ముద్రగడ ఇంటికి.. వాట్‌ నెక్స్‌ట్‌.?

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటికి వెళుతున్నారు. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి నుంచి ఆయన్ను, సన్నిహితులు, అనుచరులు సొంత గ్రామం కిర్లంపూడికి తరలిస్తున్నారు. 14 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న (?!) ముద్రగడ పద్మనాభం, కాస్సేపట్లో దీక్షను విరమిస్తారనే ప్రచారం జరుగుతోంది. 

కాపు ఐక్య గర్జన బహిరంగ సభ తదనంతర పరిణామాల నేపథ్యంలో జరిగిన తుని విధ్వంసం ఘటనలో అరెస్టయిన 13 మంది నిందితులు బెయిల్‌పై విడుదలవడంతో ముద్రగడ దీక్ష విరమించేందుకు సుముఖంగా వున్నారంటూ ఆయన సన్నిహితులు చెబుతోన్న విషయం విదితమే. 14 రోజులుగా ఆసుపత్రిలో ఆయనకు వైద్య చికిత్స అందిస్తున్న వైద్యులు, దీక్ష విరమణపై ముద్రగడ తమకు సమాచారం ఇచ్చారని ఇప్పటికే ప్రకటించారు. 

అయితే, కిర్లంపూడికి చేరుకున్నాకే ముద్రగడ పద్మనాభం భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటించే అవకాశం వుంది. దీక్ష కొనసాగించడం ద్వారా కాపు రిజర్వేషన్లపై పోరుని మరింత ఉధృతం చేసే అవకాశం వున్నప్పటికీ, ముద్రగడ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా అదంత క్షేమం కాదని సన్నిహితులు సూచిస్తున్నారట. మరోపక్క ఇకపై వ్యక్తిగత దీక్షలు కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య నేతలంతా ఒకేసారి నిరవధిక దీక్షలు చేసేలా వ్యూహాలు సిద్ధం చేశారట సన్నిహితులు. 

ఇదిలా వుంటే, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యే క్రమంలో తనను పోలీస్‌ వాహనంలో తీసుకెళ్ళాలనీ, కలెక్టర్‌, ఎస్పీ తదితర అధికారుల సమక్షంలోనే దీక్ష విరమిస్తానని ముద్రగడ భీష్మించుక్కూర్చున్నా, ప్రభుత్వం స్పందించకపోవడంతో చేసేది లేక ముద్రగడ సన్నిహితులు ఆయన్ని తమ సొంత వాహనాల్లో కిర్లంపూడికి తరలించినట్లు తెలుస్తోంది. 

అంతా బాగానే వుందిగానీ, బెయిల్‌పై విడుదలైన నిందితులపై కొత్తగా కేసులు నమోదైతే, వారు మళ్ళీ అరెస్టయితే ముద్రగడ ఇంకోసారి దీక్ష చేస్తారా.? నిందితుల విడుదల కోసం దీక్ష చేస్తున్న ముద్రగడ, కాపు రిజర్వేషన్ల ఉద్యమం కోసం ఏం చేస్తారు.? ఆయన తదుపరి రాజకీయ వ్యూహమేంటి.? వంటి ప్రశ్నలకు మాత్రం సమాధానం దొరకడంలేదు. కాస్సేపట్లో ముద్రగడ మీడియా ముందుకు వచ్చే అవకాశముందన్న ప్రచారం నేపథ్యంలో, పై ప్రశ్నలకు ఆయన సమాధానిమిస్తారేమో వేచి చూడాలి.

Show comments