శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ప్రేమికుడు’ సినిమా తమిళ వెర్షన్ ‘కాదలన్’ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రత్యేకించి తెలుగు వారికి! ఎందుకంటే.. ఆ సినిమా తమిళ వెర్షన్ లో చాలా తెలుగు డైలాగులుంటాయి. హీరోయిన్ నగ్మా ఆ సినిమాలో తెలుగమ్మాయి! ఆమె తండ్రి పాత్రలో చేసిన గిరీష్ కర్నాడ్ సినిమాలో తెలుగు వ్యక్తి. అతడు చేసింది గవర్నర్ పాత్ర. ఒక తెలుగు వ్యక్తి తమిళనాడు గవర్నర్ ఉంటాడు ఆ సినిమాలో. ఆ గవర్నరేమో అక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. విధ్వంసాలు చేయిస్తూ.. అంశాతి రగిలేలా చేస్తూ తమిళనాడు ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు యత్నించే తెలుగు వాడైన గవర్నర్ పాత్ర గిరీష్ కర్నాడ్ ది.
ఈ పాత్ర మర్రి చెన్నారెడ్డిని ఉద్దేశించినది అనేది చాలా మంది అభిప్రాయం. గవర్నర్ పాత్ర.. తెలుగులో మాట్లాడటం.. చేతిలో పొన్నుకర్ర.. ఇవన్నీ కూడా గిరీష్ కర్నాడ్ పాత్ర చెన్నారెడ్డిని ఉద్దేశించినదే అనే అభిప్రాయానికి బలాన్ని చేకూరుస్తాయి. అసలే సామాజిక విషయాలను తన సినిమాల్లో ప్రస్తావించే అలవాటున్న శంకర్ దర్శకత్వంలోని సినిమా కావడంతో.. సినిమా చెన్నారెడ్డి గవర్నర్ గిరిపై సంధించిన అస్త్రం అనుకోవాల్సి ఉంటుంది.
ఆ విధంగా మొదలుపెడితే.. తమిళనాట తెలుగు వాళ్లు గవర్నర్లు గా ఉన్న సమయం ఏదో ఒక వివాదం అయితే రేగడం ఖాయంగా కొనసాగుతోంది. చెన్నారెడ్డి హయాంలో జరిగిన వ్యవహారాలతో మొదలుపెడితే విద్యాసాగర్ రావు వరకూ తెలుగు గవర్నర్ల హయాంలో అక్కడ రాజకీయ సంచలనాలు చోటు చేసుకున్నాయి.
జయలలిత ప్రాసిక్యూషన్ కు అనుమతిని ఇచ్చింది మర్రి చెన్నారెడ్డి! ముఖ్యమంత్రి హోదాలోని వ్యక్తిని ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ అనుమతి తప్పనిసరి.. రబ్బర్ స్టాంపులుగా వ్యవహరించే గవర్నర్లు అందుకు సాధారణంగా అనుమతిని ఇవ్వరు. అయితే చెన్నారెడ్డి ఆ ధైర్యం చేశారు.
ఇక ఆస్తుల కేసు ఆరంభం సమయంలో చెన్నారెడ్డి గవర్నర్ గా ఉండగా.. జయలలితకు శిక్ష ఖరారు అయినప్పుడు తమిళనాడుకు గవర్నర్ గా రోశయ్య రూపంలో తెలుగువాడు ఉన్నారు! జయలలిత సీఎం హోదాలో ఉన్నప్పుడే ఆస్తుల కేసులో తీర్పు వచ్చింది. ఆమెకు శిక్ష ఖరారు అయ్యింది. జయ చేత రాజీనామా చేయించింది రోశయ్య.. అయితే ఆ తర్వాత రాజకీయాల విషయంలో మాత్రం అన్నాడీఎంకే ఆకాంక్షల మేరకే ఆయన వ్యవహరించాడు.
ఆ తర్వాత జయ చేత ప్రమాణ స్వీకారం చేయించింది కూడా రోశయ్యే కావడం గమనార్హం. ఇక తాజా తమిళనాడు రాజకీయ అంతర్యుద్ధం, ఆధిపత్య పోరులో కూడా ఒక తెలుగు వ్యక్తి పాత్ర.. అందునా గవర్నర్ హోదాలోనే ఉండటం ఆసక్తికరమైన అంశం. ఇప్పుడు తమిళ రాజకీయాల్లో గవర్నర్ విద్యాసాగర్ రావు పాత్రేమిటో ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు. మొత్తం రాజకీయం ఇన్ని మలుపులు తిరగడానికి కారణం ఆయనే! కేంద్రం ఆదేశాల మేరకే అయినా.. మరో తెలుగు వ్యక్తి తమిళనాడు రాజకీయాలను గవర్నర్ హోదాలో మలుపులు తిప్పుతున్నాడు!
చిత్రం: జయ కేసు తీర్పు నేపథ్యంలో మర్రిచెన్నారెడ్డి మనవడు ట్వీట్ చేసిన ఫొటో.