మహారాష్ట్రలో మజ్లిస్ పార్టీకి 'మహా' దెబ్బ తగిలింది. అలా ఇలా కాదు, ఓ రేంజ్‌లో తగిలేసింది దెబ్బ. ఎన్నికల కమిషన్, స్థానిక ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా మజ్లిస్ పార్టీకి ఝలక్ ఇచ్చింది. ఆదాయ, వ్యయాలకు సంబంధించిన లెక్కల్ని చూపడంలో మజ్లిస్ అలసత్వం ప్రదర్శించడాన్ని ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుంది.
ఎన్నికల సంఘం నిషేధం విధించడంతో, మహారాష్ట్రలో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ పోటీ చేయడానికి వీలుండదు. మజ్లిస్ పార్టీ అభ్యర్థులు మాత్రం స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు అవకాశముంది. ఎన్నికల కమిషన్ ఇచ్చిన షాక్‌తో మజ్లిస్ పార్టీ వర్గాల్లో ఆందోళన మొదలయ్యింది. ఓ రాష్ట్రంలో గుర్తింపు పొందడం చాలా కష్టమైన విషయమే. అలాంటిది, వున్న గుర్తింపుని కోల్పోవాల్సి రావడమంటే పరువు పోయినట్లే.
2015లో మహారాష్ట్రలో జరిగిన స్థానిక ఎన్నికల్లో ఔరంగాబాద్ మునిసిపాలిటీలో చెప్పుకోదగ్గ సీట్లు సంపాదించింది మజ్లిస్ పార్టీ. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ మజ్లిస్ పార్టీ తన ఉనికిని చాటుకున్న విషయం విదితమే. అదే సమయంలో, మహారాష్ట్రలో మజ్లిస్ పార్టీ అనేక వివాదాల్ని ఎదుర్కొంటోంది. త్వరలో బీఎంసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని మజ్లిస్ కోల్పోవడాన్ని ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.