'చీప్‌' మినిస్టర్‌ చంద్రబాబు.!

మరీ చంద్రబాబు అంత 'చీప్‌'గా కనిపిస్తున్నారా.? ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుని చీఫ్‌ (ముఖ్య) మినిస్టర్‌గా కాకుండా చీప్‌ (చులకన) మినిస్టర్‌గా చూస్తున్నారా.? అసలేం జరుగుతోంది.? రండి బాబూ రండి.. మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి.. మీకు భూములు కావాలంటే ఇస్తాం, రాయితీలు కల్పిస్తాం.. అంటూ చంద్రబాబు పారిశ్రామికవేత్తలకు రెడ్‌ కార్పెట్‌ వేస్తోంటే, ఎవరూ ముందుకు రావడంలేదు సరికదా, వస్తున్నాం.. అన్నట్లు బిల్డప్‌ ఇచ్చి, 'చీప్‌' కోరికలు కోరుతోంటే, ఇక్కడ లోపం చంద్రబాబులోనే వుందేమో అన్పిస్తోంది. 

ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా ఎకరం లక్ష రూపాయలకు దొరకని పరిస్థితి. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఓ చిన్న గ్రామంలో ఇంటి స్థలం కొనాలన్నా గజం 2 వేల పైనే పలుకుతోందిప్పుడు. అలాంటిది, ఎకరం భూమి కేవలం ఒక్క రూపాయికే కట్టబెట్టేయాలంటోంది ఓ ప్రముఖ సంస్థ. అది కూడా ఆషామాషీ సంస్థ కాదండోయ్‌, దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులున్న సంస్థ. అదే రిలయన్స్‌ గ్రూప్‌. 

విశాఖలో రిలయన్స్‌ గ్రూప్‌ డిఫెన్స్‌కి సంబందించిన వ్యవహారాల కోసం 2 వేల ఎకరాల భూముల్ని అడుగుతోంది. అది కూడా, ఎకరం కేవలం రూపాయికే కావాలట. ఇచ్చేద్దామా.? అప్పనంగా అడిగినా బాగుండేదేమో.! 'మేం పెట్టుబడులు పెడతాం.. మాకు భూముల్ని ఉచితంగా ఇవ్వండి..' అని అడిగి వుంటే, 'ఏమో.. దానివల్ల ప్రయోజనం వుంటుందేమో..' అని ఆలోచించొచ్చు. ప్రభుత్వం పెద్ద మనసుతో ఆలోచిస్తే మంచిది.. అనే భావన కొందరిలో అయినా కలిగేది. 

కానీ, ఎకరం రూపాయికి కావాలనడమేంటి.? ఇది వెకిలితనానికి పరాకాష్ట. ఆంధ్రప్రదేశ్‌ దేబిరింతలకి.. పెట్టుబడిదారుల వెకిలితనానికీ సరిగ్గా సరిపోయింది. మొన్నామధ్య సీఐఐ భాగస్వామ్య సదస్సుని విశాఖలో ప్రభుత్వం ఘనంగా నిర్వహించేసింది. దాదాపు ఐదు లక్షల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని ఘనంగా చెప్పుకుంది చంద్రబాబు సర్కార్‌. ఏదీ ఎక్కడ.? అర్థ రూపాయి పెట్టుబడి అయినా అధికారికంగా వచ్చిందా.. ఆ ఒప్పందాలకు సంబంధించి.? 

చంద్రబాబు ఇలా పబ్లిసిటీ స్టంట్లు చేస్తోంటే, పెట్టుబడులు - ఒప్పందాలు అంటూ హడావిడి చేసే సంస్థలు ఇదిగో, ఇలాగే వెకితనంతో కూడిన వెటకారం చేస్తాయి మరి.!

Show comments