ఆకస్మిక దాడులు చేయాల్సి వస్తోంది. 

బాగానే వుంది.. ఇక్కడికిది నిర్మాతల తప్పు అనో, సినిమాపై జరిగిన ప్రచారం తప్పు అనో.. ఇంకోటనో అనుకుందాం. మరి, ఫలానా రాజకీయ ప్రముఖుడు ఎన్నికల్లో గెలవడం కోసం ఇన్ని కోట్లు ఖర్చు చేశాడట.. అనే ప్రచారం తెరపైకొచ్చినప్పుడు, ఆయనగారిమీద ఐటీ దాడులు ఎందుకు జరగవు.? ఇది కూడా మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. 

ఇప్పుడు 'బాహుబలి' సినిమా మీద ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఆర్కా మీడియా సంస్థ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. కారణం అందరికీ తెల్సిందే.. 'బాహుబలి' ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. 600 కోట్లు వసూలు చేసిందంటూ 'బాహుబలి' గురించి రచ్చ రచ్చ చేసి పారేశారు. 'బాహుబలి-2'కి ఏకంగా వెయ్యి కోట్ల బిజినెస్‌ అయ్యిందనే ప్రచారం తెరపైకొచ్చింది. సాధారణంగా ఇలాంటి ప్రచారాలపై నిర్మాత పెదవి విప్పరు.. ఎంజాయ్‌ చేస్తుంటారు. అక్కడే వస్తోంది చిక్కు అంతా. 

తెలుగు రాష్ట్రాల్ని ఓటుకు నోటు కేసు కుదిపేసింది. ఆ ఘటనలో మొత్తం డీల్‌ 5 కోట్లు. దొరికింది 50 లక్షలు. ఆరోపణలు ఎదుర్కొన్న ఏ రాజకీయ ప్రముఖుడి మీద అయినా ఐటీ దాడులు జరిగాయా.? జరగవుగాక జరగవు. సినిమా అనేది ఐటీ శాఖకి సింపుల్‌ టార్గెట్‌. ప్రతిసారిలానే ఈసారి కూడా టాలీవుడ్‌ కుదేలయ్యింది. నాగచైతన్య నటించిన 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమా విడుదలైనా, కరెన్సీ మార్పిడి కష్టాలతో ఆ సినిమా తీవ్ర ప్రభావానికే గురైన మాట వాస్తవం. థియేటర్లన్నీ గగ్లోలు పెట్టేస్తున్నాయి.. చాలా థియేటర్లు ప్రదర్శనల్ని కూడా రద్దు చేసేసుకున్నాయి. తెరవెనుక సినిమా కష్టాలు ఎవరికీ అనవసరం.. తెరపై కన్పించే హంగులే.. సినీ పరిశ్రమని ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. ప్చ్‌.. ఇది తెలుగు సినిమాకి శాపమేమో.!

Show comments