మోడీ సర్కారుకు జెల్లకాయ పడింది!

తమ నాయకుడికి అపరిమితమైన క్రేజ్ ఉన్నదని డప్పుకొట్టుకుంటేనో... తమకు తిరుగులేని మెజారిటీ ఉన్నది గనుక.. తలచిందంతా చేసేస్తాం అంటూ విర్రవీగితేనో సరిపోదు. అలా అభ్యంతరాలను లెక్కచేయకుండా అహంకారంతో దూసుకుపోయే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సోమవారం నాడు జెల్లకాయ పడింది. అసలే పాలక కూటమికి బలంలేని రాజ్యసభలో.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓ బిల్లు.. విపక్షాలు ప్రతిపాదించిన సవరణలతో ఆమోదం పొందడం విశేషం. అయితే ఈ సందర్భంగా జరిగిన వాదోపవాదాలు సమస్తం ప్రభుత్వం పరువును పలుచన చేసేసేవే. 

జాతీయ వెనుకబడిన కులాల కమిషన్ ఏర్పాటు అనే అంశం మీద ఒక రాజ్యాంగ సవరణ బిల్లును  ప్రభుత్వం రాజ్యసభ ముందుకు తెచ్చింది. ఈ బిల్లుకు విపక్షాలు నాలుగు సవరణల్ని ప్రతిపాదించాయి. సవరణలకు తలొగ్గడం నిజానికి ప్రభుత్వానికి పరువు చేటు చర్య. సభలో ఈ బిల్లు గురించి తీవ్రమైన వాదోపవాదాలు జరిగాయి. పరిస్థితి ఎంత తీవ్రంగా మారిందంటే.. విపక్ష సభ్యులు రాజ్యసభ చైర్మన్ పోడియం వద్దకు వచ్చి మరీ సవరణలపై గట్టిగా తమ డిమాండును వినిపించారు. మరోవైపు అధికార పక్షం తరఫున మంత్రి అరుణ్ జైట్లీ కూడా పోడియం వరకూ వచ్చి.. విపక్షాలకు సర్ది చెప్పడానికి చాలా తంటాలు పడ్డారు. ఇంత చేసినా విపక్ష సభ్యులు మాత్రం వెనక్కు తగ్గలేదు. వారు పట్టుపట్టడంతో.. సవరణలపై ఓటింగ్ జరిగింది. సవరణలన్నీ ఆమోదం పొందాయి. ప్రభుత్వానికి ఠస్సా పడింది. తీవ్రమైన వాగ్యుద్ధం అనంతరం ఒక సవరణను తొలగించి మళ్లీ ఓటింగ్ నిర్వహించారు. సంపూర్ణ మెజారిటీతో  బిల్లు నెగ్గింది. విపక్షాలు పైచేయి సాధించినట్లు అయింది.

ఈ వ్యవహారంలో గమనించాల్సిన కీలకాంశం ఏంటంటే.. మోడీ ప్రభుత్వం తాము ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటాం అనుకోడానికి వీల్లేకుండా.. రాజ్యసభ ప్రస్తుతం ఓ అడ్డుగోడగా ఉంది. అందుకే మోడీ సర్కారు కూడా రాజ్యసభలో తమ బలం పెంచుకోవడానికి ఫోకస్ పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పెద్దలసభలో కూడా తమకు సంపూర్ణ మెజారిటీ వచ్చే వరకు పావులు కదిపితే.. ఆ తర్వాత.. ఎలాంటి తీవ్ర నిర్ణయాలు అయినా తీసుకోవచ్చుననేది మోడీ సర్కారు వ్యూహం. ప్రస్తుతం కొత్తగా తమతో జతకట్టిన జేడీయూ తో కలిపి రాజ్యసభలో కేవలం 89 మంది సభ్యుల బలమే ఉన్న ఎన్డీయే ఎప్పటికి పూర్తి బలం సంతరించుకుంటుందో చూడాలి. 

Show comments