కమల్‌హాసన్‌ ప్రశ్నలు పబ్లిసిటీ కోసమేనా.?

తెలుగునాట 'ప్రశ్నిస్తాను' అని చెప్పి రాజకీయాల్లో హల్‌చల్‌ చేద్దామనుకున్న ఓ సినీ ప్రముఖుడు, ప్రశ్నించడం మానేసి, మౌనవ్రతం చేపట్టాడు. తమిళ రాజకీయాల్లో మాత్రం, ఒకాయన ప్రశ్నించి పదే పదే వివాదాల్ని కొనితెచ్చుకుంటున్నారు. ఈయనేమీ రాజకీయ ప్రముఖుడు కాదు. రాజకీయాలంటే అతనకు పెద్దగా ఆసక్తి లేదంటాడు. కానీ, రాజకీయాల్ని ప్రశ్నిస్తానంటాడు. అదే అతని ప్రత్యేకత. 

విశ్వనటుడు కమల్‌హాసన్‌, ఈ మధ్య తమిళనాడులో రాజకీయ నాయకులకంటే ఎక్కువగా మీడియాలో కన్పిస్తున్నారు.. అదీ పొలిటికల్‌ కాలమ్స్‌లో. కారణం అందరికీ తెల్సిందే, అధికారంలో వున్న అన్నాడీఎంకే (శశికళ వర్గానికి) వ్యతిరేకి కమల్‌హాసన్‌. అద్గదీ అసలు విషయం. మంత్రుల అవినీతిపై కమల్‌హాసన్‌ గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. దాంతో, మంత్రులూ కమల్‌పై దుమ్మెత్తి పోసేస్తున్నారు. 

ఇంకోపక్క, కమల్‌హాసన్‌ హోస్ట్‌ చేస్తున్న 'బిగ్‌బాస్‌' కూడా వివాదాస్పదమవుతోంది. హిందూ మత విశ్వాసాలకు వ్యతిరేకంగా, సంస్కృతీ సంప్రదాయాల్ని కించపర్చేలా కమల్‌ వ్యవహరిస్తున్నారంటూ కొంతమంది కోర్టులకు వెళ్ళిన విషయం విదితమే. అయినా, కమల్‌హాసన్‌ 'డోన్ట్‌ కేర్‌' అంటున్నాడు. 'సోకాల్డ్‌ హిందూ అతివాదులు చేస్తున్న ఓవరాక్షన్‌ని నేను లెక్కచేయను..' అని తెగేసి చెబుతున్నాడు. 

కమల్‌ ప్రశ్నించేతత్వానికి సంబంధించి కథ చాలానే వుంది. మలయాళ నటి భావన వ్యవహారంపై, 'మీడియా ఆమె పేరుని ఎందుకు ప్రస్తావించడంలేదు.? ఆమెను బాధితురాలిగా చూడొద్దు, ఫైటర్‌గా భావించి ఆమెకు గౌరవాన్నివ్వండి.. జాలి చూపించొద్దు..'' అంటూ వ్యాఖ్యానించి కొత్త వివాదానికి కేరాఫ్‌ అడ్రస్‌గా నలిచారు. జల్లికట్టు వివాదం దగ్గర్నుంచి కమల్‌ ఈ తరహా వివాదాల్లో జోక్యం చేసుకోవడంలో జోరు పెంచేశారని చెప్పక తప్పదు. ఇంతకీ, కమల్‌ ఇదంతా ఎందుకు చేస్తున్నట్లు.? పబ్లిసిటీ కోసం కాదు కదా.! 

'చేతనైతే కమల్‌ రాజకీయాల్లోకి రావాలి..' అంటూ తమిళ రాజకీయ ప్రముఖులు సవాల్‌ విసురుతోంటే, ఓ పౌరుడిగా ప్రశ్నించే హక్కు తనకుందనీ, రాజకీయాల్లోకి రావాలా.? వద్దా.? అన్నది తన వ్యక్తిగత నిర్ణయమని అంటున్నాడు కమల్‌. మొత్తమ్మీద, కమల్‌ గత కొద్దికాలంగా తమిళనాడు రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌ అయ్యాడు. అయినాసరే, రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని పదే పదే కమల్‌ తేల్చి చెబుతుండడం విశేషమే మరి.

Show comments