వైసీపీ మీద బురదే.. చంద్రబాబు లక్ష్యం!

ప్రస్తుతం నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతున్న తరుణంలో దీనిద్వారా రాజకీయ పార్టీలు, నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో, ఒక్కో రకంగా లబ్ధిపొందడానికి చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. భూమా నాగిరెడ్డి హఠాన్మరణం పర్యవసానంగా ఏర్పడిన ఖాళీలో జరుగుతున్న ఉప ఎన్నిక ఇది!

సాధారణంగా హఠాన్మరణాల నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులకే టిక్కెట్ ఇస్తే గనుక.. ఇతర పార్టీలు పోటీచేయకుండా ఉండడం తెలుగురాష్ట్రాల్లో ఇదివరకు ఒక సంప్రదాయంగా ఉండేది. తెలుగుదేశం, వైకాపా కూడా కొన్ని సందర్భాల్లో దాన్ని పాటించాయి.

అయితే.. ఇలా ఏకగ్రీవ ఎన్నిక జరగాలంటే.. వారసులకు టికెట్ ఇచ్చిన పార్టీ నేతలు.. ప్రతిపక్షం వద్దకు వెళ్లి.. ఏకగ్రీవానికి సహకరించాలని వ్యక్తిగతంగా కోరడం సాంప్రదాయం. అయితే.. నంద్యాల ఉప ఎన్నిక విషయంలో చంద్రబాబునాయుడు తెలుగుదేశం తరఫున ఆ బాధ్యత తీసుకోకుండా భూమా నాగిరెడ్డి కుటుంబాన్ని గాలికొదిలేశారనే చెప్పాలి.

అడగందే అమ్మయినా అన్నం పెట్టదని సామెత. అలాంటిది తెదేపా కోరకుండానే.. వైకాపా పోటీలోంచి తప్పుకుంటే ప్రజల్లోకి చాలా ప్రతికూల సంకేతాలు పంపినట్లు అవుతుంది. ఆ నేపథ్యంలో జగన్.. నంద్యాలలో తమ అభ్యర్థిగా శిల్పా మోహన్ రెడ్డి పేరును ప్రకటించారు. చంద్రబాబు తాజాగా పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో వైసీపీ వద్దకు తమ నేతల్ని పంపకుండా పోటీ పెట్ట వద్దంటూ పత్రికా ముఖంగా కోరుదాం అని... పోటీకి సిద్ధమవుదాం అని సూచించారు.

Readmore!

ఇందులో మెలిక ఏంటంటే.. ‘‘ప్రజల దృష్టిలో తాము వైసీపీని కోరినట్లే ఉండాలి. అందుకే పత్రికా ప్రకటన ఇద్దాం అనుకుంటున్నారు. అలాగే.. వైసీపీ తమ ప్రతిపాదనను తిరస్కరించాలి...’’ అనేదే తెదేపా కోరికగా కనిపిస్తోంది. అలా జరిగితే.. కనీసం మానవతా కోణంలో భూమా మరణం తర్వాత ఏకగ్రీవానికి సహకరించలేదంటూ.. జగన్ మీద బురద చల్లడానికి ఓ అవకాశం దక్కుతుందని చంద్రబాబు ముచ్చటపడుతున్నట్లుగా ఉంది.

ఏదో ఒకరకంగా ఎన్నికలకు ముందు వైసీపీ మీద బురద చల్లి, వారిని ఇరుకున పెట్టి లబ్ధి పొందజూస్తున్నట్లు కనిపిస్తోంది. వారి తీరు గుడ్డ కాల్చి మొఖాన వేసి.. చోద్యం చూసే చందంగా కనిపిస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

పుష్కలంగా వక్రనీతి!

నంద్యాల ఉప ఎన్నిక భూమా హఠాన్మరణం నేపథ్యంలో జరుగుతున్న ఎన్నిక గనుక... ఏకగ్రీవంగా దాన్ని పూర్తిచేయడానికి సహకరించాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ ను అడగడం తెలుగుదేశానికి పెద్ద విషయం ఎంతమాత్రమూ కాదు. కాకపోతే అందులోనూ చంద్రబాబు వక్రనీతి పుష్కలంగా కనిపిస్తోంది. ఎవరో ఒకరిని తమ పార్టీ మంత్రిని, జగన్ వద్దకు స్వయంగా ఒకసారి పంపితే సరిపోతుంది. కానీ మరో కోణంలోంచి చూసినప్పుడు నంద్యాల ఉపఎన్నిక ఏకగ్రీవంగా జరగడం చంద్రబాబుకే ఇష్టం లేదేమో అనే వాదనలు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

ఎందుకంటే... భూమా కుటుంబానికి అసలు తెలుగుదేశంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఎంతమాత్రం ఆదరణ ఉందో, ప్రజలు ఇంకా వారి వెన్నంటి ఉన్నారో లేదో తెలుసుకోవడానికి చంద్రబాబు ఈ ఎన్నికను లిట్మస్ టెస్ట్ లాగా వాడుకోదలచుకున్నారని కొందరు వాదిస్తున్నారు. దాని వలన.. భూమా కుటుంబానికి ఆదరణ తగ్గిందని నిరూపణ అయితే గనుక.. అఖిలప్రియకు తమ పార్టీలో అందుతున్న ప్రాధాన్యానికి కూడా కోత పెట్టే ఉద్దేశం ఉన్నదని కూడా ఒక వాదన ఉంది.

అందుకే అటు వైకాపా మీద బురద చల్లడానికి మరియు అఖిలప్రియ (భూమా కుటుంబం) బలాన్ని బేరీజు వేయడానికి ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా నంద్యాల ఉపఎన్నిక ఏకగ్రీవం కాకూడదని చంద్రబాబు కోరుకుంటున్నట్లు కొందరు అంటున్నారు.

Show comments